వంటనూనెలకు దిగుమతులే దిక్కు

వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారత్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఫలితాలు లభించడం లేదు. దాంతో ఏటా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

Published : 12 Feb 2024 00:45 IST

వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారత్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఫలితాలు లభించడం లేదు. దాంతో ఏటా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. నూనె గింజల పంటల విస్తీర్ణంతో పాటు ఉత్పాదకతను పెంచితేనే సమస్య పరిష్కారమవుతుంది.

దేశంలో వంటనూనెల ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముడి, శుద్ధిచేసిన వంటనూనెల దిగుమతిపై ఉన్న సుంకం రాయితీని 2025 మార్చి వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చితో ముగియాలి. శుద్ధిచేసిన సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెలపై కేంద్రం గతంలో దిగుమతి సుంకాన్ని 17.5శాతం నుంచి 12.5శాతానికి తగ్గించింది. పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు ముడినూనెలపై ఉన్న ప్రాథమిక సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈ నూనెలపై ఉన్న వ్యవసాయ సెస్‌ను సైతం అయిదు శాతానికి పరిమితం చేసింది. దీంతో దేశంలో వంట నూనెల ధరలు కొంతమేర తగ్గాయి. దిగుమతులు సైతం భారీగా పెరిగాయి. మరోవైపు అధిక దిగుమతుల కారణంగా భారత్‌లో నూనెగింజల ధరలు క్షీణిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం నూనెగింజల పంటల సాగు పెరగకుండా చేస్తుందని, రైతులను నిరుత్సాహపరుస్తుందని హెచ్చరిస్తున్నారు.  

అధిక గిరాకీ

వంటనూనెల దిగుమతిలో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ప్రధానంగా ఇండొనేసియా మలేసియాల నుంచి పామాయిల్‌, అర్జెంటీనా నుంచి సోయాబీన్‌ నూనె, ఉక్రెయిన్‌ రష్యాల నుంచి పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటోంది. బ్రెజిల్‌, థాయ్‌లాండ్‌ల నుంచి కొన్ని రకాల నూనెలు దిగుమతి అవుతున్నాయి. 2022-23 నవంబరు-అక్టోబరు మధ్య కాలంలో వంటనూనెల దిగుమతి గరిష్ఠస్థాయికి చేరుకుంది. మొత్తం 164.66 లక్షల టన్నులను ఇతర దేశాల నుంచి భారత్‌ కొనుగోలు చేసింది. దీనికోసం రూ.1.38 లక్షల కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దేశంలో నూనెగింజల ఉత్పత్తి గతంలో కంటే మెరుగుపడినప్పటికీ జనాభా పెరుగుదల, గిరాకీ కారణంగా దిగుమతులు అనివార్యమవుతున్నాయి. 2002-03లో వంటనూనెల దిగుమతులు 43.64 లక్షల టన్నులుండగా, కాలక్రమంలో అవి ఎన్నోరెట్లు పెరిగాయి. ప్రస్తుతం దేశీయ నూనె అవసరాల్లో 55శాతం మేర దిగుమతులే ఆధారమవుతున్నాయి.

దేశీయంగా వాతావరణ పరిస్థితులు పలు రకాల నూనెగింజల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఆవాలు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, కుసుమలు ప్రధాన నూనె గింజల పంటలు. తోట పంటల్లో కొబ్బరి ముఖ్యమైనది. సంప్రదాయేతర నూనెల్లో తవుడు(రైస్‌బ్రాన్‌), పత్తి విత్తనాల(కాటన్‌సీడ్‌)నూనెలు ప్రముఖమైనవి. మొత్తం దిగుమతుల్లో పామాయిల్‌దే అధిక వాటా. ప్రధానమైన తొమ్మిది రకాల నూనెగింజల ఉత్పత్తి 1986-87లో 113 లక్షల టన్నులు ఉండేది. 2022-23 నాటికి అది 409.9 లక్షల టన్నులకు చేరుకుంది. గిరాకీని తీర్చడానికి దేశంలో వంటనూనెల ఎగుమతులపై 2008లో కేంద్రం పరిమితులు విధించింది. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ఆహార అలవాట్లు, ఆహార శుద్ధి రంగంలో వృద్ధి వంటి అంశాలు సైతం వంటనూనెల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి. 2030-31 నాటికి దేశంలో వంటనూనెల డిమాండ్‌ 300 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇండియాలో తలసరి ఆహార నూనెల వినియోగం 1994-95లో 7.3 కిలోలు ఉండగా, 2021 నాటికి 18.76 కిలోలకు చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసిన వార్షిక తలసరి నూనెల వినియోగం 10.5 కిలోలే. ఈ నూనెలను వంటల్లోనే కాకుండా రంగులు, వార్నిష్‌లు, సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, కందెనలు తదితరాల తయారీలో వాడతారు. గింజల నుంచి నూనె తీసిన తరవాత మిగిలే పిప్పిని పశుగ్రాసంగా, సేంద్రియ ఎరువులుగానూ ఉపయోగించవచ్చు.

గిట్టుబాటుకాని సాగు

భారత్‌లో నూనెగింజ పంటల ఉత్పాదకత ప్రపంచ సగటుకంటే తక్కువ. దాంతో ఎక్కువమంది అన్నదాతలు ఆ పంటల సాగుపై ఆసక్తి చూపడం లేదు. నీటిపారుదల సౌకర్యాలను విస్తరించడం, అధిక దిగుబడులిచ్చే వంగడాల రూపకల్పన, పంట మార్పిడి, యాంత్రీకరణ, మద్దతు ధరకు కొనుగోలు వంటివి విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడతాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీలో భారత్‌ వెనకబడింది. ఇందుకోసం పరిశోధన రంగంలో పెట్టుబడులు పెరగాలి. నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం 2018-19 నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆయిల్‌పాం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వంటనూనెల్లో స్వయంసమృద్ధి సాధించడానికి త్వరలో ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని ఇటీవలి తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి పెరగాలంటే ఈ పంటలను లాభసాటిగా మార్చాలి. అప్పుడే రైతులు వాటి సాగుకు మొగ్గుచూపుతారు. తద్వారా వంటనూనెల్లో దేశం స్వావలంబన వైపు పయనిస్తుంది.

 దేవవరపు సతీష్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.