సమస్యల మైదానంలో ఆటల ఓటమి!

ఒకవైపు విశ్వ క్రీడలైన ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్‌ యోచిస్తోంది. అయితే, దేశంలో క్రీడాభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. అనేక క్రీడల్లో మన దేశం ఇంకా అర్హత టోర్నీల్లో ఆడే స్థితిలోనే ఉంది. దిగువ స్థాయి నుంచి క్రీడల్లో ప్రోత్సాహం లేకపోవడమే దీనికి కారణం.

Published : 30 Mar 2024 00:39 IST

ఒకవైపు విశ్వ క్రీడలైన ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్‌ యోచిస్తోంది. అయితే, దేశంలో క్రీడాభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. అనేక క్రీడల్లో మన దేశం ఇంకా అర్హత టోర్నీల్లో ఆడే స్థితిలోనే ఉంది. దిగువ స్థాయి నుంచి క్రీడల్లో ప్రోత్సాహం లేకపోవడమే దీనికి కారణం.

క్రీడల్లో మేటిగా వెలుగొందుతున్న అమెరికా, చైనా, రష్యాలతో పోలిస్తే భారత్‌లో ఆటలకు సంబంధించిన వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ నెలకొన్న అకాడమీల్లో ఒక్క వంతయినా భారత్‌లో లేవు. పైగా క్రీడలకు కేటాయించే నిధులు ఇండియాలో చాలా తక్కువగా ఉండటంతో ఆశించిన మేర ప్రగతి కనిపించడం లేదు. విదేశీ శిక్షకులు, అధునాతన సౌకర్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంవల్ల క్రీడాభివృద్ధి విస్తరించడం లేదు. భారత్‌లో ఉన్న అకాడమీల్లో పాతబడినవే ఎక్కువ. వాటిలో అధునాతన సౌకర్యాల లేమి కనిపిస్తోంది. దీనివల్ల మొక్కుబడిగానే శిక్షణ కొనసాగుతోంది. పటియాలా సాయ్‌ కేంద్రం లాంటి వాటిని పక్కనపెడితే జిల్లా స్థాయుల్లో అకాడమీలు పేరుకే పనిచేస్తున్నాయి. వాటిలో నాణ్యమైన శిక్షణ అందడంలేదు. దాంతో మెరుగైన ఫలితాలు కొరవడుతున్నాయి.

చిన్న వయసు నుంచే...

చైనాలో క్రీడాకారులను సైనిక శిక్షణ తరహాలో తీర్చిదిద్దుతారు. ఎవరికి ఏ ఆటలో రాణించగల సత్తా ఉందన్నది ముందే గుర్తించి చిన్న వయసులోనే సాధన మొదలుపెడతారు. ఈ ప్రక్రియ పాఠశాల స్థాయి నుంచే ప్రారంభం అవుతుంది. ఏదో ఒక క్రీడకు పరిమితం కాకుండా భిన్నమైన ఆటల్లో రాణించేందుకు చైనా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించింది. భారీ వ్యయంతో స్టేడియాలు నిర్మించింది. ఒకప్పుడు ఒలింపిక్స్‌ పతకాల్లో అగ్రస్థానం కోసం అమెరికా, రష్యా పోటీపడేవి. ఇప్పుడు చైనా సైతం ఈ రెండు దేశాలతో పాటు రేసులోకి వచ్చింది. జనాభా సంఖ్య పరంగా చైనా, భారత్‌ ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. ఆసియాలోనే మేటి ఛాంపియన్ల కార్ఖానాగా చైనా ఎదిగింది. అక్కడి పిల్లలు చిన్న వయసులోనే తప్పనిసరిగా క్రీడా అకాడమీల్లో చేరాలి. వారంలో 8-12 గంటల శిక్షణ తీసుకోవాలి. దాంతో వారికి ఏ ఆటలో పట్టుందో చిన్న వయసులోనే తెలుస్తుంది. అలా వారికి పట్టున్న క్రీడలోనే సాధన చేసి ఛాంపియన్లు అవుతున్నారు. భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. దేశీయంగా అయిదేళ్ల లోపు పిల్లల్లో 20శాతం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 43శాతం తక్కువ బరువుతో ఉన్నారు. శరీరం దృఢంగా లేకపోవడంతో చాలా మందికి క్రీడలపై ఆసక్తే ఉండటం లేదు. చైనాలో 8.50 లక్షల వ్యాయామశాలలు నెలకొన్నాయి. మూడువేలకు పైగా క్రీడా పాఠశాలలు కొనసాగుతున్నాయి. భారత్‌లో ఇలాంటివి వందల్లోనే ఉన్నాయి. విద్యార్థులకు పాఠశాలల్లో సరైన క్రీడా సౌకర్యాలు కల్పించే వ్యవస్థ మన దగ్గర లేదు. అసలు మైదానాలే లేని పాఠశాలలు మన దేశంలో కోకొల్లలు. దేశీయంగా పిల్లలందరికీ బలవర్ధకమైన ఆహారం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రతి బడిలో తప్పనిసరిగా మైదానం ఉండేలా నిబంధనలను కఠినతరం చేయాలి.

క్రికెట్‌కే ప్రాధాన్యం

సుమారు అయిదు కోట్ల మంది ప్రజలు ఉన్న కొరియా 140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌ కంటే మెరుగ్గా ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తోంది. కేవలం ఒలింపిక్స్‌పైనే దృష్టి పెట్టి చిన్నారులను భవిష్యత్‌ ఛాంపియన్లుగా తయారు చేస్తోంది. ప్రపంచంలోనే నెమ్మదిగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన జమైకా సైతం ఉసేన్‌ బోల్ట్‌ వంటి గొప్ప ఒలింపిక్‌ ఛాంపియన్లను అందించింది. అది కేవలం ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌’పైనే దృష్టి పెట్టి పతకాలు కొల్లగొడుతోంది. బడ్జెట్‌ కేటాయింపులు పెంచి చైనా స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తేనే భారత్‌ క్రీడల్లో మేటిగా ఎదుగుతుంది. చైనా అథ్లెట్లు ఒలింపిక్స్‌లో ఆడటమే జీవిత లక్ష్యంగా భావిస్తారు. వివిధ క్రీడల్లో కఠోర సాధన చేస్తారు. భారత్‌లో మాత్రం ఎక్కువమంది క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ దృక్పథంలో మార్పు వచ్చినప్పుడే క్రికెటేతర క్రీడల్లో ప్రగతి సాధ్యమవుతుంది. హాకీ, రెజ్లింగ్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌ లాంటి ఆటల్లో మునుపటి కంటే భారత్‌ మెరుగ్గా ఫలితాలు సాధిస్తున్న మాట నిజమే. అయితే వాలీవాల్‌, ఖోఖో లాంటి గ్రామీణ క్రీడల్లో మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతోంది. అకాడమీలు నామమాత్రంగా నడవడమే ఇందుకు ప్రధాన కారణం. కొన్ని చోట్ల ఒకే కోచ్‌ అన్ని ఆటలకు శిక్షణ ఇస్తున్నారు. అకాడమీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి శిక్షకుల సంఖ్యను పెంచాలి. యువతలో క్రికెటేతర క్రీడల్లోనూ ఆసక్తిని పెంపొందిస్తే భారత్‌ కచ్చితంగా మేటి ఛాంపియన్లను తయారుచేయగలదు.

దాస్యం వెంకట వంశీకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.