విరుగుడు బటన్‌

‘మహానుభావుల గురించి చరిత్రలో చదవడమే తప్ప చూసింది లేదు. ఆ కాలంలో బతికుంటే వాళ్లను చూసి తరించే వాళ్లం కదా!’ ‘ఇప్పుడేం మించిపోయిందని, ఎలాంటి మహానుభావులకూ కొదవ లేదీ లోకంలో... ఇంతకీ ఎవరిని చూడాలనుకున్నావేమిటి?’ ‘రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో నింపాదిగా ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చున్నాడని పుస్తకాల్లో తెగ చదివా... అదెలా జరిగిందోనన్న ఆసక్తి వేధిస్తోంది.’

Updated : 29 Feb 2024 07:37 IST

‘మహానుభావుల గురించి చరిత్రలో చదవడమే తప్ప చూసింది లేదు. ఆ కాలంలో బతికుంటే వాళ్లను చూసి తరించే వాళ్లం కదా!’

‘ఇప్పుడేం మించిపోయిందని, ఎలాంటి మహానుభావులకూ కొదవ లేదీ లోకంలో... ఇంతకీ ఎవరిని చూడాలనుకున్నావేమిటి?’

‘రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో నింపాదిగా ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చున్నాడని పుస్తకాల్లో తెగ చదివా... అదెలా జరిగిందోనన్న ఆసక్తి వేధిస్తోంది.’

‘అదేం భాగ్యం, ఓ పక్క పొలాలకు నీరందక, పంటలు ఎండిపోతుంటే, ప్రాజెక్టులను రైతుల పాలిట వరాల్లా మార్చాల్సిందిపోయి, అన్నదాతల్ని నిండా ముంచేసి, కష్టాల్ని, కన్నీళ్లని మాత్రం మిగిల్చి, ప్యాలెస్‌లో కూర్చుని కుట్రకోణాలకు ‘వ్యూహం’ ‘సిద్ధం’ చేస్తూ, ‘శపథ యాత్ర’లు చేసుకుంటున్న ముఖ్యనేతల వన్నెచిన్నెలు నీరోకన్నా తక్కువా!’

‘అప్పట్లో తుగ్లక్‌ మహాశయుడు, ఎంతపెద్ద నిర్ణయాలనైనా ఎడమ చేత్తో తీసుకుని కుడిచేతికీ తెలియనిచ్చే వాడు కాదట కదా! తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసీ... ఏడుపు మొహంతో నవ్వుతూ, రానినవ్వుతో ఏడుస్తూ, చిత్రవిచిత్రమైన ముఖభంగిమలతో చివరాఖరుకు ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే వచ్చే వాడట కదా, అలాంటి గందరగోళ ప్రభువును చూడటం, ఆ పాలనను కనే మహద్భాగ్యం మనకు కరవాయె...’

‘మీలాంటి ఆశాపిపాసుల కోరికలు తీర్చే మహాశయుల కోసం ఎక్కడో వెదకాల్సిన పనిలేదు. అలాంటివాళ్లే జనం నెత్తినెక్కి సవారీ చేస్తున్నారీ కాలంలో! రైతుల త్యాగసౌధమైన బంగారు రాజధానిని కాదని, మూడుముక్కలాట ఆడినంత సులువుగా మూడు రాజధానులంటూ మూడు దిక్కులా పరుగులుపెట్టి, ఆఖరుకు ఆయాసమే మిగిలి ఏ దిక్కున నక్కాలో అర్థంకాక, గందరగోళంలో మునిగి, అందరినీ గందరగోళంలో ముంచి, మూడూకాదని నాలుగోదీ తెరపైకి తెచ్చి, చివరికి అదీ లేక, ఏదీలేక, రాజధాని లేని రాజులా రాజ్యం వీడి, కుర్చీ వదలాల్సిన పరిస్థితి తెచ్చుకున్న అయోమయం జగన్నాథం ప్రతిభాపాటవాలు అందరికీ తెలిసినవే కదా! ఇలాంటి జగన్నాటకాల ముందు తుగ్లక్‌ పాట్లు ఏ పాటివి!’

‘అమాయకుల్ని అమానుషంగా హింసించిన నియంతల గురించీ చాలా విన్నానే...’

