ప్రజారోగ్యానికి కల్తీ ముప్పు

దేశంలో ఆహార కల్తీ అంతకంతకు పెచ్చుమీరుతోంది. కలుషిత ఆహారం కారణంగా రోజూ ఎంతో మంది తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. పరిస్థితి చేయిదాటడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార నాణ్యతను పెంపొందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కల్తీ ఆహార ఉత్పత్తుల కారణంగా ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది.

Updated : 04 Apr 2024 04:52 IST

దేశంలో ఆహార కల్తీ అంతకంతకు పెచ్చుమీరుతోంది. కలుషిత ఆహారం కారణంగా రోజూ ఎంతో మంది తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. పరిస్థితి చేయిదాటడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార నాణ్యతను పెంపొందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.

కల్తీ ఆహార ఉత్పత్తుల కారణంగా ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. హైదరాబాద్‌లో ఇటీవల పలు ప్రాంతాల్లో రసాయనాలతో మగ్గబెట్టిన మామిడిపండ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల పానీపూరి తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడటం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆహార ఉత్పత్తులపై సరైన నిఘా కొరవడటంవల్లే దేశంలో తరచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు పాలు, టీ పొడి మొదలు పసుపు, కారం, మసాలా దినుసులు వంటి వంట సరకులన్నీ కల్తీ అవుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టం-1954 కఠిన శిక్షలు నిర్దేశించినా, అవి ఎక్కడా సరిగ్గా అమలు కావడంలేదు.

హానికర రసాయనాలు...

ప్రజలందరికీ పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడటం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు మారుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో దుకాణదారుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. దాంతో కొందరు కల్తీకి పాల్పడుతూ తక్కువ ధరకే సరకులను విక్రయిస్తున్నారు. మరోవైపు, సిద్ధం చేసిన ఆహారంవైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. వారిని ఆకర్షించడం కోసం చాలామంది దుకాణదారులు తినుబండారాలు, ఆహార పదార్థాల తయారీలో రుచి, రంగు కోసం హానికరమైన రసాయనాలు, రంగులను ఉపయోగిస్తున్నారు. ఇటువంటి కల్తీ కారణంగా దేశంలో సుమారు 10కోట్ల మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కారణంగానే ఏటా సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార కల్తీకి ఎక్కువగా అయిదేళ్లలోపు చిన్నారులే ప్రభావితం అవుతుండటం తీవ్ర ఆందోళనకరం. కలుషిత, కల్తీ ఆహారం వల్ల అతిసారం నుంచి క్యాన్సర్ల వరకు దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆహార పదార్థాల నాణ్యత తీసికట్టుగా ఉంటోందని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నివేదిక 2022-23 హెచ్చరించింది. ముఖ్యంగా ఆహార నమూనాల సేకరణ, పరీక్షలకు అవసరమైన మౌలిక వసతులు ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం బాగాలేవని అది పేర్కొంది. ఈ అంశానికి 17 మార్కులను గరిష్ఠ స్కోరుగా నిర్ణయిస్తే, ఏపీ కేవలం ఒక్క మార్కునే సాధించింది! 2022-23కు సంబంధించి మొత్తం ఆరు విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరచి కేరళ అత్యధికంగా 63 మార్కులను సాధించింది. ఆ తరవాతి స్థానాల్లో పంజాబ్‌ (57.5), తమిళనాడు (56.5) నిలిచాయి. ఏపీ, తెలంగాణలు మాత్రం వరసగా 24, 32 మార్కులకే పరిమితమయ్యాయి.

దేశంలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 2009-22 మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు అత్యధికంగా కర్ణాటక(1,524), ఒడిశా(1,327), తెలంగాణ(1,092), బిహార్‌(950), ఏపీ(794) రాష్ట్రాల్లో నమోదయ్యాయి. సరైన మౌలిక వసతులు, తనిఖీలు లేకపోవడంవల్లే మధ్యాహ్న భోజన పథకం అమలు లోపభూయిష్ఠంగా ఉంటోందని ‘కాగ్‌’ గతంలోనే హెచ్చరించింది. దేశంలో ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాల రిజిస్ట్రేషన్‌, అనుమతుల మంజూరు, తనిఖీలు, నమూనాల సేకరణ ప్రక్రియలు తూతూమంత్రంగానే సాగుతున్నాయి. ఆహార నాణ్యతకు సంబంధించి బాధితులు టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ, సంబంధిత యంత్రాంగం సరిగ్గా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆహార తనిఖీ సిబ్బంది అరకొరగా ఉండటంవల్ల తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయని చెబుతున్నారు. ఏపీలో ఆహార పరీక్ష కేంద్రం (ఫుడ్‌ లేబొరేటరీ) ఏర్పాటు పనులు ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆహార నమూనాలను హైదరాబాద్‌కు పంపాల్సి వస్తోంది.

కఠిన చర్యలతోనే...

దేశ ప్రజలకు సురక్షితమైన ఆహారం అందినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. ప్రజలపైనా, ప్రభుత్వాలపైనా వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది. కాబట్టి ఆహార నాణ్యతను తనిఖీ చేసే సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలి. ఆహార నాణ్యతను నిర్ధారించడానికి అవసరమైన పరీక్ష కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలి. ఆహార కల్తీకి సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించి, కల్తీరాయుళ్లకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించాలి. అప్పుడే దేశంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడుతుంది. ప్రజారోగ్యానికి భరోసా దక్కుతుంది.

కందుల శ్రీనివాసరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.