కలాదాన్‌ ప్రాజెక్టుపై నీలినీడలు

మయన్మార్‌లో తిరుగుబాటుదారులు క్రమంగా పట్టుబిగిస్తున్నారు. సైన్యంతో ధాటిగా పోరాడుతూ వరసగా ఒక్కో ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు.

Published : 23 Feb 2024 01:24 IST

మయన్మార్‌లో తిరుగుబాటుదారులు క్రమంగా పట్టుబిగిస్తున్నారు. సైన్యంతో ధాటిగా పోరాడుతూ వరసగా ఒక్కో ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. గత నెలలో పలెత్వా పట్టణం వారి వశం కావడంతో- ఇండియా తలపెట్టిన ప్రతిష్ఠాత్మక కలాదాన్‌ ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొన్నాయి!

యన్మార్‌ మీదుగా ఆగ్నేయాసియాతో అనుసంధానతను పెంచుకోవాలన్న భారత్‌ యోచనతో కలాదాన్‌ బహువిధ మార్గ రవాణా ప్రాజెక్టు (కేఎంటీటీపీ) 2003లో పురుడు పోసుకుంది. 2008లో భారత్‌, మయన్మార్‌ దానిపై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కోల్‌కతాను బంగాళాఖాతం మీదుగా మయన్మార్‌ రఖాయిన్‌ రాష్ట్రంలోని సిత్వే ఓడరేవుతో అనుసంధానిస్తారు. అక్కడి నుంచి కలాదాన్‌ నదీమార్గం ద్వారా పలెత్వా పట్టణం వరకు ప్రయాణ మార్గం ఉంటుంది. పలెత్వా నుంచి మిజోరంలోని జోరిన్‌పుయికి 109 కిలోమీటర్ల రోడ్డుమార్గాన్ని నిర్మిస్తారు. ఇండియా ‘యాక్ట్‌ ఈస్ట్‌ విధానం’లో కేఎంటీటీపీ చాలా కీలకం. మయన్మార్‌పై చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. ఈశాన్య భారత రాష్ట్రాలకు సైన్యాన్ని చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గంగానూ దిల్లీకి ఉపయోగపడుతుంది. దీనివల్ల కోల్‌కతా, మిజోరంల మధ్య దూరం దాదాపు వెయ్యి కిలోమీటర్లు తగ్గుతుంది.

రెండు దేశాల్లోనూ కలాదాన్‌ ప్రాజెక్టు వెనకబడిన ప్రాంతాల మీదుగా వెళ్తోంది. ఇది పూర్తయితే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొంటాయి. అయితే, వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ఈ ప్రాజెక్టు పనుల్లో తొలినుంచీ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. 2015కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అది నెరవేరలేదు. తరవాత 2021కి పొడిగించినా ప్రాజెక్టు పూర్తికి నోచుకోలేదు. అంచనా వ్యయం ఏటికేడు పెరుగుతూ పోయింది. 53.6కోట్ల డాలర్లతో పూర్తవుతుందనుకున్న ప్రాజెక్టు 320కోట్ల డాలర్లు కేటాయించాల్సిన స్థితికి చేరింది. ఇండియా వైపున ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన ఎనిమిది వంతెనలు, ఇతర పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. మయన్మార్‌లో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు. కేఎంటీటీపీ కోసం ఆ దేశంలో 25 వంతెనలు నిర్మించాల్సి ఉంది. వాటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం మయన్మార్‌లోని రాజకీయ అస్థిరత. 2017నాటి రోహింగ్యా సంక్షోభం, కొవిడ్‌ విజృంభణ ఈ ప్రాజెక్టుకు విఘాతంగా మారాయి. మయన్మార్‌లో కలాదాన్‌ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న అయిదుగురు భారతీయులను తిరుగుబాటుదారులు 2019 నవంబరులో అపహరించడం అప్పట్లో కలకలం సృష్టించింది. 2023 డిసెంబరు కల్లా కేఎంటీటీపీని పూర్తిచేయాలన్న మూడో తుది గడువూ మీరిపోయింది. గత నెలలో పలెత్వా పట్టణం తిరుగుబాటుదారుల సంస్థ- అరాకన్‌ ఆర్మీ(ఏఏ) చేతుల్లోకి వెళ్ళడంతో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తికావడం అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కలాదాన్‌ ప్రాజెక్టుకు పలెత్వా అత్యంత కీలకం. రఖాయిన్‌ రాష్ట్రంలో జుంటా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అక్కడ తిరుగుబాటుదారులదే ఒకింత పైచేయిగా కనిపిస్తోంది. రఖాయిన్‌ మొత్తం నేడో రేపో వారి ఏలుబడిలోకి వెళ్ళడం దాదాపు ఖాయమే! రాష్ట్రంలోని పలు పట్టణాలు, వాటిని అనుసంధానించే కీలక రహదారులు ఇప్పటికే తిరుగుబాటు శక్తుల నియంత్రణలోకి వెళ్ళాయి. ఈ పరిస్థితుల్లో అటు రఖాయిన్‌లో, ఇటు పలెత్వాలో కేఎంటీటీపీ పనుల్లో ముందడుగు పడటం అసాధ్యమే! ఈ ప్రాజెక్టు ఉభయతారకమని, దాని పనులకు అడ్డంకులేవీ సృష్టించబోమని అరాకన్‌ ఆర్మీ చెబుతోంది. ఇండియాతో తమకు సమస్యలేమీ లేవని అంటోంది. అరాకన్‌ ఆర్మీ చైనా మద్దతున్న సంస్థ! కాబట్టి కేఎంటీటీపీకి సహకరిస్తామన్న మాటలను విశ్వసించలేమన్నది విశ్లేషకుల అభిప్రాయం. మయన్మార్‌తో ఇండియా 1,643 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఆ మొత్తానికీ కంచె వేయాలని మోదీ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. బర్మా, భారత్‌ మధ్య సరిహద్దుకు అటూ ఇటూ 16 కిలోమీటర్ల మేర వీసా రహిత స్వేచ్ఛాయుత ప్రయాణానికి ఇన్నాళ్ళూ ఉన్న అనుమతులనూ కేంద్రం ఇటీవల పక్కనపెట్టింది. మయన్మార్‌లో తీవ్ర సంక్షుభిత పరిస్థితులకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఈ తరుణంలో కేఎంటీటీపీ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. ఆగ్నేయాసియాతో మెరుగైన అనుసంధానత, ఈశాన్య భారత్‌కు ప్రత్యామ్నాయ రవాణా మార్గం కోసం దిల్లీ మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పదు!

 ఎం.నవీన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.