‘హద్దు’ మీరుతున్న చైనా కవ్వింపులు

చైనా తన సరిహద్దు ఆవల భారత భూభాగంలో ఉన్న పలు ప్రాంతాలపై కన్నేసింది. అవి ఒకప్పుడు తమ ఏలుబడిలోనే ఉండేవని, తమకే చెందుతాయంటూ వితండ వాదనకు దిగుతోంది. అక్కడితో ఆగకుండా వాటికి మాండరిన్‌ భాషలో పేర్లు పెడుతోంది.

Published : 17 Apr 2024 01:24 IST

చైనా తన సరిహద్దు ఆవల భారత భూభాగంలో ఉన్న పలు ప్రాంతాలపై కన్నేసింది. అవి ఒకప్పుడు తమ ఏలుబడిలోనే ఉండేవని, తమకే చెందుతాయంటూ వితండ వాదనకు దిగుతోంది. అక్కడితో ఆగకుండా వాటికి మాండరిన్‌ భాషలో పేర్లు పెడుతోంది.

ప్పుడో ఇక్ష్వాకుల కాలంలో తన ఏలుబడిలో ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పటికీ తనవేనని మొండిపట్టు పట్టడం చైనాకు అలవాటైపోయింది. టిబెట్‌ ప్రాచీన చైనా చక్రవర్తుల పాలనలో ఉండేదంటూ 1950లో దాన్ని ఆక్రమించి ‘షిజాంగ్‌’ అని పేరుపెట్టింది. ఆ తరవాత 1962లో భారత్‌లోని అక్సాయ్‌ చిన్‌ (లద్దాఖ్‌)ను, అరుణాచల్‌ప్రదేశ్‌లో దాదాపు సగ భాగాన్ని కబ్జా చేసింది. ఆపై అక్సాయ్‌ చిన్‌ను గుప్పిట పెట్టుకుని అరుణాచల్‌ను ఉపసంహరించుకుంది. అయితే ఇటీవల అరుణాచల్‌ టిబెట్‌లో దక్షిణ భాగమంటూ దానికి ‘జాంగ్నాన్‌’ అని నామకరణం చేసింది.

జగడాలమారి చైనా గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌ను తన దేశ అంతర్భాగంగా చూపే మ్యాపులను వెలువరించింది. ఇటీవలి కాలంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు మాండరిన్‌ భాషలో పేర్లు పెడుతూ వికృత ఆనందం పొందుతోంది. మార్చి 30న అరుణాచల్‌లోని 30 ప్రాంతాలకు మాండరిన్‌ పేర్లు పెట్టి, అవి మే ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఇటువంటి నామకరణ సంబరాలకు చైనా పాల్పడటం ఇది నాలుగోసారి. 2017లో అరుణాచల్‌లోని ఆరు ప్రాంతాలకు, 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు మాండరిన్‌ పేర్లు పెట్టింది. ‘పొరుగింటికి నాకిష్టమైన పేరు పెట్టి, అది నాదేననడం కుదురుతుందా?’ అని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రశ్నించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ ఇప్పటికీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని విస్పష్టంగా ప్రకటించారు. భారత సరిహద్దులోనే కాదు, దక్షిణ చైనా సముద్రంలోని దీవులన్నీ తనవేనని బీజింగ్‌ బుకాయిస్తూ ఫిలిప్పీన్స్‌, తైవాన్‌ తదితర తీరస్థ దేశాలతో లడాయికి దిగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ దుందుడుకు చర్యలను ఎదుర్కొనే హక్కు ఫిలిప్పీన్స్‌కు ఉందని ఇటీవల జైశంకర్‌ వ్యాఖ్యానించారు. చైనా ధోరణిపై అమెరికా సైతం నిరసన వ్యక్తం చేసింది. పేరు మార్పులు, సరిహద్దు అతిక్రమణలతో ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించే బీజింగ్‌ యత్నాలను ఖండిస్తున్నట్లు ప్రకటించింది.

టిబెట్‌ను ఆక్రమించిన తరవాత అక్కడ చైనా ఆగడాలను చూసిన అరుణాచల్‌ ప్రజల్లో బీజింగ్‌ పట్ల ప్రతికూల భావనలే వ్యక్తమవుతున్నాయి. తాము భారతీయులమని అరుణాచల్‌కు చెందిన కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు పదేపదే ఉద్ఘాటిస్తున్నారు. అయినప్పటికీ చైనా బుద్ధి మార్చుకోవడంలేదు. అరుణాచల్‌ను భారత ప్రధానమంత్రులు సందర్శించినప్పుడల్లా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2009లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, తరవాత నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా చైనాది ఇదే వరస. ఇటీవల అరుణాచల్‌లోని సెలాలో కొత్తగా నిర్మించిన సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన కొద్ది రోజులకే చైనా నామకరణ తంతు చేపట్టింది. అస్సామ్‌లోని గువాహటి, అరుణాచల్‌లోని తవాంగ్‌లను కలిపే ఈ సొరంగం ద్వారా భారత సైన్యం, పౌరులు అన్ని రుతువుల్లోనూ సులభంగా రాకపోకలు సాగించడం వీలవుతుంది. ఇది చైనాకు కడుపు మంట కలిగించింది. భారత్‌ చర్య సరిహద్దు వివాదాన్ని మరింత జటిలం చేస్తుందని దౌత్యస్థాయిలో నిరసన తెలిపింది. అక్కడితో ఆగకుండా అరుణాచల్‌లోని ప్రాంతాలకు మాండరిన్‌ పేర్లు పెట్టి కవ్వింపునకు పాల్పడింది. వాటిలో గ్రామాలతో పాటు పలు పర్వతాలు, నదులు, అతిపెద్ద సరస్సు వంటివి ఉన్నాయి. భారత భూభాగంలోని గ్రామాలకు చైనా తన చిత్తం వచ్చిన పేర్లు పెట్టడమే కాకుండా, సరిహద్దును ఆనుకొని కొత్త గ్రామాలను నిర్మించింది.

చైనా 1960 దశకం నుంచీ లద్దాఖ్‌ మొదలుకొని అరుణాచల్‌ వరకు 2,100 మైళ్ల సరిహద్దులో పేచీలకు దిగుతూనే ఉంది. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణలు తలెత్తినప్పటి నుంచి ఉభయ దేశాలకు చెందిన వేల మంది సైనికులు అక్కడ మోహరించి ఉన్నారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటివరకు 21 సార్లు సైన్య, దౌత్య స్థాయుల్లో రెండు దేశాల మధ్య సంప్రతింపులు జరిగాయి. కానీ, శాంతియుత పరిష్కారం మాత్రం లభించలేదు. చర్చల ముసుగులో కాలయాపన చేస్తూ తన పన్నాగాలను యథాప్రకారం కొనసాగించడం చైనాకు అలవాటు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డ్రాగన్‌ పనిగట్టుకుని అరుణాచల్‌ అంశంపై అలజడి సృష్టిస్తోంది!

 ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.