సమితిపై భారత్‌ కినుక

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి, అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న భారత్‌ అంతర్జాతీయ రాజకీయాల్లోనూ నాయకత్వ స్థానం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పట్టుపడుతోంది. తన మనోభావాలను నిర్మొహమాటంగా చాటిచెప్పేందుకు ఐరాసకు కేటాయించే వార్షిక నిధులలో భారీగా కోత విధించింది.

Published : 02 Mar 2024 00:24 IST

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి, అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న భారత్‌ అంతర్జాతీయ రాజకీయాల్లోనూ నాయకత్వ స్థానం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పట్టుపడుతోంది. తన మనోభావాలను నిర్మొహమాటంగా చాటిచెప్పేందుకు ఐరాసకు కేటాయించే వార్షిక నిధులలో భారీగా కోత విధించింది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా చిరకాలంగా ప్రయత్నిస్తోంది. భారత్‌ డిమాండ్‌ సహేతుకమని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పలు సందర్భాల్లో సూత్రప్రాయంగా అంగీకరించారు. అయినాసరే ఈ విషయంలో అడుగు ముందుకు పడటంలేదు. ఇక మాటలతో పనికాదని భావించిన భారత్‌ చేతలకు దిగింది. ఇటీవలి తాత్కాలిక పద్దులో ఐరాసకు తన వార్షిక కేటాయింపును సగానికి సగం తెగ్గోసింది. 2023-24లో ఐక్యరాజ్య  సమితి బడ్జెట్‌కు తన వాటాగా 4.7 కోట్ల డాలర్లు (రూ.382.54 కోట్లు) అందించిన ఇండియా, 2024-25లో దాన్ని 2.1కోట్ల డాలర్లకు (రూ.175 కోట్లకు) తగ్గించింది. ఇది ఏకంగా 54.25శాతం కోత! ఐరాస బడ్జెట్‌ 340కోట్ల డాలర్లని గుర్తుంచుకుంటే ఈ కోత పెద్ద లెక్కలోకి రాదు. కానీ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం గురించి తన మనోభావాలను నిర్మొహమాటంగా చాటిచెప్పడానికే భారత్‌ ఈ చర్య తీసుకుంది. ఈ చర్యకు తోడుగా ఐరాస శాంతిరక్షక సేనకు భారత దళాలను పంపడం మానుకోవాలని జాతీయ భద్రతా మండలి సభ్యుడు శ్రీధర్‌ వెంబు సూచించారు.

ప్రపంచంలో శాంతి సుస్థిరతలకు పూచీగా ఏర్పడిన భద్రతా మండలికి కట్టుతప్పిన దేశాలపై సైనిక చర్య తీసుకోవడంతో పాటు ఆంక్షలు విధించే అధికారమూ ఉంది. మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు వీటో అధికారం చలాయిస్తాయి. ఇవికాక రెండేళ్లకు ఒకసారి రొటేషన్‌ పద్ధతిపై 10 దేశాలు మండలిలో తాత్కాలిక సభ్యులవుతాయి. తమకూ శాశ్వత సభ్యత్వం కావాలని భారత్‌, జర్మనీ, జపాన్‌, బ్రెజిల్‌ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, తనను తాను సంస్కరించుకోవడానికి భద్రతా మండలి ససేమిరా అంటోంది. రెండో ప్రపంచయుద్ధం తరవాత 50 దేశాలతో ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడా సంఖ్య నాలుగింతలు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాలకు ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి ఇంతవరకు పరిష్కారం కనుగొనలేకపోవడంతో వాటి పనితీరు, సామర్థ్యంపై నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇంతకుముందు కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలోనూ సమితి తన అసమర్థతను బయటపెట్టుకుంది. నాడు ధనిక దేశాలు భారీ ధరలకు కొవిడ్‌ టీకాలను అమ్ముకోవాలని చూశాయి. భారత్‌ మాత్రం వ్యాక్సిన్‌ మైత్రి పథకం కింద పేద దేశాలకు లక్షల టీకా డోసులను ఉచితంగా అందించింది. ప్రస్తుతం భద్రతా మండలిలో ఒక్క చైనా మినహా ఇతర శాశ్వత సభ్య దేశాలన్నీ భారత్‌కు ఆ హోదా ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నాయి.

నేడు ఐక్యరాజ్యసమితి ఛత్రం కింద ఉన్న 15 బహుళపక్ష విభాగాల్లో పలు సంస్థలకు చైనీయులే అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌గా టెడ్రోస్‌ అథనోమ్‌ నియామకం చైనా చలవేనన్న వార్తలు వచ్చాయి. ఇంటర్‌పోల్‌, ఐరాస మానవ హక్కుల సంస్థల్లోనూ చైనా మనుషులు ఉన్నారు. సమితికి అమెరికా తరవాత అత్యధిక నిధులను అందిస్తున్న చైౖనా- భద్రతా మండలితోపాటు ఇతర అనుబంధ సంస్థలను తన అజెండాకు అనుగుణంగా మలచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)ను ఇక్కడ ఉదాహరించాలి. చైనాకు చెందిన కూ డాంగ్యూ 2019 నుంచి ఎఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. డాంగ్యూ ఎన్నికకు ముందు కేవలం రెండు ఎఫ్‌ఏఓ విభాగాలకు మాత్రమే చైనీయులు అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య ఆరుకు పెరిగింది. వారిలో ఒకరు ఎఫ్‌ఏఓ క్రిమినాశక మందుల విభాగాధిపతి. 2020 నుంచి ప్రమాదకర క్రిమినాశనులను ఆసియా, ఆఫ్రికా దేశాలకు రవాణా చేయడం ఎక్కువైందన్న ఆరోపణలు ముమ్మరించాయి. ప్రపంచ మేధాహక్కుల సంస్థ (విపో) అధ్యక్ష పదవిని సైతం చైనా వ్యక్తే నిర్వహిస్తున్నారు. 15 సమితి అనుబంధ సంస్థలలో అత్యధికం చైనీయుల ప్రత్యక్ష, పరోక్ష నిర్వహణలోనే ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న డ్రాగన్‌- ఐక్యరాజ్య సమితిలో తన ప్రాబల్యాన్ని అంతకంతకు పెంచుకుంటోంది. తనకున్న పట్టుతోనే భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కకుండా అడ్డుపడుతోంది. ఈ క్రమంలో నిధులను తెగ్గోయడం ద్వారా భారత్‌ తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

వర ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు