విద్యాలయాల్లో కీచకులు

విద్యార్థిలో ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, విజ్ఞాన వెలుగులు నింపేవారు గురువులు. అందుకే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. విద్యార్థులను ఉన్నత శిఖరాలవైపు నడిపించాల్సిన కొందరు అధ్యాపకులు వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళనకరం.

Published : 29 Mar 2024 00:24 IST

విద్యార్థిలో ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, విజ్ఞాన వెలుగులు నింపేవారు గురువులు. అందుకే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. విద్యార్థులను ఉన్నత శిఖరాలవైపు నడిపించాల్సిన కొందరు అధ్యాపకులు వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళనకరం.

ఆచార్యుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని హరియాణాలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన 500 మంది విద్యార్థినులు ఇటీవల ఆరోపించడం సంచలనం సృష్టించింది. దేశీయంగా ఇలాంటి వేధింపుల ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. విద్యార్థులు చదువు ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించి ఉన్నత స్థితికి చేరడానికి అధ్యాపకులు తోడ్పడతారు. ఈ క్రమంలో వారు పిల్లలకు దీపస్తంభంలా నిలుస్తారు. అయితే, విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొంతమంది గురువులు విద్యార్థినుల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతుండటం సమాజానికి తీవ్ర తలవంపులుగా నిలుస్తోంది. పాఠశాలలు మొదలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు... ఇలా అన్నిచోట్లా ఇటువంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఉన్నత విద్యాలయాల్లోనూ ఇవి నిరాఘాటంగా సాగిపోతున్నాయి. వర్సిటీల్లో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై సరైన ఫిర్యాదుల కమిటీలు ఉండటం లేదు. లైంగిక వేధింపుల వ్యతిరేక సంఘాలకు తగినంత ప్రచారం కొరవడుతోంది. దీనివల్ల అమ్మాయిలపై అకృత్యాలు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. మరోవైపు వర్సిటీలలో లైంగిక వేధింపుల నివారణ కమిటీలు తప్పు జరిగాక చర్యలు చేపడుతున్నాయే తప్ప, లింగపరమైన భేదాలు, అసమానతలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన పెంచే ప్రయత్నాలు చెయ్యడం లేదు.

సమానత్వ సాధనకు అవరోధం

ఇబ్బందికరంగా తాకడం, మాటలు, చేష్టలతో చికాకు కలిగించడం, శరీర ఆకృతుల గురించి వెకిలిగా వ్యాఖ్యానించడం, అత్యాచారానికి ఒడిగట్టడం వంటి వేధింపులు విద్యార్థినులను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తాయి. దానివల్ల వారు నిద్రలేమికి గురవుతారు. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వేధింపుల బారిన పడినవారు స్నేహితులకు, లైబ్రరీకి దూరమవుతారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వదంతులు వ్యాపిస్తాయని, అవమానాలను గురవుతామనే భయంతో చాలామంది తమలో తామే కుమిలిపోతారు. ఒకవేళ విషయాన్ని బటకు చెబితే వేధింపులకు పాల్పడిన వ్యక్తి నుంచి దాడులనూ ఎదుర్కోవాల్సి వస్తుందని మరికొందరు మిన్నకుండిపోతున్నారు.

స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని సాధించడానికి లైంగిక వేధింపులు తీవ్ర అవరోధంగా నిలుస్తాయి. దీనివల్ల దేశ సమగ్రాభివృద్ధిపై, ప్రజల సంక్షేమంపై హానికర ప్రభావం పడుతుంది. అందువల్ల లైంగిక వేధింపులను నిరోధించడం, వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. విద్యాలయాల్లో లైంగిక వేధింపులను ఇటీవల దిల్లీ హైకోర్టు తీవ్రంగా ఈసడించింది. అధ్యాపకులు తమ హోదాను దుర్వినియోగం చేస్తున్నారని, ఇది తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించింది. అధ్యాపకుడు అవసరాన్ని బట్టి విద్యార్థితో స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శకుడిగా నడుచుకోవాలి. ఈ బాధ్యతను విస్మరించి విద్యార్థినుల పట్ల కీచకుడిలాగా మారడం ఆ వృత్తికే తీవ్ర కళంకం. లైంగిక వేధింపులు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితులకు తావులేకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కలిసికట్టుగా అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. వర్సిటీల్లో ఎలాంటి వేధింపులు లేని సానుకూల వాతావరణం నిరంతరం కొనసాగేలా ఉపకులపతులు, పాలక మండళ్లు సరైన చర్యలు తీసుకోవాలి.

భరోసా కల్పించాలి

వివిధ రూపాల్లో జరిగే లైంగిక వేధింపుల గురించి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన పెంచాలి. లైంగిక వేధింపుల నిరోధక విభాగాలను ఏర్పాటు చేసి అవి చురుగ్గా పనిచేసేలా చూడాలి. వేధింపులకు పాల్పడిన వారిపై తీసుకునే చర్యల గురించి వర్సిటీలు, కళాశాలల్లోని అన్ని ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేసేలా చూడాలి. ఇలాంటివారి భద్రతకు భరోసా కల్పించడమూ తప్పనిసరి. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్‌ సైతం అందించాలి. ఇందుకోసం ప్రత్యేక నిపుణులను ఏర్పాటు చేసుకోవాలి. వేధింపులకు పాల్పడిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేసే అధికారం లైంగిక వేధింపుల నిరోధక విభాగానికి దఖలుపడాలి. విద్యార్థుల పట్ల పైశాచిక వేధింపులను ఎంతమాత్రం సహించేది లేదని ప్రభుత్వాలు సైతం హెచ్చరికలు జారీ చేయాలి. దోషులు ఎంతటి వారైనా కటకటాల వెనక్కి నెడతామన్న భరోసాను విద్యార్థుల్లో నింపాలి. అప్పుడే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తారు. అధ్యాపకులు సైతం సమాజంలో తమపై ఉన్న గొప్ప బాధ్యతను గుర్తించి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. అప్పుడే విద్యాలయాలు అసలైన విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందుతాయి.

 డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి
(వ్యక్తిత్వ వికాస నిపుణులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.