ఎర్రసముద్రంలో అలజడి

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రపంచాన్ని మరో ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి వంటి సూయెజ్‌ కాలువ మార్గంలోని ఎర్ర సముద్రంలో రవాణా నౌకలకు భద్రత కరవైంది. యెమెన్‌లోని హూతీలు అక్కడ దాడులకు తెగబడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది తలనొప్పిలా పరిణమించింది.

Published : 22 Dec 2023 00:27 IST

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రపంచాన్ని మరో ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి వంటి సూయెజ్‌ కాలువ మార్గంలోని ఎర్ర సముద్రంలో రవాణా నౌకలకు భద్రత కరవైంది. యెమెన్‌లోని హూతీలు అక్కడ దాడులకు తెగబడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది తలనొప్పిలా పరిణమించింది.

కొన్నాళ్లక్రితం హమాస్‌ మూకలు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెరలేచింది. హమాస్‌ను అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్‌ గాజాపై ముప్పేట దాడులతో విరుచుకుపడింది. అమెరికా టెల్‌అవీవ్‌కు మద్దతుగా మధ్యధరా సముద్రంలో యుద్ధనౌకలను మోహరించింది. మరోవైపు, పలు ఇస్లామిక్‌ దేశాలు గాజాకు మద్దతుగా ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇరాన్‌ అండతో లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు తాము సైతం యుద్ధానికి సిద్ధమన్నారు. హూతీలు కొన్ని బాలిస్టిక్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌లోని ఇలాట్‌ నగరంపైకి ప్రయోగించారు. కానీ, లక్ష్యాలు సుదూరంగా ఉండటంతో మార్గమధ్యంలోనే కొన్ని కూలిపోయాయి. మరికొన్నింటిని అమెరికా, ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. దీంతో హూతీలు బాబ్‌-అల్‌- మండెబ్‌ జలసంధి వద్ద ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న నౌకలనే లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలు పెట్టారు. అత్యంత రద్దీగా ఉండే జలమార్గాల్లో ఇది కూడా ఒకటి. గత నెల తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ‘గెలాక్సీ లీడర్‌’ నౌకను హూతీలు హైజాక్‌ చేశారు. దీనిలోని దాదాపు రెండు డజన్ల మందిని బందీలుగా చేసుకోవడంతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఆ తరవాత కూడా పదికి పైగా నౌకలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, రాకెట్లతో వందకుపైగా దాడులు చేశారు.

ఆర్థిక భారం తప్పదు

హూతీల దాడులతో ముప్పు తీవ్రమై, నౌకల బీమా రేట్లు భారీగా పెరిగాయి. డిసెంబరు మొదట్లో నౌక విలువలో 0.05-0.07 శాతంగా ఉన్న ప్రీమియం ఇప్పుడు 0.5-0.7 శాతానికి చేరినట్లు తెలుస్తోంది. అగ్రశ్రేణి దిగ్గజ షిప్పింగ్‌ కంపెనీలు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేశాయి. బ్రిటిష్‌ పెట్రోలియం కూడా వీటితో జత కలిసింది. దీంతో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఆసియా-ఐరోపా మధ్య ప్రయాణించే చాలా రవాణా నౌకలు తమ మార్గాన్ని ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌’ వైపు మళ్ళించాయి. ఫలితంగా అదనంగా వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో సరకు రవాణా  రెండు నుంచి మూడు వారాలపాటు జాప్యమవుతుంది. ఈ మార్పుతో కేవలం భారత్‌లోని షిప్పింగ్‌ కంపెనీలపై రవాణా ఖర్చు 30శాతం దాకా పెరిగే అవకాశముంది.  జపాన్‌, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలపై ఈ భారం మరింతగా ఉండవచ్చు. దీనికితోడు ఈ మార్గంలో తుపానులు అధికం. జాప్యం కారణంగా నౌకల డిమాండ్‌ గణనీయంగా పెరగవచ్చు. రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనే చమురు ప్రస్తుతానికి సూయెజ్‌ కాలువ మార్గంలోనే వస్తోంది. రష్యా-ఇరాన్‌ మధ్య సత్సంబంధాలు ఉండటంతో సమస్య లేదు. కానీ, ఐరోపా నుంచి దిగుమతి అయ్యే సరకుల విషయంలో భారత్‌ కొంత భయపడుతోంది. ఇటీవల ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో చర్చల సమయంలో ప్రధాని మోదీ ఎర్ర సముద్రం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం ఇదే.

అగ్రరాజ్యానికీ తిప్పలు

ఎర్ర సముద్రంలోని పరిణామాలు అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ప్రపంచంలోని కీలకమైన హార్ముజ్‌, బాబ్‌-అల్‌-మండెబ్‌ జలసంధులపై ఇరాన్‌కు పట్టు పెరిగింది. దీంతో టెహ్రాన్‌ కీలు బొమ్మలైన హూతీల నుంచి ఈ మార్గాన్ని కాపాడేందుకు అమెరికా ‘ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌’ను తెరపైకి తెచ్చింది. బహ్రెయిన్‌ కేంద్రంగా పనిచేసే బహుళ దేశ సంస్థ కంబైన్డ్‌ మారిటైమ్‌ ఫోర్స్‌ (సీఎంఎఫ్‌)ను ముందుకు తీసుకొచ్చింది. ఇందులో భారత్‌ కూడా సభ్యదేశమే. సీఎంఎఫ్‌ అధీనంలోని సంయుక్త కార్యదళానికి ఆపరేషన్‌ బాధ్యతలు అప్పగించింది. మానవ అక్రమ రవాణా, బొగ్గు, ఆయుధ, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ను అడ్డుకొనేందుకు కొన్నేళ్లక్రితం ఈ దళాన్ని ప్రారంభించారు. మొత్తం 10 దేశాలు భాగస్వాములయ్యాయి. మరోవైపు టెహ్రాన్‌ వాషింగ్టన్‌ మధ్య ఘర్షణ వాతావరణం పెరిగే కొద్దీ బాబ్‌-అల్‌-మండెబ్‌లో ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉండదు. ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ మరో ఘర్షణను అమెరికా ఎదుర్కోవడం కష్టమవుతుందని ఇరాన్‌ అంచనా. మరోవైపు శ్వేతసౌధం మాత్రం ఇది ఆరంభం మాత్రమే అని చెబుతోంది. భారీయెత్తున నౌకాదళ సాధన సంపత్తిని అక్కడ మోహరిస్తున్నట్లు ప్రకటించింది. తమపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని హూతీ నేత అబ్దుల్‌ మాలిక్‌ అల్‌ హూతీ చేసిన ప్రకటన పరిస్థితి తీవ్రతను తెలియజెబుతోంది. ఫలితంగా ఎర్రసముద్రంపై ముసురుకొన్న యుద్ధమేఘాలు అంత తేలిగ్గా వైదొలగే పరిస్థితి కనిపించడం లేదు.

పి.ఫణికిరణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు