నిష్క్రమణకు సర్వం సిద్ధం...

‘ఎన్నికలకు సర్వం సిద్ధం! మన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉన్నాయాలేదా సమీక్షించుకుందాం.’ ‘అంతా సిద్ధమే! అనుకున్నది అనుకున్నట్లుగా సిద్ధం  చేసిపెట్టాం సార్‌!’ ‘ఓటర్ల జాబితాలన్నీ ముందు అనుకున్నట్లుగానే సిద్ధమయ్యాయి కదా?’

Published : 02 Apr 2024 00:43 IST

‘ఎన్నికలకు సర్వం సిద్ధం! మన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉన్నాయాలేదా సమీక్షించుకుందాం.’
‘అంతా సిద్ధమే! అనుకున్నది అనుకున్నట్లుగా సిద్ధం చేసిపెట్టాం సార్‌!’
‘ఓటర్ల జాబితాలన్నీ ముందు అనుకున్నట్లుగానే సిద్ధమయ్యాయి కదా?’
‘అంతా కిందామీదా చేసేశాం. మనవాళ్లు కాదనుకున్న పేర్లన్నీ తీసేయించాం. మన కోసం కొత్త పేర్లు చేర్చాం. ఊళ్లో ఉండటం లేదన్న సాకుతో అవతలి పక్షం పేర్లన్నీ తొలగించాం. మరో రాష్ట్రంలో ఓటుందని బొంకి మరికొన్ని పేర్లు తీసేశాం. పెళ్ళికాని అమ్మాయిలకు అయినట్లు ఫిర్యాదు చేసేసి, అత్తారింటి కోసం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారని ఆడవాళ్ల పేర్లు తొలగించాం. వలస వెళ్లారని కొంతమందివి, చనిపోయారని మరికొంతమంది పేర్లూ లేపేశాం. రుజువుల కోసం డెత్‌ సర్టిఫికెట్లూ తయారుచేశాం. ఒకే పేరును అటూఇటూ మార్చేసి, రెండుమూడు ఊళ్లలో కొత్త ఓట్లు నమోదు చేయించాం. ఓట్ల జాబితాల్లోకి అవసరమైన అన్ని మార్గాల్లోనూ దూరి, నానా కంగాళీ చేసేశాం. అవతలి ఓట్లు లక్షల్లో లేపేశాం. అంతకుమించి మన ఖాతాలో చేర్చేశాం. కాకపోతే, అధికారుల నుంచి అనవసరమైన అడ్డంకులు ఎదురవ్వకుండా కాస్త చూసుకోవాలి సార్‌!’
‘అంతా మనవాళ్లే! చిన్నా,పెద్దా అధికారులందరినీ సెట్‌ చేసేశాం. మన పార్టీ నాయకులకన్నా కిందికి వంగి మనకు పని చేసిపెడతారు, మన కార్యకర్తలే అనుకోండి!’
‘ఎన్నికల అధికారులు కన్నేస్తారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో నివేదికలు వెళ్తాయి, సార్‌’  
‘అందుకే అంతా మన కనుసన్నల్లో పనిచేసేలా రెడీ చేశాం. కింది స్థాయిలో అంతా బాగానే ఉందని అధికారులు పైకి నివేదికలు పంపుతుంటారు. అంతా సవ్యంగానే సాగుతోందని ఎన్నికల అధికారులనూ నమ్మిస్తాం కదా!’
‘అలాంటి అధికారులపై ఫిర్యాదులు చేస్తే ఎలా?’
‘ఎంతమందిపై ఫిర్యాదు చేస్తారు, మరెంతమందిపై ఎంక్వైరీ చేస్తారు. మహాఅయితే, ఒకరిద్దరిపై నొప్పి పుట్టని దెబ్బలా సుతిమెత్తని చర్యలు ఉంటాయి. అన్నీ అందరికీ అర్థమయ్యేసరికి ఎన్నికలే వచ్చేస్తాయి. అదంతా పక్కనపెట్టండి. పంపకాలే మన బలం. డబ్బులు పంచడానికి అన్ని మార్గాలూ రెడీయేనా?’
‘ఇప్పటికే పథకాల చాటున, పింఛన్ల మాటున సర్కారు సొమ్మునే అప్పనంగా పంచేశాం... గుట్టుచప్పుడు కాకుండా నేరుగా ఓటర్ల ఖాతాల్లో వేసేస్తాం, సార్‌.’
‘జాగ్రత్త, బ్యాంకు ఖాతాలపైనా అధికారులు కన్నేసి ఉంచుతారు’
