చారిత్రక విజ్ఞాన ఖని

ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు కుందూరి ఈశ్వరదత్తు 125వ జయంతి నేడు. అంకెలు, గణాంకాల ఉద్యోగంలో ఉన్నా, హృదయగతమైన ఆసక్తి దత్తును చరిత్ర పరిశోధన వైపు మళ్ళించింది. సాహితీవేత్తగానూ మార్చింది. కుందూరి ఈశ్వరదత్తు పేరు వినగానే తెలుగువారికి చరిత్ర భూగోళ శాస్త్రాల్లో విశేష పరిశ్రమ చేసిన పరిశోధకుడు గుర్తుకొస్తారు.

Published : 30 Mar 2024 00:39 IST

ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు కుందూరి ఈశ్వరదత్తు 125వ జయంతి నేడు. అంకెలు, గణాంకాల ఉద్యోగంలో ఉన్నా, హృదయగతమైన ఆసక్తి దత్తును చరిత్ర పరిశోధన వైపు మళ్ళించింది. సాహితీవేత్తగానూ మార్చింది.

కుందూరి ఈశ్వరదత్తు పేరు వినగానే తెలుగువారికి చరిత్ర భూగోళ శాస్త్రాల్లో విశేష పరిశ్రమ చేసిన పరిశోధకుడు గుర్తుకొస్తారు. భిన్నమైన అంశాలపై ఆలోచనాత్మక రచనలు చేసిన విమర్శకుడిగానూ ఈశ్వరదత్తు గుర్తింపు పొందారు. అనువాదంలోనూ ఆయనది అందె వేసిన చెయ్యి. ఈశ్వరదత్తు 1899 మార్చి 30న అప్పటి తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, నారాయణమూర్తి. కాకినాడలో పాఠశాల విద్యాభ్యాసం తరవాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుంచి బీఏ పట్టా పొందారు. ప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు, రచయిత చిలుకూరి వీరభద్రరావు దత్తుకు మేనమామ కావడంతో ఆయన సాంగత్యంలో చరిత్రపై ఆసక్తి ఏర్పడి ఆ రంగంలో పరిశోధనకు నడుంకట్టారు.

విద్యాభ్యాసం తరవాత ఈశ్వరదత్తు లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ శాఖలో ఉద్యోగంలో చేరారు. మద్రాసు, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కాకినాడల్లో పనిచేసి అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌గా 1954లో ఉద్యోగ విరమణ చేశారు. 1954-56 కాలంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. ఉద్యోగం చేస్తూనే చరిత్ర గ్రంథాలు అధ్యయనం చేస్తూ చారిత్రక ప్రదేశాలు సందర్శిస్తూ పరిశోధనా వ్యాసంగంలో నిమగ్నమయ్యేవారు. బళ్ళారిలో పనిచేస్తున్నప్పుడు హంపీ విజయనగర శిధిలాలు చూసి 1928లో జీర్ణ విజయనగర చరిత్ర అనే పరిశోధన గ్రంథం రాశారు. ఆంధ్ర హిస్టారికల్‌ జర్నల్‌, కళింగ సంచిక, రెడ్డి సంచిక, విజ్ఞాన సర్వస్వం, సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం మొదలైన వాటిలో చరిత్ర సంబంధమైన పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.

ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం అనే గ్రంథం ఈశ్వరదత్తుకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇది తొలుత 1960లో ప్రచురితమైంది. చరిత్ర, భూగోళ శాస్త్రాలు వేర్వేరు అధ్యయన అంశాలైనా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చరిత్ర భౌగోళిక పరిస్థితుల్ని సమన్వయం చేస్తూ దత్తు రూపొందించిన అమూల్యమైన గ్రంథం ఇది. శాసనాలు, పురాణాలు, ఆంధ్రాంగ్ల గ్రంథాలను క్షుణ్నంగా పరిశీలించి ఈ గ్రంథం వెలువరించారు. భూగోళం, కాలనిర్ణయం అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణాలు, క్షేత్రాలు, నదులు మొదలైన వాటికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వంగా దీన్ని పరిగణిస్తారు. ఆంధ్ర ప్రాంతంలోని నాడులు, విషయాలు, మండలాల స్వరూపాన్ని పటాల సాయంతో వివరించారు. వేగినాడు, పూంగినాడు, వెలనాడు, వెంగనాడు, రేనాడు, ములికినాడు, కాసలనాడు మొదలైన ప్రాంతాలను, ప్రాచీన కాలంలో వాటి స్థితిగతుల్ని వివరిస్తూ ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళ గ్రంథం రచించారు.

శాసన శబ్దకోశం ఈశ్వరదత్తు మరో విశిష్ట రచన. దీనికోసం రెండు దశాబ్దాలకు పైగా వందల శాసనాలను లోతుగా పరిశీలించి పరిపాలన, రాజ్యాంగం, న్యాయశాస్త్ర సాంకేతిక పదాలను సేకరించారు. ఆయా పదాల వాడుకకు సంబంధించిన పూర్వాపరాలను చర్చించి వాటి అర్థాలను నిర్ధారించారు. ఈ గ్రంథానికి రాసిన విపులమైన పీఠికలో దక్షిణ భారతదేశ లిపి చరిత్రను ఈశ్వరదత్తు విశదీకరించారు. అనుబంధంలో ప్రాకృత శాసనాల్లోని శబ్దార్థ వివరణ ఉంది. సాహిత్య సృజనలోనూ ఈశ్వరదత్తు గణనీయమైన పాత్ర పోషించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రిక కేంద్రస్థానం కాకినాడకు మారిన తరవాత 1964-66 మధ్య దాని సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఈశ్వరదత్తు పౌరాణిక చారిత్రక రచనలు చేశారు. రామాయణ ఇతివృత్తంతో ఉదార రాఘవం అనే నాటకం రాశారు. ఆంధ్రసాహిత్య పరిషత్‌ పత్రిక, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు మొదలైన వాటిలో ప్రచురితమైన దత్తు వ్యాసాల్లో ఆయన విమర్శనా పాటవం కనిపిస్తుంది. శ్రీనాథుడి కవితా తత్వంపై ధారావాహికగా సాహిత్య పరిషత్‌ పత్రికలో ప్రచురించిన వ్యాసాలు ఆయన ప్రతిభకు గీటురాళ్లు. మాధవ విద్యారణ్యులు, మంత్రి తిమ్మరుసు మొదలైన చారిత్రక పురుషుల జీవిత గాథల్ని అక్షరీకరించారు. నన్నెచోడుడు నన్నయ కన్నా ముందువాడని ప్రతిపాదించారు. పిఠాపురం చరిత్ర, రాజమహేంద్రవర రెడ్డి రాజ్య చరిత్రలను గ్రంథస్థం చేశారు. కృష్ణవేణ్యానది పేరుతో కృష్ణానదీ ప్రాంత చరిత్ర సంస్కృతుల్ని వివరించారు. వసుచరిత్ర రచన స్థల కాలాల్ని గురించిన వ్యాసం విలువైన సమాచారాన్ని అందిస్తుంది. 1968 అక్టోబరు ఆరున ఆయన కన్నుమూశారు. తెలుగువారి చరిత్ర సాహిత్యాలకు దత్తు సేవలు చిరస్మరణీయమైనవి.

డి.భారతీదేవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.