తాయిలాల తైలం

‘సార్‌... ఎన్నికల్లో మనకు అన్నివిధాలా ఉపయోగపడతారని ప్రొఫెషనల్స్‌ను తీసుకొచ్చాం.’ ‘ఎన్నికల్లో మనదంతా తడిగుడ్డ యవ్వారం, చాపకింద వ్యవహారం కదా... వీళ్లతో మనకేం ఉపయోగం!’ ‘మనం కూడా హైటెక్‌ ట్రెండ్‌లో వెళ్దాం...సార్‌’ ‘పూర్వీకుల నుంచీ నోటిదూల, చేతితీట పద్ధతినే శిరసావహిస్తున్నాం. నోరు పారేసుకుని, చేతులకు పని చెప్పడమే మనకు అచ్చొచ్చిన నైపుణ్యం!’

Published : 28 Mar 2024 00:34 IST

‘సార్‌... ఎన్నికల్లో మనకు అన్నివిధాలా ఉపయోగపడతారని ప్రొఫెషనల్స్‌ను తీసుకొచ్చాం.’

‘ఎన్నికల్లో మనదంతా తడిగుడ్డ యవ్వారం, చాపకింద వ్యవహారం కదా... వీళ్లతో మనకేం ఉపయోగం!’

‘మనం కూడా హైటెక్‌ ట్రెండ్‌లో వెళ్దాం...సార్‌’

‘పూర్వీకుల నుంచీ నోటిదూల, చేతితీట పద్ధతినే శిరసావహిస్తున్నాం. నోరు పారేసుకుని, చేతులకు పని చెప్పడమే మనకు అచ్చొచ్చిన నైపుణ్యం!’  
‘ఓసారి మాట్లాడి చూడండి సార్‌... నచ్చితేనే పెట్టుకుందాం...నచ్చేలా చేయించుకుందాం!’  
‘ఏమయ్యా ప్రొఫెషనలూ, ఎలాగైనా గెలిపించి పెట్టాలి. ఓటర్లు గుడ్డి గొర్రెల్లా మన బటన్‌నే నొక్కాలి, అవుతుందా?’
‘గెలుపోటములు మా చేతుల్లో ఏముంటాయి సార్‌, ఓటర్లను  ఆకట్టుకొనే ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తాం’
‘అంటే, అవతలి పార్టీ వాళ్లను చెవుల్లో రక్తం కారేలా బండ బూతులు తిట్టడంలాంటి ప్రత్యేక కళా ప్రదర్శనలేమీ ఉండవా?’
‘బూతులు ఎందుకు సార్‌, ప్రజలకు ఏమేం చేస్తామో చెప్పుకుందాం.’

‘ఇదేందయ్యా ఇదీ! బూతులు వద్దనడమే పెద్ద బూతు. ఎన్నికలంటేనే బూతులు చెలరేగాలి. తిట్లు తిట్టామంటే- అస్సలు ఎందుకు పుట్టామురా, పుట్టినా ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డాం, పరువెందుకు పోగొట్టుకుంటున్నామనుకోవాలి. అదంతా కాదని, ఏవేవో ఎత్తుగడలూ ఎల్లిగడ్డలు, వ్యూహాలు ఉసిరికాయలు అంటూ పాచిపోయిన పెరుగన్నం సుద్దులు చెబుతున్నారే! సరే, మన సభలకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చినట్లు ఉండాలి, మీ ఉల్లిగడ్డ వ్యూహాలేమిటో చెప్పండి?’
‘కూలీ ఇచ్చి, బస్సులు పెట్టి జన సమీకరణ చేస్తాం’  
‘అయినా, జనం రాకపోతే?’  
‘మందుపోసి, డబ్బులిస్తే ఎగేసుకొస్తారు సార్‌’
‘మా పార్టీ సభలన్నా, యాత్రలన్నా జనం తొంగి చూడటం మానేశారు ప్రొఫెషనలూ... గట్టిగా పిలిస్తే యాక్‌ థూ అనేస్తున్నారు. మా పార్టీ, మా నేతలు, మా గుర్తు జనానికెప్పుడో దూరమయ్యాయి. మాకు అలవాటైన దుడ్డుకర్రలు, నాటుబాంబులు, కోడికత్తులు, వేటకొడవళ్లతో భయపెడదామన్నా... పనయ్యేలా కనిపించడం లేదు.’
‘మరెలా... సార్‌?’
‘జనం రాకున్నా, వచ్చినట్లు నమ్మించాలి. గ్రాఫిక్స్‌తో మాయ చేయాలి. సభ దద్దరిల్లిపోయిందన్నట్లుగా సృష్టించాలి. పత్రికలు, ఛానళ్లు, పోస్టర్లతో హోరెత్తించాలి. సరే, ఇప్పుడంతా ఫోన్లలో వచ్చే చెత్తనంతా నెత్తికెత్తుకుని, ఖాళీ బుర్రలతో తిరిగే కాలంకదా... ఆ ఫోన్ల ప్రచారాన్ని మనమెలా వాడుకోవచ్చో చెప్పండి?’