‘నిరసనలకు దిగిన అంగన్‌వాడీల పుర్రెలు పగిలి, రక్తం ధారలు కట్టేలా కొట్టించిన ఘట్టాలు కనిపించడం లేదా? ఆందోళన బాట పట్టిన అభాగ్యజీవుల కాళ్లూచేతులు విరిగి, వాటికి పడిన కుట్లు, కట్టిన కట్ల లెక్కలు తేల్చేదెవరు? కారులో శవాన్ని వేసుకొచ్చి పడేసిన నేతలు బోరవిరుచుకుని తిరగడం వెనక ధైర్యం ఎవరిది? సొంత బంధువులే శవాలై తేలినా, అడిగేవారే లేరన్న పొగరు వెనక అండ ఎక్కడిది? కుట్రకోణాల కోడికత్తుల్ని సానపెట్టిన మాస్టర్‌ మైండ్లు ఎవరివి? ఏం చేసినా, కాచుకునే చెయ్యేదో ఉందన్న ధైర్యమే కదా! నిజాలు బయటికొచ్చినా, నిందితులు లోపలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదంటే- అదృశ్య శక్తి, అశరీర యుక్తి అండగా ఉన్నట్లే కదా... ఈ శక్తులు నాటి నియంతలకన్నా తక్కువా!’

‘అప్పట్లో హిట్లర్‌ శత్రువులను దారుణంగా హింసించి చంపించేవాడట కదా! పాపం అంత నరకం ఎలా అనుభవించే వారో?’

‘రాజధాని రైతుల కష్టాల ముందు, హిట్లర్‌ పెట్టిన ఇక్కట్లు కొరగానివే! పంట భూముల్ని పోగొట్టుకుని, న్యాయంగా దక్కాల్సిన ప్రతిఫలాన్నీ నోటికాడ ముద్దను విసిరేసినట్లు మట్టిపాలు చేస్తే, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసా! ఒంటిపై తేలిన పోలీసు వాతలే కాదు, గుండెలపై మిగిలిన అవమాన గాయాల మచ్చలూ మాసిపోనివే! ఈ హింసోన్మాదాన్ని చూస్తే హిట్లర్‌ కూడా సిగ్గుపడాల్సిందే!’
‘పిండారీలు అనే దోపిడీ దొంగలు ఊళ్లమీద పడి మొత్తం ఊడ్చుకుపోయే వాళ్లట కదా!’  

‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పథకాల పేరిట, పేదల పేరిట అందినకాడికి దండుకోవడం పిండారీల వల్లా కాలేదు. ఇసుకను, మట్టిని, రాయిని పచ్చని ప్రకృతిని చెరబట్టి దోపిడీ చేస్తూ, అదే ప్రకృతి మాటున అడవిలో గంజాయి పండిస్తూ, స్మగ్లింగ్‌ చేస్తూ, దండుకుంటూ చెండుకుతింటున్న అకృత్యాలు, అఘాయిత్యాలు చూస్తే పిండారీలూ చేతులెత్తెయ్యాల్సిందే!’

‘కనీసం రాజుల పాలననైనా చూడకపోతిని, సలహాలకే ముత్యాల హారాలు విసిరేసే వారట...’

‘ఇప్పటికీ అదే తంతుకదా, సర్వవిధ సలహాదారులతో పాలనామందిరం కిటకిటలాడిపోవడం లేదూ! కూర్చోవడానికో సలహాదారు, నిలుచోవడానికో సలహాదారు, తుమ్మడానికొకరు, దగ్గడానికొకరు, మంత్రతంత్రాలకు, కంత్రీకార్యాలకు... అడుగుతీసి అడుగు వేయడానికి అడుగడుగునా సలహాదారులనే కీర్తిగానకోవిదులతో నిండిపోయిన సభామందిరం... స్తుతిభజనలతో మోతెక్కిపోవడం లేదూ!’
‘ఈ పైత్యానికి విరుగుడు బటన్‌ ఎవరు నొక్కుతారో, వారికెవరు సలహా ఇవ్వాలో?’

‘ఎవరో ఎందుకు, జనమే ఎన్నికల్లో సరైన బటన్‌ నొక్కుతారు! ఏ బటన్‌ నొక్కితే ఎవరి పీడ విరగడ అవుతుందో ప్రజలకు ఎవరూ సలహా ఇవ్వక్కర్లేదు. అస్సలు... జనానికి సలహాదారుల అవసరం అంతకన్నా లేదు!’

శ్రీజన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.