అమెరికాలో తుపాకుల మోత

శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగమిస్తూ ప్రపంచ యవనికపై వెలిగిపోతున్న అమెరికా ప్రభ- తుపాకీ సంస్కృతితో మసకబారుతోంది. తుపాకీ అంటేనే అక్కడి ప్రజలు గడగడలాడిపోతున్నారు. చదువు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన భారతీయులు, ఇతర దేశాలవారు అక్కడ తూటాలకు బలైపోతుండటం  విషాదకరం.

Updated : 03 Apr 2024 01:38 IST

శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగమిస్తూ ప్రపంచ యవనికపై వెలిగిపోతున్న అమెరికా ప్రభ- తుపాకీ సంస్కృతితో మసకబారుతోంది. తుపాకీ అంటేనే అక్కడి ప్రజలు గడగడలాడిపోతున్నారు. చదువు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన భారతీయులు, ఇతర దేశాలవారు అక్కడ తూటాలకు బలైపోతుండటం  విషాదకరం.

త్మరక్షణ కోసం ఆయుధాలను కలిగి ఉండటం అమెరికా పౌరులకు ఆ దేశ రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. అయితే, తుపాకుల మూలంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొందరు ఉన్మాదులుగా మారి తుపాకులతో అమాయకులను పిట్టల్లా కాల్చి చంపుతున్నారు. కాల్పుల్లో అమెరికా పౌరులే కాదు- భారతీయులు, ఇతర దేశాలవారు సైతం మరణిస్తున్నారు. దాంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. అధిక ఆదాయాలు కలిగిన దేశాలతో పోలిస్తే అమెరికాలో తుపాకీతో హత్యలు 26 రెట్లు, ఆత్మహత్యలు 12 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అక్కడి పౌరులు వాటితో ఎదుటివారిని కాల్చడమో, తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడమో పరిపాటిగా మారింది. ఇందుకు ప్రధాన కారణం- పద్దెనిమిదేళ్లు నిండినవారికి ఎలాంటి ఆంక్షలూ లేకుండా తుపాకులు సునాయాసంగా దొరకడమే! భారత్‌లోని గల్లీ దుకాణాల్లో పప్పూబెల్లాలు దొరికినంత సులువుగా అమెరికాలో తుపాకులు, తూటాలు లభ్యమవుతాయంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా పుట్టినరోజు నాడు మధుర జ్ఞాపకంగా వస్తువులో, దుస్తులో, వాహనాలో కొనుక్కుంటారు. అమెరికాలో మాత్రం 18 ఏళ్లు నిండిన సందర్భంగా చాలామంది కుర్రాళ్లు పుట్టినరోజు జరుపుకొని అందుకు గుర్తుగా తుపాకీలను కొనుగోలు చేస్తారు. రెండేళ్ల క్రితం టెక్సాస్‌లో పుట్టినరోజు సందర్భంగా పిస్తోలు కొనుగోలుచేసిన పద్దెనిమిదేళ్ల యువకుడు- మొదట తన నాయనమ్మను కాల్చిచంపాడు. తరవాత బడికి వెళ్ళి పదేళ్ల పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంతో 19మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2018 జనాభా లెక్కల ప్రకారం అమెరికా జనసంఖ్య 33 కోట్లు. అయితే, సగటున ప్రతి 200 మంది వద్ద 120.5 తుపాకులు ఉన్నాయి. ఆయుధాల కారణంగానే అక్కడ గడచిన 50 ఏళ్లలో దాదాపు 15లక్షల మంది చనిపోయారు. ఈ ఏడాది తొలి నాలుగు రోజుల్లోనే కాల్పుల ఘటనల్లో సుమారు 400 మంది చనిపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తుపాకీ హింస కారణంగా అగ్రరాజ్యంలో రోజూ సగటున 110 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా 2020వ సంవత్సరం నుంచి కాల్పుల ఘటనలు తీవ్రమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014లో 273 తుపాకీ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2020 నాటికి అవి ఏకంగా 610కి పెరిగాయి. 2021, 2022, 2023 సంవత్సరాల్లో వరసగా 690, 647, 654 కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. తూటాలకు గురై 2019లో 33,599 మంది, 2022లో 44,290 మంది, 2023లో 42,888 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి కాల్పుల్లో భారతీయులు సైతం మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో మాస్టర్స్‌ చేయడానికి వెళ్ళిన పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన కూచిపూడి, భరతనాట్య కళాకారుడు అమర్‌నాథ్‌ ఘోష్‌ను గత ఫిబ్రవరిలో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్చిచంపారు. అంతకు కొన్నిరోజుల ముందు ప్రవాస భారతీయులు కొందరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దుండగుల కాల్పుల్లోనే వారు చనిపోయినట్లు భావిస్తున్నారు.

తుపాకుల నియంత్రణకు రాజ్యాంగాన్ని సవరించాలన్న డిమాండ్‌ అమెరికాలో చాలాకాలంగా వినిపిస్తోంది. ఆయుధాల కట్టడికి అవసరమైన చర్యలు చేపడతామని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. రాజ్యాంగ సవరణ చేపట్టకుండా, తుపాకుల నియంత్రణకు చర్యలు తీసుకోకుండా ఆయుధ ఉత్పత్తి సంస్థలు లాబీయింగ్‌ చేయడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తుపాకుల నియంత్రణకు స్వచ్ఛందంగా చర్యలు చేపట్టడమే మేలైన పరిష్కారమంటున్నారు. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ గతేడాది ‘తుపాకీ అప్పగించండి... గిఫ్ట్‌కార్డు పొందండి’ నినాదంతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. అలా అక్కడి పౌరుల నుంచి మూడు వేలకు పైగా ఆయుధాలను స్వాధీనపరచుకున్నారు. ఇతర రాష్ట్రాలు సైతం అటువంటి కార్యక్రమాలను చేపట్టడం ఎంతో అవసరం. చదువు, ఉద్యోగం, వ్యాపారం కోసం అమెరికాలో ఉంటున్న భారతీయులు, ఇతర దేశాలవారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. స్థానికులతో వాదనలకు, ఘర్షణలకు దిగకుండా స్వీయరక్షణ చర్యలు అవలంబించాలి.

ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.