పుడమికి సురక్షా వలయం

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో వస్తు వినియోగం పెరుగుతోంది. దాంతో వ్యర్థాలూ ఇబ్బడిముబ్బడిగా పోగుపడుతున్నాయి. వస్తూత్పత్తుల కోసం సహజవనరులను విచ్చలవిడిగా వెలికి తీయాల్సి వస్తోంది. వీటివల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోంది. దీన్ని నిలువరించడానికి వలయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ) తోడ్పడుతుంది.

Published : 29 Feb 2024 00:54 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో వస్తు వినియోగం పెరుగుతోంది. దాంతో వ్యర్థాలూ ఇబ్బడిముబ్బడిగా పోగుపడుతున్నాయి. వస్తూత్పత్తుల కోసం సహజవనరులను విచ్చలవిడిగా వెలికి తీయాల్సి వస్తోంది. వీటివల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోంది. దీన్ని నిలువరించడానికి వలయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ) తోడ్పడుతుంది.

ప్రపంచ జనాభా 2050నాటికి సుమారు వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ, ఆహార, ఫ్యాషన్‌, ప్రయాణ తదితర రంగాల్లో వస్తూత్పత్తులు, సేవలకు గిరాకీ అధికమవుతోంది. వస్తూత్పత్తుల కోసం భారీగా సహజవనరులను వెలికితీయాల్సి వస్తోంది. దాంతో జీవ వైవిధ్య నష్టం, కాలుష్య సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. వ్యర్థాలు పెద్దమొత్తంలో పోగుపడుతున్నాయి. వీటివల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతిని మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ దుస్థితిని నివారించాలంటే వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాలి. వస్తువుల పునశ్శుద్ధి, పునర్వినియోగంపై సరైన దృష్టి సారించాలి. దీన్నే వలయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ)గా అభివర్ణిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణ, కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికతల వినియోగానికి పెద్దయెత్తున పెట్టుబడులు అవసరం. వీటిని ప్రభుత్వాలు సమకూర్చాలి. సర్క్యులర్‌ ఎకానమీపై సరైన దృష్టి సారించడం ద్వారా 2030నాటికి భారత్‌లో సుమారు 50 వేల కోట్ల డాలర్ల విలువైన వ్యాపార అవకాశాలను సృష్టించవచ్చని పరిశీలనలు చెబుతున్నాయి.

సర్క్యులర్‌ ఎకానమీలో వస్తువుల పునశ్శుద్ధి, పునర్వినియోగం వల్ల సహజ వనరులపై భారం తగ్గుతుంది. దానివల్ల కర్బన ఉద్గారాలు పెద్దయెత్తున పర్యావరణంలోకి విడుదల కాకుండా కొద్దిమేర నివారించవచ్చు. నూతన వ్యాపార అవకాశాలు లభించడంతో పాటు, పర్యావరణ హితకరమైన ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇటీవలి కాలంలో మానవాళి జీవనశైలి మార్పుల వల్ల ఒకసారి వాడి పారేసే వస్తువుల వినియోగం అధికమవుతోంది. పర్యవసానంగా వ్యర్థాల సమస్య కట్టుతప్పుతోంది. కర్బన ఉద్గారాల్లో మూడింట రెండు వంతులు గృహాలు, జీవనశైలి మార్పుల వల్లే  వెలువడుతున్నాయని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరకుండా కట్టడి చేయాలంటే- ప్రధానంగా రవాణా, ఆహార అలవాట్లు, నూతన వ్యాపార నమూనాలు తదితరాలపై దృష్టి సారించాలి.
వలయ ఆర్థిక వ్యవస్థ ఆధారిత వృద్ధి నమూనాను అనుసరించడం ద్వారా 2050నాటికి ఏటా భారత్‌కు 62,400 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని కేపీఎంజీ సంస్థ అధ్యయనం వెల్లడిస్తోంది. అందుకే దేశీయంగా వ్యర్థాల పునర్వినియోగాన్ని జోరెత్తించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ వనరుల సమర్థ వినియోగ విధానంతో పాటు ఉక్కు వ్యర్థాల పునర్వినియోగం, తుక్కు వాహనాల విధానాలను తెచ్చింది. భారత్‌లో లిథియం-అయాన్‌ బ్యాటరీలు, ఎలెక్ట్రానిక్‌, హానికారక పరిశ్రమల వ్యర్థాలు, ఇనుమూ ఇతర లోహాలు, టైర్లు, రబ్బరు, కాలం చెల్లిన వాహనాలు, వాడేసిన సోలార్‌ ప్యానెళ్లు, మున్సిపల్‌ ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. వీటిని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బ్యాటరీలు, ఎలెక్ట్రానిక్‌, టైరు వ్యర్థాల నిర్వహణను సంబంధిత సంస్థలే చేపట్టాలన్న నిబంధనలు తెచ్చారు. ఇది పక్కాగా అమలు జరిగేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరి భాగస్వామ్యం పెంచేందుకు ప్రధాని మోదీ 2022లో మిషన్‌ లైఫ్‌ (పర్యావరణ హితకరమైన జీవనశైలి) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలను నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విరివిగా నిర్వహించాలి.

పెరుగుతున్న జనాభా అవసరాలు తీరుస్తూనే, ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు సమష్టిగా కృషి చేయాలి. అప్పుడే పర్యావరణ అనుకూల ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా పుడమికి, జీవ వైవిధ్యానికి వాటిల్లే ముప్పును తగ్గించవచ్చు. భవన నిర్మాణం, ప్లాస్టిక్‌, టెక్స్‌టైల్స్‌, రవాణా తదితర రంగాల్లో వలయ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలను విస్తృతం చేయాలి. ప్రజల భాగస్వామ్యం లేకుంటే ప్రభుత్వాల చర్యలు సరైన ఫలితాలను అందించలేవు. అందుకే వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి.  

ఎ.శ్యామ్‌కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు