ఏ రాష్ట్రానికి పసుపు పారాణి?

దేశంలో పసుపు సాగుకు తగిన ప్రోత్సాహం లభించడంలేదు. మద్దతు ధర కల్పన ఎండమావే అవుతోంది. ఎగుమతులకు ఆసరా కరవైంది. జాతీయ పసుపు మండలి ఏర్పాటుకు కేంద్రం ప్రకటన జారీ చేసినప్పటికీ, నాలుగు నెలలుగా అది కాగితాలకే పరిమితమైంది. దేశంలో పసుపు సాగు అనాదిగా సాగుతోంది. ఇంటింటా అనునిత్యం పసుపును వాడుతున్నారు.

Published : 02 Mar 2024 00:25 IST

దేశంలో పసుపు సాగుకు తగిన ప్రోత్సాహం లభించడంలేదు. మద్దతు ధర కల్పన ఎండమావే అవుతోంది. ఎగుమతులకు ఆసరా కరవైంది. జాతీయ పసుపు మండలి ఏర్పాటుకు కేంద్రం ప్రకటన జారీ చేసినప్పటికీ, నాలుగు నెలలుగా అది కాగితాలకే పరిమితమైంది.

దేశంలో పసుపు సాగు అనాదిగా సాగుతోంది. ఇంటింటా అనునిత్యం పసుపును వాడుతున్నారు. వంటల్లోనే కాకుండా ఔషధంగా, సౌందర్య సాధనంగా, పూజా సామగ్రిగా వినియోగిస్తున్నారు. భారత్‌లో 2022-23లో 9.20 లక్షల ఎకరాల్లో పసుపును పండించారు. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 75శాతం, అంటే సుమారు 11,61,025 టన్నులు భారత్‌లోనే నమోదైంది. చైనాలో ఎనిమిది శాతం; బంగ్లాదేశ్‌, నైజీరియా, ఇథియోపియా దేశాల్లో మూడేసి శాతం; థాయ్‌లాండ్‌, వియత్నామ్‌లలో రెండేసి శాతం... ఆస్ట్రేలియా, ఆఫ్రికా, తైవాన్‌, వెస్టిండీస్‌లలో ఒక శాతం చొప్పున పసుపు సాగు అవుతోంది.

దశాబ్దాల డిమాండు

ప్రస్తుతం భారత్‌లో 9.20లక్షల ఎకరాల్లో 30 రకాల పసుపు సాగు అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌, మిజోరం, అసోం, గుజరాత్‌లలో దీన్ని పండిస్తున్నారు. అయితే, ఈ రైతులు మాత్రం లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా చవిచూస్తున్నారు. సుగంధ ద్రవ్యాల విభాగంలో ఉన్నందువల్ల పసుపు పంటకు కేంద్రం నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించడంలేదు. అదే అన్నదాతల పాలిట శాపంగా మారింది. పసుపు సాగు వ్యయం ఏటికేడు పెరుగుతున్నప్పటికీ, అందుకు తగ్గట్లు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. దేశంలో పసుపు మార్కెట్లు పరిమితంగా ఉండటం; ఎగుమతి అవకాశాలు, ప్రోత్సాహకాలు పెద్దగా లేకపోవడం పసుపు రైతులను కుంగదీస్తున్నాయి. పైగా ధరలు పడిపోయిన సమయంలో కొనుగోళ్లు చేపట్టి వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడంలేదు. ఎకరా విస్తీర్ణంలో పసుపు సాగుకు రూ.1.20లక్షల పెట్టుబడి అవసరమవుతోంది. 18 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. గడచిన పదేళ్లలో పసుపు సగటు ధర క్వింటాలుకు రూ.4,000-5,000 మధ్యే పలికింది. ప్రస్తుత సీజన్‌లో ప్రారంభ ధర క్వింటాలుకు రూ.5,685 మాత్రమే. పెట్టుబడుల మేరకు ఆదాయం రాకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, చీడపీడలు తదితర కారణాలవల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. చాలామంది అప్పులపాలవుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా గత పదేళ్లలో పసుపు సాగు విస్తీర్ణం మూడు లక్షల ఎకరాల మేర తగ్గిపోయింది. ఒక్క తెలంగాణలోనే తగ్గుదల 89వేల ఎకరాలు!

దేశంలో కొబ్బరి, పొగాకు, కాఫీ, టీ, రబ్బర్‌, సుగంధ ద్రవ్యాలకు జాతీయ మండళ్లు (బోర్డులు) ఏర్పాటయ్యాయి. ఆయా ఉత్పత్తుల పెంపు, పరిశోధనలు, కొత్త వంగడాల రూపకల్పన, ఎగుమతులు, దిగుమతులకు అవి తోడ్పడుతున్నాయి. వాటి సాగు విస్తీర్ణం తక్కువే అయినప్పటికీ, ప్రాధాన్యం దృష్ట్యా ఆ బోర్డులకు కేంద్రం విరివిగా నిధులు ఇస్తోంది. పసుపు పండించే రాష్ట్రాలన్నీ జాతీయ మండలి కావాలని తరచూ కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాయి. దీని కోసం పసుపు ఉత్పత్తిలో అగ్రస్థానాన ఉన్న తెలంగాణలో రైతులు దీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నారు. ‘పసుపు బోర్డు’ ఏర్పాటు డిమాండుతో 178 మంది రైతులు నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో భాజపా అభ్యర్థి జాతీయ మండలి తెస్తామని చెప్పి బాండ్‌పేపర్‌పై సంతకంచేసి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందారు. అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు నిరాశ చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో గత అక్టోబరులో ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచార సభల్లో పసుపు బోర్డు ఏర్పాటుపై విధాన ప్రకటన చేయడం రైతుల్లో ఆశలు రేకెత్తించింది. ఆ వెంటనే కేంద్ర మంత్రిమండలి జాతీయ పసుపు మండలి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

ప్రకటనతో సరి...

నిరుడు అక్టోబరు నాలుగో తేదీన పసుపు బోర్డు ఏర్పాటుపై అధికారిక నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలో ప్రధాని ప్రకటన చేశారు కాబట్టి, తమ రాష్ట్రానికే అది వస్తుందని స్థానిక రైతులు భావిస్తున్నారు. కానీ, ఆ ప్రకటనలో మాత్రం బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది ప్రస్తావించలేదు. ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాలు, బడ్జెట్‌ ప్రతిపాదనల గురించి చెప్పలేదు. కేవలం కమిటీ సభ్యుల నియామకాన్ని ప్రకటించినా, అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. పసుపు బోర్డు దేశంలో పసుపు, దాని ఉత్పత్తుల అభివృద్ధికి శ్రద్ధ చూపుతుంది. పరిశోధన, కొత్త వంగడాల అభివృద్ధి, ధరల స్థిరీకరణ, సాగు విస్తీర్ణం పెంపుదల, విలువ ఆధారిత ఉత్పత్తులతో ఎగుమతి అవకాశాలకు ఊతమిస్తుంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తే మళ్ళీ ఇది ఎన్నికల నినాదంగానే మిగిలిపోతుంది. కాబట్టి, కేంద్రం జాతీయ పసుపు మండలి ఏర్పాటుకు సత్వర కార్యాచరణ చేపట్టి రైతులకు భరోసా కల్పించాలి.

ఆకారపు మల్లేశం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.