కచ్చతీవుపై ఎన్నికల రచ్చ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. భాజపా తాజాగా లేవనెత్తిన కచ్చతీవు అంశం వాటికి ఆజ్యం పోసింది. ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సహ చట్టం కింద సేకరించిన సమాచారం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Updated : 04 Apr 2024 04:52 IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. భాజపా తాజాగా లేవనెత్తిన కచ్చతీవు అంశం వాటికి ఆజ్యం పోసింది. ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సహ చట్టం కింద సేకరించిన సమాచారం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

భారత్‌-శ్రీలంక నడుమ ఉన్న ‘కచ్చతీవు’ను 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కాంగ్రెస్‌, డీఎంకేలపై విమర్శలు గుప్పించారు. కచ్చతీవు విషయంలో కాంగ్రెస్‌ ప్రదర్శించిన వైఖరి దేశ జాలర్ల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన వ్యాఖ్యానించారు. కచ్చతీవును వదులుకోవడంవల్లే గడచిన ఇరవై ఏళ్లలో 6,180 మంది తమిళనాడు జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని, 1,175 చేపల పడవలను స్వాధీనం చేసుకుందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ విమర్శించారు. ఇరు దేశాలతో ముడివడినది కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అతి చిన్న భూభాగమైన కచ్చతీవుకు తాను ప్రాధాన్యం ఇవ్వనని, దానిపై హక్కులు వదులుకోవడంలో తనకు ఎటువంటి సంకోచం లేదంటూ 1961లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పార్లమెంటులో వ్యాఖ్యానించినట్లు అన్నామలై ఆరోపించారు. ఇందిరాగాంధీ సైతం కచ్చతీవును చిన్న బండగా పేర్కొన్నారంటూ విమర్శించారు. ఆ దీవిని శ్రీలంకకు అప్పగించే విషయాన్ని నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి కేంద్రం ముందుగానే సమాచారమిచ్చిందని అన్నామలై పేర్కొన్నారు. డీఎంకే మాత్రం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించే విషయాన్ని నాటి ప్రభుత్వం తమ దృష్టికి తీసుకురాలేదని చెబుతోంది.

ఏదేమైనా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యవహారం ‘ఇండియా’ కూటమికి తలనొప్పిగా మారింది. దాంతో కూటమి నేతలు ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2015లో మోదీ సర్కారు బంగ్లాదేశ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఉటంకించారు. ఇరుదేశాల మైత్రి కోసం మోదీ చేసినట్టే కచ్చతీవు విషయంలో నాటి కాంగ్రెస్‌ సర్కారు వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. కచ్చతీవును అప్పగించడం ద్వారా ఆరు లక్షల మంది శ్రీలంక తమిళులకు స్వేచ్ఛ, కొత్త జీవితాన్ని ఇందిరాగాంధీ ప్రసాదించారని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినా, ఆ దేశం ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదంటూ మోదీ సమర్థించారని చిదంబరం ఎదురుదాడి చేశారు. తమిళనాడు జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన ప్రతిసారీ... వారిని విడిపించాలని సీఎం స్టాలిన్‌ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. తమిళ జాలర్ల అరెస్టులను మోదీ అడ్డుకోవడంలేదని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. వాటిని గట్టిగా తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్‌, డీఎంకేలను ఒకేసారి ఇరకాటంలో పెట్టడం కోసమే భాజపా నేతలు కచ్చతీవు అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడులోని రామేశ్వరానికి 10 నాటికల్‌ మైళ్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 10.5 నాటికల్‌ మైళ్ల దూరాన సముద్ర జలాల్లో కచ్చతీవు ఉంది. దీని పొడవు సుమారు 1.7 కిలోమీటర్లు. వెడల్పు 300 మీటర్లు. ఇక్కడ ఎవరూ నివాసం ఉండరు. కానీ, ఈ దీవి చుట్టుపక్కల జలాల్లో మత్స్యసంపద ఎక్కువ. తమిళనాడు జాలర్లు చేపలు పట్టి, వలలు ఆరబెట్టడానికి, విశాంత్రి తీసుకోవడానికి కచ్చతీవును ఉపయోగించేవారు. ఇక్కడ 20వ శతాబ్దంలో నిర్మించిన సెయింట్‌ ఆంథొనీ చర్చి ఉంది. ఏటా మార్చిలో జరిగే వేడుకలకు శ్రీలంక, తమిళనాడుల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యేవారు. డచ్‌, పోర్చుగీసు హయాం నుంచి కచ్చతీవు తమ ఆధీనంలో ఉందంటూ శ్రీలంక వాదించడంతో ఇరుదేశాల మధ్య వివాదం రేగింది. ఈ భూభాగం భారతదేశంలో అంతర్భాగమని చెప్పడానికి ఎన్నో ప్రాచీన ఆధారాలు ఉన్నాయి.

కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినా, ఎప్పటిలాగే దాన్ని తమిళనాడు జాలర్లు వాడుకోవచ్చని, ఆంథొనీ చర్చి వేడుకలను నిర్వహించుకోవచ్చని 1974 నాటి ఒప్పందంలో పేర్కొన్నారు. సముద్రంలో సరిహద్దులు విభజించి తమ సరిహద్దు ప్రాంతంలో తమిళనాడు జాలర్లు చేపలు పట్టడాన్ని నిషేధిస్తూ 1976లో శ్రీలంక మరో ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి తమిళనాడు జాలర్లకు సమస్యలు మొదలయ్యాయి. శ్రీలంక తమిళులు ప్రత్యేక ఈలం డిమాండుతో చేసిన ఎల్‌టీటీఈ పోరాటం అంతర్యుద్ధంగా పరిణమించడం తమిళనాడు జాలర్లకు శాపంగా మారింది. ఎల్‌టీటీఈకి మారణాయుధాల సరఫరాను అడ్డుకోవడంలో భాగంగా శ్రీలంక 1983లో ఆంథొనీ చర్చి వేడుకలను రద్దు చేసింది. సముద్రంలో సరిహద్దు దాటిన తమిళనాడు జాలర్లపై కాల్పులు జరపగా, పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కచ్చతీవును భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లు ఊపందుకొన్నాయి.

కటికల సతీష్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.