విదేశీ పెట్టుబడులకు ఎర్ర తివాచీ

ఒక దేశంలోని ఆర్థిక విధానాలు, చవకైన శ్రామిక వనరులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆకర్షిస్తాయి. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం సహజంగానే ఎఫ్‌డీఐలను రాబడుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులంటే రుణాలు కాదు. ఇక్కడ పరిశ్రమలు, వ్యాపారాల స్థాపనకు ఉపకరించే పెట్టుబడులు. ఇవి ప్రైవేటు రంగంలో పరిశ్రమల వృద్ధికి ఊతమిస్తాయి.

Published : 01 Apr 2024 02:07 IST

ఒక దేశంలోని ఆర్థిక విధానాలు, చవకైన శ్రామిక వనరులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆకర్షిస్తాయి. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం సహజంగానే ఎఫ్‌డీఐలను రాబడుతోంది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులంటే రుణాలు కాదు. ఇక్కడ పరిశ్రమలు, వ్యాపారాల స్థాపనకు ఉపకరించే పెట్టుబడులు. ఇవి ప్రైవేటు రంగంలో పరిశ్రమల వృద్ధికి ఊతమిస్తాయి. కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయి. భారత్‌లో 1991లో ఆర్థిక సరళీకరణ చేపట్టినప్పటి నుంచి ఎఫ్‌డీఐల ప్రవాహ వేగం ఊపందుకుంది. తదనంతర కాలంలోనూ వీటి ప్రాముఖ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించే విధానాలు అమలయ్యాయి. ప్రధానంగా విమానయానం, సమాచార సాంకేతికత, ఆరోగ్యం, పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక సేవల రంగాల్లో ఎఫ్‌డీఐలు భారీగా వచ్చాయి.

ప్రభుత్వ రంగం, బ్యాంకింగ్‌, ఆహారోత్పత్తులు, రిటైల్‌, పత్రికలు, ఉపగ్రహ సేవల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేదా లైసెన్సులు కావాలి. కొన్ని ఇతర రంగాల్లో ముందస్తు అనుమతి లేకుండానే ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నారు. లాటరీలు, జూదం, సిగరెట్లు, స్థిరాస్తి వ్యాపారం తదితర రంగాల్లో ఎఫ్‌డీఐని నిషేధించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో కంప్యూటర్‌, హార్డ్‌వేర్‌ రంగంలో అత్యధిక ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. ఇతర సేవా రంగాలకూ ఎక్కువగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ), ప్రధానమంత్రి గతిశక్తి, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజడ్‌) వంటి కార్యక్రమాలు ఎఫ్‌డీఐలను మరింతగా ఆకర్షిస్తాయని అంచనా. 2022లో పార్లమెంటు ఆమోదం పొందిన జన్‌విశ్వాస్‌ బిల్లు 42 చట్టాలను సవరించి కొన్ని చిన్నచిన్న నేరాలను శిక్షలు పడే చర్యల పరిధి నుంచి మినహాయించింది. ఇది వ్యాపారులు, వ్యాపార సంస్థలపై ఒత్తిడిని తగ్గించి సులభతర వాణిజ్యానికి బాటలు వేసింది. 2024-25లో పెద్ద సంఖ్యలో ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఆమోదం పొందనున్నాయి. ఎఫ్‌డీఐలు పెరిగితే ఉపాధి అవకాశాలు అధికమవుతాయి. కొత్త సాంకేతికతలతో అధిక ఉత్పాదన శక్తి సమకూరుతుంది. నాణ్యమైన ఉత్పత్తి ప్రక్రియలు అమలవుతాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో భారత్‌ అంతర్భాగం కావడానికి బాటలు వేస్తాయి. భారత్‌లో తయారీ కింద 25 రంగాల్లో ఎఫ్‌డీఐకి ద్వారాలు తెరిచింది. 2022లో అత్యధిక ఎఫ్‌డీఐని అందుకున్న దేశాలలో భారత్‌ 10వ స్థానంలో నిలిచింది. దశాబ్దాల ఆర్థిక సంస్కరణల ఫలితమిది. చైనాలోకి ఎఫ్‌డీఐ ప్రవాహం తగ్గుతుంటే భారత్‌లో పెరగడం విశేషం. ఒక దేశంలోకి ఇతర దేశాల నుంచి ఎఫ్‌డీఐ ప్రవేశించినట్లే, స్వదేశీ కంపెనీలు విదేశాల్లోనూ పెట్టుబడులు పెడతాయి. ఇవి పరదేశాల్లో ఎఫ్‌డీఐ అవుతాయి. ఇలా స్వదేశంలోకి వచ్చిన, ఇతర దేశాలకు వెళ్ళిన పెట్టుబడుల మధ్య తేడాను నికర ఎఫ్‌డీఐ ప్రవాహంగా పరిగణిస్తారు. అది వాణిజ్య లోటులా ఎక్కువగా ఉండవచ్చు లేక తక్కువగానూ ఉండవచ్చు. విదేశీ కంపెనీలు మన దేశంలో పూర్తిగా కొత్త కర్మాగారాలను లేదా విక్రయశాలలను స్థాపించవచ్చు. దాన్ని గ్రీన్‌ఫీల్డ్‌ ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు. ఇప్పటికే నెలకొన్న కర్మాగారాన్ని కొనుగోలు చేసి కొత్తగా ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించడాన్ని బ్రౌన్‌ఫీల్డ్‌ ఎఫ్‌డీఐగా వ్యవహరిస్తారు.

స్థానిక పరిశ్రమలను కాపాడటానికి సాధారణంగా ప్రభుత్వాలు ఎఫ్‌డీఐలపై పరిమితులు విధిస్తాయి. అలాగే రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడానికి కొన్ని కీలక రంగాల్లో ఎఫ్‌డీఐలను కట్టడి చేస్తాయి. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యాలయాలు నిర్మించడమూ ఎఫ్‌డీఐ కిందికే వస్తుంది. పన్ను రాయితీలు, చవక శ్రామిక వనరులు ఎఫ్‌డీఐని ఆకర్షిస్తాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మార్కెట్‌ వైవిధ్యీకరణకు తోడ్పడతాయి. మన యువతకు సాంకేతిక నైపుణ్యాలను అలవరచి ఉపాధి అవకాశాలు పెంచుతాయి. సంస్థాగత నిర్వహణా నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. ఎఫ్‌డీఐల వల్ల స్థానిక పరిశ్రమలు దెబ్బతినడం, విదేశీ కంపెనీలు ఇక్కడ ఆర్జించిన లాభాలను ఇక్కడే వ్యాపార విస్తరణకు ఉపయోగించకుండా తమ దేశాలకు తరలించుకుపోవడం వంటి ప్రతికూల కోణాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రతికూల అంశాలను నియంత్రిస్తూ ఎఫ్‌డీఐని ఆర్థికాభివృద్ధికి సాధనంగా ఉపయోగించుకునే విధానాలను భారత్‌ చేపట్టాలి. ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి సుస్థిర వ్యాపార వాతావరణాన్ని కల్పించాలి. పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను ఇవ్వాలి. నిపుణ మానవ వనరులను సృష్టించాలి. మౌలిక వసతులను విస్తరించాలి. బలీయ అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరచుకోవాలి. తద్వారా ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించాలి.  

శ్రీరామ్‌ చేకూరి (ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.