ఉల్లి రైతుల కష్టాల సాగు

వంటింట్లోనే కాదు, భారత వ్యవసాయరంగంలోనూ ఉల్లి పంట ఎంతో కీలకమైంది. ఉల్లిగడ్డల ధరల్లో హెచ్చుతగ్గులు రాజకీయ ప్రకంపనలకు సైతం కారణమవుతాయి. అందువల్ల వాటి ధరల స్థిరీకరణపై కేంద్రం దృష్టి సారించింది.

Published : 13 Apr 2024 01:09 IST

వంటింట్లోనే కాదు, భారత వ్యవసాయరంగంలోనూ ఉల్లి పంట ఎంతో కీలకమైంది. ఉల్లిగడ్డల ధరల్లో హెచ్చుతగ్గులు రాజకీయ ప్రకంపనలకు సైతం కారణమవుతాయి. అందువల్ల వాటి ధరల స్థిరీకరణపై కేంద్రం దృష్టి సారించింది.

దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఉల్లి నిల్వలను(బఫర్‌ స్టాక్‌) పెంచేందుకు తాజాగా రైతుల నుంచి అయిదు లక్షల టన్నులను సేకరించే ప్రక్రియ మొదలయ్యింది. ప్రస్తుతం రబీపంట మార్కెట్లోకి వస్తోంది. ఉల్లి ఉత్పత్తిలో రబీ పంట చాలా కీలకం. ఖరీఫ్‌ పంటతో పోలిస్తే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బఫర్‌ స్టాక్‌ కోసం 2023-24లో రబీ, ఖరీఫ్‌ సీజన్లు కలిపి 6.4 లక్షల టన్నుల ఉల్లిని కేంద్రం సేకరించింది. నిరుడు దిగుబడులు తక్కువగా ఉండటంతో ధరలు పైకి ఎగబాకాయి. అదే సమయంలో ప్రభుత్వ సంస్థలు కిలో రూ.25 చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయించాయి. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో రైతుల నుంచి సేకరించాలని కేంద్రం నిర్ణయించింది.
దేశీయ అవసరాలు, తగ్గిన దిగుబడుల కారణంగా ఉల్లి ఎగుమతులపై ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది. నిరుడు ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40శాతం సుంకం విధించింది. ఆ తరవాత అక్టోబరు 29 నుంచి టన్నుకు కనిష్ఠ ఎగుమతి ధర 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబరు ఎనిమిది నుంచి ఎగుమతులను నిషేధించింది. మద్దతు ధరతో ఉల్లి సేకరణ రైతులకు ప్రయోజనకరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2023-24(జూన్‌-జులై)లో ఉల్లి ఉత్పత్తి 254.73 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. అంతకు ముందు సంవత్సరం ఉల్లి ఉత్పత్తి 302.08 లక్షల టన్నులు. ఉల్లి ఎగుమతులను నిషేధించినా- ఇండియాపై ఆధారపడిన దేశాలకు సరఫరా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భూటాన్‌, బహ్రెయిన్‌, మారిషస్‌, బంగ్లాదేశ్‌, యూఏఈలకు ఎగుమతి చేయడానికి అనుమతించింది.

ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తి పరంగా చైనా తరవాతి స్థానం భారత్‌దే. దేశీయంగా పండే ఉల్లిలో 40శాతం మహారాష్ట్ర నుంచే వస్తుంది. 2022-23లో భారత్‌ నుంచి రూ.4522 కోట్ల విలువైన ఉల్లి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి ప్రధాన ఉల్లి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఈసారి రబీసాగు విస్తీర్ణం తగ్గింది. దేశవ్యాప్తంగా దాదాపు 10శాతం విస్తీర్ణం తరుగుపడినట్లు అంచనా. ఆ మేరకు దిగుబడుల్లో కోతపడనుంది. రబీ సీజన్‌లో ఉల్లి విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించినా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ఖరీఫ్‌లోనూ వర్షపాతం సరిగ్గా లేదు. ఇటీవల అంతర్జాతీయంగానూ ఉల్లి ధరలు పెరిగాయి. భారత్‌, పాకిస్థాన్‌, ఈజిప్టు దేశాలు ఎగుమతులను నిషేధించడమే దీనికి కారణం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా భారత్‌ ఇటీవల యూఏఈ వంటి దేశాలకు తక్కువ ధరకే ఉల్లిని విక్రయించినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.  
నిలకడలేని ఉల్లి ధరలు అన్నదాతలకు శాపంగా మారాయి. దిగుబడులు బాగా ఉన్నప్పుడు అమాంతం ధరలు తగ్గడం, సరఫరా తగ్గిన సమయంలో ధరలు పెరగడం సర్వ సాధారణమైంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల తమ ఆదాయానికి గండిపడుతోందని రైతులు వాపోతున్నారు. ఒక వైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు సన్నగిల్లుతున్నాయి. దాంతో ఉల్లి సాగు గిట్టుబాటు కాక కొందరు రైతులు ఇతర పంటలవైపు మళ్ళుతున్నారు. ధర పెరిగిన సందర్భాల్లో మినహా మిగతా సమయంలో రైతుల నుంచి పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదు. పూర్తి పంటను ప్రభుత్వాలు కొంటే రైతులకు ప్రయోజనం ఉంటుంది. పంట చేతికొచ్చాక నిల్వ సౌకర్యాల కొరత సైతం అన్నదాతలను వెంటాడుతోంది. దానివల్ల పంటను వెంటనే విపణిలో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉల్లి నాణ్యత వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అధిక మంచు, ఉష్ణోగ్రతలు, వర్షాలు నాణ్యతను దెబ్బతీస్తాయి. అలాంటి సమయాల్లో రైతులకు సరైన ధర దక్కదు. మనదేశంలో ఉల్లిధరలు రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తాయి. ధరలు తగ్గినా, పెరిగినా విపక్షాలకు అస్త్రంగా మారుతుంది.  దేశంలో కోట్లమంది రైతులు ఉల్లిని సాగు చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు ధరల స్థిరీకరణకు మాత్రమే కాకుండా అన్నదాతల ప్రయోజనాలనూ కాపాడేలా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

 డి.ఎస్‌.బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు