చిరుతిళ్లతో ఆరోగ్యానికి చేటు

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్‌లో చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. వాటిలో వాడుతున్న ప్రమాదకర రసాయనాలు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్నారులకు వాటివల్ల తీవ్ర ముప్పు పొంచి ఉంది.

Published : 29 Mar 2024 00:24 IST

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్‌లో చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. వాటిలో వాడుతున్న ప్రమాదకర రసాయనాలు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్నారులకు వాటివల్ల తీవ్ర ముప్పు పొంచి ఉంది.

వీధుల వెంట ఎర్రగా, ఇతర రంగుల్లో విక్రయించే పీచు మిఠాయి అంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. వాటిని కొనివ్వాలని చాలామంది మారాం చేస్తుంటారు. అయితే, పీచుమిఠాయిలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించి ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ వాటిని ఏడాది పాటు నిషేధించింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ విక్రయిస్తున్న పీచుమిఠాయిలో రోడమైన్‌ బి అనే ప్రమాదకర రసాయనం ఉన్నట్లు గుర్తించారు. వస్త్రాల రంగులు, పేపర్‌ ముద్రణలో ఉపయోగించే ఈ రసాయనం క్యాన్సర్లను కలిగిస్తుంది. మారుతున్న జీవన శైలి, పట్టణీకరణ వల్ల భారత్‌లో చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. వీటి తయారీ, నిల్వకు వాడే ప్రమాదకర రసాయనాలు ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. మరోవైపు అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న ఆహారాలు ఆరోగ్యాలను గుల్లబారుస్తున్నాయి.

ప్రస్తుతం రహదారుల పక్కన, బడుల పరిసరాల్లో తోపుడుబండ్లు, బడ్డీకొట్లు తదితరాల్లో చిరుతిళ్లు విక్రయిస్తున్నారు. వీటిని చాలా వరకు కప్పి ఉంచడం లేదు. ఫలితంగా వాటిపై దుమ్ము పేరుకుపోతోంది. కీటకాలు వాలడం, చేతుల పరిశుభ్రత పాటించని కారణంగా ఆయా తినుబండారాల వల్ల మొండి వైరస్‌లు, బ్యాక్టీరియాలు వ్యాపిస్తున్నాయి. చిన్నారుల్లో టైఫాయిడ్‌, కామెర్లు, కడుపులో నులిపురుగులు వంటి సమస్యలకు ఇవి దారితీస్తున్నాయి. దేశీయంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తింపు లేకుండానే చాలా చిరుతిళ్లను విక్రయిస్తున్నారు. ఇవి తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలామంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. వీటి తయారీలో నాసిరకం పదార్థాలు వాడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా చిరుతిళ్లలో రుచి కోసం కృత్రిమ చక్కెరలు, ఉప్పు, హానికర కొవ్వులు వినియోగిస్తున్నారు. ఆకర్షణీయ రంగు కోసం, నిల్వ చేయడానికి వాడే నైట్రేట్‌, సల్ఫేట్‌, కార్బొనేట్‌, బెంజోయిక్‌ వంటి రసాయనాలు పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ, శ్వాసకోశాలు, గుండె పనితీరుపై దుష్ప్రభావం చూపుతున్నట్లు గతంలో జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పీచు మిఠాయి, కేకులు వంటి తీపి వస్తువుల్లో వాడే ‘రోడమైన్‌-బి’ రసాయనాన్ని అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి ఒక్కసారిగా పెరుగుతుందని, తద్వారా గుండెకు చేటు కలుగుతుందని వైద్య పరిశోధనల్లో స్పష్టమైంది. నాణ్యతలేని ఆహారోత్పత్తులు ప్రజారోగ్యానికి శాపంగా మారుతున్నట్లు నిరుడు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. 12 దేశాల్లోని నాలుగు లక్షల రకాల చిరుతిళ్ల నమూనాలను వర్సిటీ నిపుణుల బృందం పరీక్షించింది. చిప్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌లలో ప్రొటీన్‌, కాల్షియం, ఫైబర్‌ వంటి పోషక విలువలు లేకపోగా వాటిలో చక్కెర, కొవ్వు, ఉప్పు, ఇతర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు బయటపడింది. ఆహార నాణ్యత విషయంలో 12 దేశాల సరసన భారత్‌ అట్టడుగున నిలిచింది. పోషకాల్లేని అధిక కొవ్వుల చిరుతిళ్లు అల్పాదాయ దేశాల చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తున్నాయి. ఇండియాలో కోటికి పైగా పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు లాన్సెట్‌ పత్రిక తాజా అధ్యయనం వెల్లడించింది. 

భారత్‌లో పిల్లలు, పెద్దల ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే వీధుల్లో విక్రయించే ఆహారం, చిరుతిళ్ల వ్యాపారాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలి. ఆహార తయారీ విధానం, అందులో వాడే పదార్థాలు, పోషక విలువలు, నాణ్యత, ధరలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ సమర్థ విధివిధానాలు రూపొందించాలి. గతంలో ఈ సంస్థ నిషేధిత జాబితాలో చేర్చిన కృత్రిమ రంగులు, రసాయనాలు, హానికర సాస్‌ల దిగుమతుల్ని సమర్థంగా కట్టడిచేయాల్సిందే. రుచి, శుచి, శుభ్రత లక్ష్యంగా కేంద్రం ఆహార వీధులను (ఫుడ్‌ స్ట్రీట్స్‌ను) ముందుకు తెచ్చింది. వీటిని విస్తరించాలి. పౌష్టికాహారంపై ప్రాథమిక స్థాయినుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలి. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్‌ లాంటి జంక్‌ఫుడ్‌లు కాకుండా సంప్రదాయ ఆహారానికి తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బెల్లం కలిపిన వేరుశెనగ, నువ్వుల ముద్దలు, సున్నుండలు తదితరాలను పిల్లలకు అందించాలి. పిల్లలు నిత్యం మైదానంలో ఆటలు ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఆరోగ్యవంతమైన, పటిష్ఠమైన బాలభారతాన్ని నిర్మించవచ్చు.

గోపయ్య మాడుగుల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.