ఆనందమే జీవిత మకరందం

ఆనందమయ జీవనంలో భారత్‌ ఎంతో వెనకంజలో ఉంది. అనునిత్యం సంక్షోభాలతో సావాసం చేస్తున్నదేశాల పరిస్థితి సైతం మనకన్నా మెరుగ్గా ఉంది. మెరుగైన విద్యావకాశాలు, వైద్య వసతులు, సామాజిక భద్రత అంశాలు వంటివి సంతోష జీవితానికి మార్గాలుగా మారుతున్నట్లు గుర్తించారు.

Published : 02 Apr 2024 00:42 IST

ఆనందమయ జీవనంలో భారత్‌ ఎంతో వెనకంజలో ఉంది. అనునిత్యం సంక్షోభాలతో సావాసం చేస్తున్నదేశాల పరిస్థితి సైతం మనకన్నా మెరుగ్గా ఉంది. మెరుగైన విద్యావకాశాలు, వైద్య వసతులు, సామాజిక భద్రత అంశాలు వంటివి సంతోష జీవితానికి మార్గాలుగా మారుతున్నట్లు గుర్తించారు.

టీవల విడుదలైన ప్రపంచ ఆనంద నివేదిక (డబ్ల్యూహెచ్‌ఆర్‌)లోని 143 దేశాల్లో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. నిత్యం ఉగ్రదాడులు, రాజకీయ కుమ్ములాటలు, ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ 108వ స్థానంతో భారత్‌కన్నా మెరుగైన స్థితిలో ఉండటం విశేషం. నిరంతర సంక్షుభిత ఇరాక్‌, లిబియా, పాలస్తీనా వంటి దేశాలకన్నా భారత్‌ తీసికట్టుగా ఉందనడం అర్థంకాని విషయం. నిరుడు అక్టోబరు నుంచి హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ను ప్రపంచంలో అత్యంత ఆనందమయమైన 20 దేశాల్లో చేర్చడం ఆశ్చర్యకరం. జీవన వ్యయం పెరిగిందని ప్రజలు సతమతమవుతున్న బ్రిటన్‌ కూడా టాప్‌ 20లో చోటు సంపాదించింది. సర్వే సంస్థ గ్యాలప్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి సాధన నెట్‌వర్క్‌లు ప్రపంచ ఆనంద నివేదిక (డబ్ల్యూహెచ్‌ఆర్‌) రూపకల్పనలో పాలు పంచుకున్నాయి. నిధుల కేటాయింపు, అభివృద్ధి సాధన విధానాల రూపకల్పనకు తమ నివేదికలోని అంశాలు తోడ్పడాలని డబ్ల్యూహెచ్‌ఆర్‌ రూపకర్తలు ఆశిస్తున్నారు.

ఈ ఏడాది కూడా ఫిన్లాండ్‌ ప్రపంచంలో అత్యంత ఆనందమయ దేశంగా నిలిచింది. ఇప్పటికే ఏడేళ్లుగా ఫిన్లాండ్‌ డబ్ల్యూహెచ్‌ఆర్‌లో అగ్రస్థానం సాధిస్తూ వస్తోంది. ఇతర   స్కాండినేవియా దేశాలైన స్వీడన్‌, నార్వే, డెన్మార్క్‌, ఐస్‌ల్యాండ్‌ మొదటి నుంచీ ఆనందమయ దేశాలుగా ఖ్యాతి పొందుతున్నాయి. 20 అగ్రగామి ఆనందమయ దేశాల్లో ఆసియా నుంచి ఇజ్రాయెల్‌, కువైట్‌, మధ్య అమెరికా నుంచి కోస్టారికా మాత్రమే చోటు పొందాయి. ఉత్తర అమెరికా ఖండంలో కెనడాకు టాప్‌ 20లో స్థానం లభించినా, అమెరికా మొదటిసారి టాప్‌ 20 నుంచి జారిపోయి 23వ స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు టాప్‌ 20లో స్థానం లభించగా, మిగతా అగ్రగామి ఆనందమయ దేశాలన్నీ ఐరోపా ఖండానికి చెందినవే. భారత్‌ ర్యాంకు పొరుగు దేశాలైన చైనా, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకన్నా తీసికట్టుగా ఉన్నట్లు నివేదిక తేల్చింది. జీడీపీకన్నా స్థూల జాతీయ ఆనందమే మిన్న అని భూటాన్‌ 2008లో తీర్మానించడం ప్రపంచ ఆనంద నివేదిక రూపకల్పనకు స్ఫూర్తినిచ్చింది. 2012 నుంచి ఈ నివేదిక వెలువడుతోంది. భూటాన్‌ సంపన్న దేశం కాకపోవడంతో అగ్రగాముల సరసన చేరలేక ఈ ఏడాది 95వ స్థానంతో సరిపెట్టుకొంది. ఈ నివేదిక కోసం సర్వేలో పాల్గొనేవారిని ఆత్మసంతృప్తికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. వాటికిచ్చే జవాబుల ఆధారంగా 10 పాయింట్ల సూచీని రూపొందిస్తారు. ఈ సూచీలో 7.344 పాయింట్లతో ఫిన్లాండ్‌ మొదటి ర్యాంకు సాధించగా, భారత్‌ 4.054 స్కోరుతో సరిపెట్టుకుంది. జాబితాలో అట్టడుగున ఉన్న అఫ్గానిస్థాన్‌ ప్రపంచంలో అత్యంత అసంతృప్త దేశంగా మిగిలింది.

ఒక దేశ ప్రజలు గత మూడేళ్లలో తమ జీవన నాణ్యత గురించి వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా డబ్ల్యూహెచ్‌ఆర్‌ను రూపొందిస్తారు. జీడీపీ, ఆయుర్దాయం, అవినీతిరహిత సమాజం, స్వేచ్ఛగా జీవిస్తున్నామనే భావన, ఔదార్యం వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల ప్రజల ఆత్మతృప్తిని, ఆనందాన్ని గణిస్తారు. మానసిక ఆరోగ్యం, నైతిక ప్రమాణాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. జవాబులను మనస్తత్వవేత్తలు, ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషించి ప్రపంచ ఆనంద నివేదికను రూపొందిస్తారు. డబ్ల్యూహెచ్‌ఆర్‌ రూపకల్పనలో మొదటిసారిగా వయోవర్గాలను పరిగణనలోకి తీసుకున్నారు. 30 ఏళ్ల లోపువారు, 60 ఏళ్లు పైబడినవారు తమ సుఖదుఖాల గురించి ఏమనుకుంటున్నదీ తెలుసుకున్నారు. భారతీయులు కొవిడ్‌ తరవాత మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నందువల్లే డబ్ల్యూహెచ్‌ఆర్‌లో ఇండియా స్థానం మెరుగుపడలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్‌లో 60 ఏళ్లు పైబడినవారు తమ జీవితంపై ఎక్కువ ఆత్మసంతృప్తిని వ్యక్తం చేసినట్లు డబ్ల్యూహెచ్‌ఆర్‌ తెలిపింది. వృద్ధ పురుషులకన్నా, వృద్ధ మహిళలు ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలవారికన్నా అగ్రకులాల వృద్ధులు జీవితంపై ఎక్కువ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు నివేదిక చెబుతోంది. మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రతా సదుపాయాలు, పని, జీవితం మధ్య సమతూకం, సమానత్వం, ప్రకృతితో బంధం, స్వేచ్ఛ, నమ్మకం వెల్లివిరిసే దేశాలు ఆనందంగా జీవిస్తాయని డబ్ల్యూహెచ్‌ఆర్‌ నివేదిక నిర్ధారిస్తోంది.

ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.