డిజిటల్‌ గుత్తాధిపత్యానికి కత్తెర

సాంకేతిక ఆన్‌లైన్‌ దిగ్గజ కంపెనీల పెత్తనంపై ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తున్నాయి. మార్చి నెలలో వివిధ సంస్థలకు అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)ల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆపిల్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్ల విపణిపై చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యం సాధించిందంటూ అమెరికా న్యాయశాఖ ఇటీవల దావా వేసింది.

Updated : 31 Mar 2024 01:33 IST

సాంకేతిక ఆన్‌లైన్‌ దిగ్గజ కంపెనీల పెత్తనంపై ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తున్నాయి. మార్చి నెలలో వివిధ సంస్థలకు అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)ల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆపిల్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్ల విపణిపై చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యం సాధించిందంటూ అమెరికా న్యాయశాఖ ఇటీవల దావా వేసింది. ఆపైన వారం రోజులు తిరగకుండానే ఆపిల్‌, ఆల్ఫాఫబెట్‌ (గూగుల్‌), మెటా (ఫేస్‌బుక్‌)లపై ఈయూ కొరడా ఝళిపించింది.

రోపా సమాఖ్య కొత్తగా తెచ్చిన డిజిటల్‌ విపణుల చట్టాన్ని సాంకేతిక దిగ్గజ కంపెనీలు ఉల్లంఘించాయేమోనని ఈయూ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దర్యాప్తును ఏడాదిలోపే ముగి స్తారు. ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే ఈ కంపెనీల అంతర్జాతీయ టర్నోవరులో 10శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తారు. మళ్ళీ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా మొత్తం 20శాతానికి పెరుగుతుంది. అవసరమనుకుంటే దిగ్గజ కంపెనీలను చిన్న చిన్నవిగా విభజించడానికి ఐరోపా డిజిటల్‌ విపణుల చట్టం (డీఎంఏ) వీలు కల్పిస్తోంది.

ఈయూ దర్యాప్తు

సంగీత సేవల్ని అందించే యాప్‌ల పంపిణీ మార్కెట్లో పోటీని ఆపిల్‌ అణగదొక్కిందంటూ ఈయూ ఇటీవల ఆ సంస్థకు 200 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఆ తరవాత మూడు వారాలకే మళ్ళీ ఆపిల్‌, గూగుల్‌, మెటాలకు ఈయూ షాకిచ్చింది. మరోవైపు అగ్రరాజ్య స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో పోటీని తొక్కేసి, ఎక్కువ ధరలకు ఐఫోన్లను అమ్ముకొంటోందని ఆపిల్‌ మీద అమెరికా న్యాయశాఖ దావా వేసింది. అమెరికా జనాభాలో సగంమంది వినియోగించే టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించడానికి వీలుకల్పించే బిల్లును ఆ దేశ పార్లమెంటు (కాంగ్రెస్‌) దిగువ సభ మార్చి నెలలోనే ఆమోదించింది. బిల్లు ఎగువ సభ ఆమోదమూ పొందితే దేశాధ్యక్షుడు సంతకం చేసి చట్టంగా మారుస్తారు. మార్చి ఏడు నుంచి అమలులోకి వచ్చిన ఐరోపా డిజిటల్‌ విపణుల చట్టం-   ఆల్ఫాఫబెట్‌ (గూగుల్‌), అమెజాన్‌, ఆపిల్‌, బైట్‌ డాన్స్‌ (టిక్‌టాక్‌), మెటా (ఫేస్‌బుక్‌), మైక్రోసాఫ్ట్‌లను గేట్‌ కీపర్లుగా వర్గీకరించింది. ఈ కంపెనీలకు ఈయూలో 45 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. ఆల్ఫాఫబెట్‌కు చెందిన గూగుల్‌ ప్లే, ఆపిల్‌కు చెందిన యాప్‌స్టోర్లు ఇతర డెవలపర్లకు ఉచిత సేవలను అందిస్తున్నాయా అని ఈయూ దర్యాప్తు జరుపుతోంది. గూగుల్‌ సెర్చి ఇంజిన్‌ వినియోగదారులను గూగుల్‌ షాపింగ్‌, గూగుల్‌ ఫ్లైట్స్‌ వైపు మళ్ళిస్తూ ఇతరులకు మార్కెట్లో అవకాశాలు దక్కకుండా చేస్తోందని ఈయూ అనుమానిస్తోంది. సొంత సేవలకే ప్రాధాన్యమిస్తూ ఇతరుల యాప్‌లను పక్కకునెట్టేసిందంటూ గూగుల్‌పై ఈయూ 2017లోనే 260 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఆపిల్‌ ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నుంచి తాము వద్దనుకున్న యాప్‌లను వినియోగదారులు తొలగించకుండా ఆ సంస్థ అడ్డుపడుతోందనే అనుమానాలున్నాయి. వినియోగదారులు కొంత రుసుము చెల్లించి వాణిజ్య ప్రకటనల బెడదను తప్పించుకోవచ్చని ఫేస్‌బుక్‌ చెబుతున్నా, నిజంగానే అందుకు వీలుంటుందా అనే సందేహాలున్నాయి. డేటా గోప్యతను ఉల్లంఘించిందంటూ ఫేస్‌బుక్‌కు నిరుడు ఈయూ 120 కోట్ల యూరోల జరిమానా విధించింది. అమెజాన్‌ తన సొంత బ్రాండ్లను అమ్ముకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందా అనీ ఈయూ దర్యాప్తు జరుపుతోంది.

టిక్‌టాక్‌పై కొరడా

టిక్‌టాక్‌ యాప్‌ సొంతదారైన బైట్‌ డాన్స్‌ కంపెనీ చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉందని, వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అమెరికా అనుమానిస్తోంది. ఇది నిరాధారమని బైట్‌ డాన్స్‌ ఖండిస్తోంది. టిక్‌టాక్‌ను ఏదైనా పాశ్చాత్య కంపెనీకి విక్రయించాలని అమెరికన్‌ శాసనకర్తల డిమాండ్‌. ఇది ఇతర చైనీస్‌ కంపెనీలకూ వర్తింపజేయరనే భరోసా ఏమీ లేదు. డిజిటల్‌ కంపెనీలు అమెరికన్‌ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాతోపాటు ఇతర ప్రత్యర్థి దేశాలకు బదిలీ చేయకూడదని బైడెన్‌ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద దిగ్గజ సాంకేతిక సంస్థలకు కళ్ళెం వేయడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించాలని అమెరికా, ఈయూ, చైనాలతోపాటు భారతదేశమూ బరిలోకి దిగింది. అయితే, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు వినియోగదారుల బదులు తమ మార్కెటింగ్‌ సేవలను ఉపయోగించుకునే విక్రేతలు, ఉత్పత్తిదారుల నుంచి అధికంగా డబ్బు పిండుకుంటున్నాయని గమనించాలి. సాంకేతిక దిగ్గజాలకు పగ్గాలు వేసే క్రమంలో వినియోగదారులతోపాటు కార్మికులు, ఉత్పత్తిదారులు, విక్రేతల ప్రయోజనాలకూ అగ్రాసనం వేయాలి.

 వరప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.