‘అప్పులు ఇచ్చామనో, తీర్చామనో, చేబదులుగా ఇచ్చామనో...ఏదో ఒక పేరు మీద ఓటర్లకు డబ్బులు పంచే ఏర్పాట్లు చేశాం. ఖాతాల గుట్టు బయటికొచ్చి గగ్గోలు పుడితే, ఆ గోలచాటున మనం ఊరూవాడా ఏర్పాటు చేసుకున్న సేవకుల సైన్యం అండతో మూడోకంటికి తెలియకుండా ముట్టజెప్పేస్తాం. పైగా, వాళ్లంతా సర్కారీ సేవకులు కాబట్టి అనుమానం రాదు. కొన్నిచోట్ల డబ్బుల్ని ముందుగానే దుకాణాల్లో పెట్టేశాం. ఓటర్లు నేరుగా దుకాణాలకే వెళ్ళి డబ్బులు తెచ్చేసుకుంటారు. ఇదంతా చేసిపెట్టేందుకు దుకాణ యజమానులకు భారీగానే కమిషన్లు ముట్టజెప్పాం సార్‌’
‘ఎన్నికలయ్యేదాకా రోజూ మూడు పూటలా బీరూబిర్యానీలు అందాలి. మనమే వండివడ్డిస్తే తెలిసిపోతుంది. అభ్యర్థుల ఖాతాల్లోకి ఖర్చు చేరితే ఇబ్బందే! పైగా మద్యం పంచితే పట్టుకుంటారు, ఏం చేద్దాం?’  
‘టెన్షనేమీ లేదు సార్‌... మందు ఘాటు, బిర్యానీ వాసన మన చేతికి అంటకుండానే ఓటర్లందరికీ అందుతాయి. వాళ్లంతా రోజూ రావడం తినడం, తాగడం, తేన్చడం, పోలింగ్‌ రోజు మన గుర్తుమీద గుద్దడం... అంతే సార్‌’
‘ఇదంతా అనుకున్నంత తేలిగ్గా జరిగిపోతుందా?’  
‘మన నాయకుల్లోనే రోజూ ఎవరో ఒకరివి పుట్టినరోజులు, పెళ్ళిరోజులు, అవీఇవీ ఫంక్షన్లు జరిగేలా ప్లాన్‌ చేశాం. అక్కడే విందులిస్తాం. తాగినవాళ్లకు తాగినంత, తిన్నవాళ్లకు తిన్నంత సంతర్పణ చేస్తాం. ఫ్యామిలీ పార్టీల ముసుగులో జరిపించేస్తాం. ఫంక్షన్‌ హాళ్లన్నీ బుక్‌ చేసేశాం. పార్టీలకు రావడానికి మొహమాటపడే ఉత్తమపురుషులకు హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లలో తిని తాగి తూగేలా కూపన్లు ఇచ్చేస్తాం.’
‘మురికివాడలు, పూరి గుడిసెల జనాలకు మరిన్ని సేవలు అందాలి’
‘వాళ్లకు తాగడానికి, తినడానికి ఏర్పాట్లతోపాటు నేరుగా కిరాణా దుకాణాలకు వెళ్ళి కావాల్సిన సరకులు, చికెన్‌, మటన్‌ తెచ్చుకొని వండుకొని తినేలా ఏర్పాట్లు చేశాం. ఆడవాళ్లయితే చీరలు, డ్రస్సులు కూడా తెచ్చుకోవచ్చు సార్‌.’
‘మరి, యూత్‌ సంగతేమిటి?’
‘వాళ్లకు బీర్లు పోస్తాం, బైకులకు పెట్రోలు పోస్తాం. మందేం ఖర్మ, మత్తు నెత్తికెక్కిస్తాం. అన్ని గ్యాంగులకీ క్రికెట్‌ కిట్లు, క్యారం బోర్డులు, ఆటవస్తువులు అందుతాయి.’
‘అన్ని వర్గాలూ అన్నీ తీసుకుని, ఆఖరి రీలులో కళ్లు తెరిచి... నిజాయతీ గుర్తుకొచ్చి అవతలి పక్షానికే ఓటేస్తే?’
‘అలా జరగకూడదని గ్యారంటీ ఏమీలేదు సార్‌! అలాగే జరగొచ్చనే అనుమానాలూ లేకపోలేదు. గాలి అవతలి వైపే బలంగా వీస్తే, మనం చేసేదేమీ ఉండదు. ఫ్యాన్‌ గాలినైతే నంబర్లు తగ్గించి స్పీడ్‌ తగ్గిస్తామేమో, ప్రకృతి పవనాల్ని అడ్డుకోలేం. అవి ఎటు వీస్తే, గెలుపూ అటువైపే! అప్పుడు మనం తూర్పు తిరిగి- ఆవిరైన నవ్వుతో ఏడుపు మిళితమైన, ఆందోళన, ఆదుర్దా కలగలిసిన ముఖకవళికలతో సెల్ఫీ తీసుకోవడమే!’

శ్రీశైలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు