సేద్య రంగంలో ఈవీ విప్లవం

ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) హవా నడుస్తోంది. ఈవీల విప్లవం వ్యవసాయ రంగాన్ని సైతం ప్రభావితం చేస్తోంది. అనేక దేశాల్లో వీటిని సాగు పనులకు విరివిగా ఉపయోగిస్తున్నారు.

Published : 17 Apr 2024 01:24 IST

ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) హవా నడుస్తోంది. ఈవీల విప్లవం వ్యవసాయ రంగాన్ని సైతం ప్రభావితం చేస్తోంది. అనేక దేశాల్లో వీటిని సాగు పనులకు విరివిగా ఉపయోగిస్తున్నారు. భారత్‌ సైతం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఎలెక్ట్రిక్‌ ట్రాక్టర్లు సహా అనేక సాగు పరికరాల తయారీపై కంపెనీలు దృష్టి సారించాయి.

దేశంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ పరిణామం రవాణా రంగం స్వరూపాన్నే మార్చివేస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలోనూ ఈవీలు ప్రవేశించాయి. సాగు పనులకు వీటిని వాడటం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. వ్యవసాయ ఆధునికీకరణకు, పర్యావరణహితకరమైన సాగుకు తోడ్పడతాయి. ఏటికేడు సాగులో యాంత్రీకరణ పెరుగుతున్న క్రమంలో శిలాజ ఇంధనాలతో నడిచే సంప్రదాయ వాహనాలు, పరికరాల స్థానంలో బ్యాటరీ ఆధారంగా పనిచేసే వాహనాలను ఉపయోగించడంపై పలు దేశాలు దృష్టి పెట్టాయి. జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు పెద్దయెత్తున విద్యుత్‌ వాహనాలను, పరికరాలను వాడుతున్నారు. మనదేశంలోనూ వీటి వాడకం క్రమేణా ఊపందుకుంటోంది. ఎలెక్ట్రిక్‌ ట్రాక్టర్లు, డ్రోన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఎలెక్ట్రిక్‌ హార్వెస్టర్లు, కలుపుతీసే యంత్రాలు, పొలాల్లో పనిచేసే రోబోల తయారీపై పలు కంపెనీలు దృష్టిసారించాయి.

వ్యయాల తగ్గింపు

ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను పెంపొందించడానికి గ్రీన్‌ ఎనర్జీని సమర్థంగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వ్యవసాయం చాలా పురోగతి సాధించింది. యంత్రాల రాకతో పంటవేయడం నుంచి నూర్పిడి వరకు పనులన్నీ సులువయ్యాయి. అదే సమయంలో పెట్టుబడి పెరిగిపోయింది. దీంతో పంట పండించినా గిట్టుబాటు అవుతుందన్న నమ్మకం ఉండటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించడమే కీలకం. ఇందుకు విద్యుత్‌ వాహనాలు తోడ్పడతాయి. ట్రాక్టర్‌తో దుక్కిదున్నడం, విత్తనాలు నాటడం, పురుగు మందుల పిచికారీ, రసాయన మందులు చల్లడం, నూర్పిడి వంటి అనేక రకాల పనులు చేపట్టవచ్చు. విద్యుత్‌ ట్రాక్టర్‌తో ఈ పనులను చాలా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. డీజిల్‌, పెట్రోల్‌ వంటి వాటితో నడిచే వాహనాల కంటే విద్యుత్‌ వాహనాలతో ఖర్చుతోపాటు శబ్దకాలుష్యమూ తక్కువే. తక్కువ వ్యయంతోనే పంట ఉత్పత్తులను పొలాల నుంచి గోదాములకు, మార్కెట్లకు తరలించవచ్చు. వ్యవసాయ రంగంలో ఇంధన డిమాండ్‌ ఏటా పెరుగుతోంది. దీనికి పరిష్కారంగా విద్యుత్‌ వాహనాలను, పునరుత్పాదక ఇంధన వనరులను విరివిగా వినియోగించాలి. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్‌ వ్యవసాయంవైపు అడుగులు వేస్తున్నాయి. విద్యుత్‌ వాహనాలు ఈ లక్ష్యాన్ని సులభతరంగా మారుస్తున్నాయి. వ్యవసాయ ఉత్పాదకతపై వాతావరణ పరిస్థితులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దిగుబడులు నానాటికీ తగ్గిపోతున్నాయి. దీనికి పరిష్కారంగా పర్యావరణ సాగు అనుకూల విధానాలను, ప్రాసెసింగ్‌ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు విద్యుత్‌ ట్రాక్టర్లు మంచి ప్రత్యామ్నాయాలు. డీజిల్‌తో నడిచే యంత్రాలు ముఖ్యంగా ట్రాక్టర్ల వినియోగానికి అయ్యే ఖర్చు సాగు వ్యయంలో 12 శాతం నుంచి 18 శాతం దాకా ఉంటుందని అంచనా. ఇది పంట రకం, భౌగోళిక ప్రాంతాన్ని బట్టి మారుతుంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) అధ్యయనం ప్రకారం డీజిల్‌ ట్రాక్టర్లతో పోలిస్తే ఎలెక్ట్రిక్‌ ట్రాక్టర్లతో నిర్వహణ ఖర్చులు 40 శాతం వరకు ఆదా అవుతాయి. మరోవైపు, విద్యుత్‌ వాహనాలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించి రవాణా ఖర్చులను 70 శాతం దాకా తగ్గించవచ్చని అంచనా.

రాయితీలతో పరిష్కారం

విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు ప్రారంభ వ్యయం అధికంగా ఉండటం, మౌలిక వసతుల అభివృద్ధి, వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి సవాళ్లను ప్రభుత్వాలు పరిష్కరించాల్సి ఉంది. మన దేశం గత అయిదేళ్ల నుంచే బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్లపై దృష్టి పెట్టింది. పంజాబ్‌ తన ఈవీ విధానం ద్వారా విద్యుత్‌ ట్రాక్టర్లకు సబ్సిడీలను అందిస్తోంది. ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ ట్రాక్టర్ల కంటే ఎలెక్ట్రిక్‌ ట్రాక్టర్లు ఖరీదైనవి. వీటి కొనుగోలు చిన్న సన్నకారు రైతులకు భారమవుతుంది. ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జింగ్‌ సదుపాయాలు లేవు. వీటిని ఇతోధికంగా ఏర్పాటు చేయాలి. 2047 నాటికి దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సహకారం ఉండాలంటే ఎలెక్ట్రిక్‌ ట్రాక్టర్లకు ఛార్జింగ్‌, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం చాలా కీలకం. విద్యుత్‌ ట్రాక్టర్ల సాంకేతికతపై పరిశోధనకు అధిక నిధులను కేటాయించడం ద్వారా మరిన్ని ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి.

 డి.సతీష్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.