బ్రిక్స్‌ ఆశలపై సౌదీ చన్నీళ్లు

బ్రిక్స్‌ కూటమి అస్త్రంతో డాలర్‌ ఆధిపత్యాన్ని అంతం చేయాలని రష్యా, చైనాలు కంటున్న కలలకు సౌదీ అరేబియా గండి కొట్టింది. ఈ కూటమిలో చేరడానికి అది అంతగా ఆసక్తి చూపుతున్నట్లు లేదు.

Updated : 12 Feb 2024 06:59 IST

బ్రిక్స్‌ కూటమి అస్త్రంతో డాలర్‌ ఆధిపత్యాన్ని అంతం చేయాలని రష్యా, చైనాలు కంటున్న కలలకు సౌదీ అరేబియా గండి కొట్టింది. ఈ కూటమిలో చేరడానికి అది అంతగా ఆసక్తి చూపుతున్నట్లు లేదు. ముఖ్యంగా, అమెరికాతో తెగతెంపులు చేసుకోవడానికి సౌదీ వెనకడుగు వేస్తోంది.

బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో బ్రిక్స్‌ కూటమి ఏర్పడింది. తమతో చేరవలసిందిగా సౌదీ అరేబియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్ట్‌, అర్జెంటీనా, ఇథియోపియాలను నిరుడు ఆగస్టులో బ్రిక్స్‌ ఆహ్వానించింది. ఈ కూటమిలో చేరే యోచనను అర్జెంటీనా విరమించుకుంది. మిగిలిన దేశాలు ఈ ఏడాది జనవరి ఒకటిన అధికారికంగా బ్రిక్స్‌లో చేరినట్లు వార్తలొచ్చాయి. అంతలోనే సౌదీ మనసు మార్చుకుంది. బ్రిక్స్‌ ఆహ్వానాన్ని ఇప్పటికీ పరిశీలిస్తున్నామని ఇటీవల వెల్లడించింది. సౌదీ గోడ మీది పిల్లి వాటం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. సున్నీ సౌదీ అరేబియా, షియా ఇరాన్‌లు పశ్చిమాసియాపై ఆధిక్యానికి పోటీపడుతున్నాయి. సౌదీ, ఇరాన్‌లను ఒకే వేదికపైకి తేవడానికి చైనా, రష్యాలు ప్రయత్నిస్తుంటే- ఇజ్రాయెల్‌, సౌదీల మధ్య సహకారానికి అమెరికా కృషిచేస్తోంది. అమెరికా ప్రోత్సాహంతో భారత్‌ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపా వరకు ఏర్పరచే ఆర్థిక నడవా (ఐమెక్‌) ప్రాజెక్టులో భారత్‌తోపాటు సౌదీ, ఇజ్రాయెల్‌ సైతం భాగస్వాములుగా ఉన్నాయి.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరాటం, ఎర్ర సముద్రంలో చమురు రవాణా నౌకలపై హూతీల దాడులు ఐమెక్‌ను భగ్నం చేసే ప్రమాదం ఉంది. హమాస్‌, హూతీలకు ఇరాన్‌ అండదండలున్నాయి. అందువల్ల ఇరాన్‌, సౌదీలు బ్రిక్స్‌ ఒరలో ఇమడటం కష్టమే. మరోవైపు అమెరికన్‌ ఆయుధ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌తో ఇటీవల సౌదీ 11 ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికన్‌ ఆయుధ విడిభాగాలను సౌదీ గడ్డపై తయారు చేయడమే వీటి లక్ష్యం. ప్రపంచంలో అత్యధిక చమురు ఎగుమతిదారు అయిన     సౌదీ అరేబియా బ్రిక్స్‌లో చేరితే డాలర్‌ ఆధిపత్యం దెబ్బతింటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సౌదీ చమురు ఎగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరపడమే అమెరికన్‌ కరెన్సీ ఆధిపత్యానికి మూలం. సౌదీ, ఇరాన్‌, యూఏఈలు బ్రిక్స్‌లో చేరితే ప్రపంచ చమురు ఉత్పత్తిలో 47శాతం వాటా ఆ కూటమిదే అవుతుంది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. చైనాతో అగ్రరాజ్యం వాణిజ్య యుద్ధం సాగిస్తోంది. దీనివల్ల రష్యా, చైనాలు డాలర్‌ ఆధిపత్యాన్ని అంతం చేయాలనే పంతంతో ఉన్నాయి. ఈ ఏడాది బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రష్యా ఇందుకు మరింత ముమ్మరంగా కృషి చేయనుంది. నిరుడు బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా సైతం వ్యాపారం, పెట్టుబడులకు డాలర్‌ బదులు బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీని చేపట్టాలని పిలుపిచ్చారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పదేపదే వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్లలో తీసుకున్న రుణాలకు అధిక వడ్డీ చెల్లించలేక సతమతమవుతున్న వర్ధమాన దేశాలూ ప్రత్యామ్నాయాన్ని కోరు కుంటున్నాయి. స్థానిక కరెన్సీలలో, చైనీస్‌ యువాన్లలో రుణ సేకరణ, వాణిజ్య చెల్లింపులు జరపడానికి అవి సుముఖంగా ఉన్నాయి.

వర్ధమాన దేశాలు చమురుకు స్థానిక కరెన్సీలలో చెల్లింపులు జరపదలిస్తే స్వీకరిస్తామని సౌదీ ప్రకటించినా, ఇంతవరకు అది మొదలుకాలేదు. భారత్‌, యూఏఈలు మాత్రం స్థానిక కరెన్సీలలో చెల్లింపులు చేపట్టాయి. ఏది ఏమైనా, అమెరికాను పూర్తిగా దూరం చేసుకోవడానికి సౌదీ అరేబియా సిద్ధంగా లేదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. అమెరికాతో సన్నిహిత ఆర్థిక, రక్షణ సంబంధాలున్న భారత్‌ డాలర్‌ను వదిలి చైనా యువాన్లలో చెల్లింపులు జరపడానికి ఆసక్తి చూపడంలేదు. మరోవైపు డాలర్‌ను తాము వ్యతిరేకించడం లేదని, అంతర్జాతీయ చెల్లింపులకు ఇతర మార్గాలు ఉండాలని ఆశిస్తున్నామని దక్షిణాఫ్రికా బ్రిక్స్‌ రాయబారి అనిల్‌ సూక్‌లాల్‌ వివరించారు. వాస్తవానికి, డాలర్‌కున్న స్థిరత్వం బ్రిక్స్‌ దేశాల కరెన్సీలకు లేదు. అందువల్ల డాలర్‌ ఆధిపత్యం ఇప్పట్లో సన్నగిల్లే అవకాశాలు లేవని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. నేడు అమెరికా రుణ భారం 34 లక్షల కోట్ల డాలర్లకు చేరి జీడీపీలో 120శాతాన్ని మించిపోయింది. అందువల్ల డాలర్‌ ఆధిపత్యంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే, భవిష్యత్తులో పూర్తిగా డాలర్లపైనే ఆధారపడకుండా బంగారం, యూరో, యువాన్‌ తదితరాలతో పాటు డిజిటల్‌ కరెన్సీల సమ్మేళనాన్ని అంతర్జాతీయ చెల్లింపులకు ఉపయోగించే రోజు వచ్చే అవకాశం ఉంది.

 ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు