చేపల వినియోగంలో మనమెక్కడ?

చేపల సాగు ప్రస్తుతం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆక్వా రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇటీవల తీపి కబురు ఒకటి వినిపించింది. దేశీయంగా చేపల వినియోగం పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. 

Updated : 03 Apr 2024 01:39 IST

చేపల సాగు ప్రస్తుతం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆక్వా రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇటీవల తీపి కబురు ఒకటి వినిపించింది. దేశీయంగా చేపల వినియోగం పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. 

దేశీయంగా వార్షిక తలసరి చేపల వినియోగం 2005-21 మధ్య కాలంలో 4.9 కేజీల నుంచి 8.89 కేజీలకు పెరిగినట్లు ఇటీవలి సర్వే వెల్లడించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌), దాని అనుబంధ జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ(ఎన్‌ఎఫ్‌డీబీ), వ్యవసాయ పరిశోధన, బోధనా శాఖ (డీఏఆర్‌ఈ), ప్రపంచ మత్స్య పరిశోధన సంస్థ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం భారత్‌లో చేపలు తినే జనాభా 2005-21 మధ్య కాలంలో 73 కోట్ల నుంచి 96 కోట్లకు పెరిగింది. ఈ నివేదిక రూపొందించే సమయానికి మొత్తం జనాభా 2005లో 111 కోట్ల నుంచి 2021కి 134 కోట్లకు పెరిగిందని అంచనా వేశారు.

కోట్ల మందికి ఉపాధి

ఇండియాలో ఏటా 1.41 కోట్ల మెట్రిక్‌ టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 1.18 కోట్ల మెట్రిక్‌ టన్నులు (దాదాపు 84శాతం) దేశీయంగానే వినియోగమవుతున్నాయి. మిగిలినవి ఎగుమతులకు, ఆహారేతర అవసరాలకు మళ్ళుతున్నాయి. ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో ఎనిమిది శాతం వాటాతో ఇండియా మూడో స్థానంలో నిలుస్తోంది. చైనా, ఇండొనేసియా మనకన్నా ముందు ఉన్నాయి. మంచినీటి మత్స్య ఉత్పత్తి పరంగా ఇండియాకు ప్రపంచంలో రెండో స్థానం దఖలుపడింది. అయితే, ప్రపంచ దేశాల తలసరి వినియోగం 20.5 కేజీలతో పోలిస్తే చేపల వినియోగంలో ఇండియా ఇప్పటికీ చాలా వెనకబడింది. ప్రస్తుతం చేపల స్థూల వినియోగంలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నా, తలసరి వినియోగంలో 183 దేశాల సరసన 123వ స్థానానికి పరిమితమవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి వినియోగం 14.94 కేజీలతో పోల్చినా భారత్‌ చాలా వెనకంజలో ఉంది. దేశీయంగా త్రిపుర రాష్ట్రం 27 కిలోల తలసరి చేప వినియోగంతో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఈ రాష్ట్రంలో 99.35శాతం జనాభా చేపలు తింటున్నారు. హరియాణాలో అత్యల్పంగా 20.55శాతం జనాభా మాత్రమే చేపలను ఆహారంగా తీసుకుంటున్నారు.

ప్రస్తుత నివేదిక ప్రకారం దేశీయంగా చేప మాంసం తలసరి వినియోగం ఇలాగే పెరిగితే 2030 నాటికి 19.8 కేజీలకు, 2040 నాటికి 31.7 కేజీలకు, 2048 నాటికి 41.29 కేజీలకు చేరుతుంది. అంటే, 2029-30 నాటికి భారత్‌లో చేపలకు గిరాకీ 2.96 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పెరుగుతుంది. ప్రస్తుత ఉత్పత్తితో పోలిస్తే ఇది రెట్టింపు. ఇక దేశీయంగా చేపల అవసరం 2040 నాటికి అయిదు కోట్ల మెట్రిక్‌ టన్నులకు, 2048 నాటికి 6.81 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని అంచనా. దీనికి తగ్గట్టుగా ఇండియాలో చేపల ఉత్పత్తిని పెంచాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ మన దేశంలో 40 లక్షల హెక్టార్ల మంచి నీటి వనరులను నిరుపయోగంగా వదిలేస్తున్నాం. వాటిలోనూ చేప పిల్లలను విడుదల చేస్తే ఇరవై లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. అయిదు కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో మడ అడవుల విధ్వంసం, వాతావరణ మార్పుల వల్ల సముద్ర వేటలో తగినంతగా చేపలు దొరకడం లేదు. దీనికి పరిష్కారంగా సముద్ర మార్గంలో జరిగే దిగుమతి, ఎగుమతి సుంకాల నుంచి కనీసం ఒక శాతాన్ని సముద్ర పర్యావరణ పర్యవేక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు, సముద్ర మత్స్య ఉత్పత్తి పెంపుదలకు వెచ్చించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల దాదాపు అయిదు కోట్ల మత్స్యకార జనాభాకు ఉపాధితో పాటు ఆర్థిక భద్రత చేకూరుతుంది.

అవగాహన అవసరం

దేశీయంగా మత్స్య ఉత్పత్తిలో 28శాతం సముద్ర వేట ద్వారా లభిస్తోంది. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్‌ 44 లక్షల టన్నుల ఉత్పత్తితో అగ్రభాగాన నిలుస్తోంది. పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశా, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలు తరవాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. మంచినీటి చేపల సాగు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశాలలో ఎక్కువ. మిగిలిన రాష్ట్రాలలోనూ మంచినీటి వనరుల్లోని చేపలే సింహభాగం దేశీయ ఆహార అవసరాల్ని తీరుస్తున్నాయి. చేపల వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్య స్థితిగతులు బాగున్నట్లు ఇటీవలి నివేదిక వెల్లడించింది. చేపల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు సైతం చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. దేశీయంగా చేపల ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. ఆ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పటిష్ఠంగా అమలు చేయాలి.

కరణం గంగాధర్‌ (ఆక్వారంగ నిపుణులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.