‘సోషల్‌ మీడియాలో యాడ్స్‌తో కుమ్మేస్తాం, మన పార్టీ గాలే వీస్తున్నట్లు దుమ్మెత్తిస్తాం!’

‘ఇంతోటిదానికే అందరూ అన్నీ నమ్మేసి, అమాయకంగా నోట్లో వేలేసుకుని వచ్చి, వేలుకు సిరా పూసుకొని, ఓటేసి వెళ్లిపోతారనుకుంటున్నారా? ఎక్కడ దొరికార్రా మీరంతా! సోషల్‌ మీడియాలో దొంగ ఖాతాలు తెరవాలి. ప్రత్యర్థులను ట్రోలింగ్‌ చెయ్యాలి, గేలి చేయాలి, హేళన చేయాలి. అమ్మాఅక్కాచెల్లి... అందరిపైనా బజారు కూతలు, రాతలతో రోతపుట్టించాలి. చెత్తబొమ్మలతో వైరల్‌ చేయాలి. కులం గ్రూపులు, మతం గ్రూపులు, స్టూడెంట్లు, ఉద్యోగులు, బాల్యమిత్రులు, కాలనీలు... అన్ని గ్రూపుల్లోకి చొరబడాలి. చండాలమంతా చిమ్మెయ్యాలి. ఇలాంటివన్నీ చేసిపెట్టడానికి మీ నిపుణులను పట్టుకురా ప్రొఫెషనలూ... ఏమేం చేయాలో మేం చెబుతాం.’

‘అదేదో, మీ పార్టీ కార్యకర్తలతోనే చేయించుకోవచ్చు కదా, మేమెందుకు సార్‌?’  
‘ఇలాంటివన్నీ థర్డ్‌పార్టీ తైతక్కలన్నమాట! మా పార్టీకి ఎలాంటి సంబంధం ఉండకూడదన్నమాట! న్యూట్రల్‌ నిపుణులు చేస్తే, మా చేతికి మన్నూమరకా అంటదన్న మాట!’
‘కోడికి కూడా తెలియకుండా, కోడికత్తితో కోడిపీక కొయ్యడమంటే ఇదే సార్‌!’

‘మెచ్చుకోళ్లేమీ కోయక్కర్లేదుగానీ... ఇళ్లలో కుర్చీలకు, మంచాలకు అతుక్కుపోయి, కళ్లూచెవులూ టీవీలకు అప్పజెప్పే జనాలుంటారు. వాళ్లు సభలకు రారు, ఫోన్లు చూడరు. బీరుబిర్యానీలతో పనవ్వదు. అలాంటివాళ్లంతా మన పార్టీని నమ్మేలా చేసేదెలా?’

‘అదంతా కడుపు నిండిన భద్రలోక సమాజం. వాళ్లంతా ఆవేశాలు, చర్చలు, ఉద్యమాలన్నీ నాలుగు గోడల మధ్యే చేసే పడక్కుర్చీ మేధావులు! వాళ్లను టీవీల్లోనే పట్టుకోవాలి, ఆకట్టుకోవాలి. మన అరాచకాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలు... చేసే ప్రతి చెత్తపని వెనకా ఎన్నో పుణ్య కారణాలు ఉన్నాయని నమ్మించే కూలీ మేధావుల్ని తెస్తాం. మన తరఫున అడ్డగోలుగా అడుగుదాకా దిగి వాదిస్తారు. అందరినీ నమ్మిస్తారు.’

‘కంచంలోకి అన్నం ఎలా వస్తుందో కూడా పట్టించుకోని, ఆవారా ప్రపంచంలో సంచరించే కొత్త ఓటు యూత్‌ను ఎలా పడేద్దాం?’  
‘రీళ్లు, షార్టులే సర్వం అనుకొనే అరకోడి బుర్రల్ని ఆకట్టుకోవడం అయిదుపైసల పని! కుళ్లుకంపు కంటెంటుతో సినిమాలు, వెబ్‌సిరీసులు తీయించి వదులుదాం. దేనికైనా సినిమా రంగేస్తే చాలు మైకమెత్తిపోతారు. ఇలాంటివి చేసిపెట్టడానికి కాలంచెల్లిన కర్మకాలిన కామెడీసైకోలు దొరుకుతారు’

‘ప్రొఫెషనలూ... ఇప్పుడు మా లైన్లోకి వచ్చావ్‌, ఇదయ్యా ప్రొఫెషనలిజమంటే! సరే, కీడెంచి మేలెంచినట్లు... మన కుట్రల్లో చిక్కకుండా ఉండాలంటే జనం ఏ చేయాలో నిజాయతీగా చెప్పు’
‘విజ్ఞత చూపాలి. ఇంగితం ప్రదర్శించాలి.’
‘అలా చూపకుండా, అలాంటివి ప్రదర్శించకుండా ఉండేందుకే తాయిలాల తైలం పూస్తామన్నమాట. అదే మన అసలైన వ్యూహం!’

శ్రీశైలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.