ప్రాచీన సంపదకు నిర్లక్ష్యపు చెదలు

సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిరుడు సెప్టెంబరులో ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ కమిటీ 45వ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంగా భారత్‌కు చెందిన రెండు వారసత్వ కట్టడాలకు గుర్తింపు దక్కింది.

Updated : 18 Apr 2024 05:24 IST

అద్భుత ప్రాచీన కట్టడాలకు గుర్తింపునిచ్చే క్రమంలో ఏటా ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలను వివిధ దేశాల్లో నిర్వహిస్తుంది. ఈసారి జులై 21 నుంచి పది రోజులపాటు దిల్లీ ఈ సమావేశాలకు వేదిక కానుంది. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా...

సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిరుడు సెప్టెంబరులో ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ కమిటీ 45వ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంగా భారత్‌కు చెందిన రెండు వారసత్వ కట్టడాలకు గుర్తింపు దక్కింది. పశ్చిమ్‌ బెంగాల్‌లోని శాంతినికేతన్‌తో పాటు కర్ణాటకలోని హలిబీడు, బేలూరులోని హొయసల ఆలయ సమూహానికి హోదా దక్కడంతో భారత్‌లో మొత్తం యునెస్కో గుర్తింపు పొందిన సహజ వింతలు, వారసత్వ కట్టడాల సంఖ్య 42కు చేరింది. సాధారణంగా ఈ కమిటీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే గుర్తింపు పొందిన కట్టడాల పరిరక్షణ, నిర్వహణ నిర్లక్ష్యానికి గురైతే వాటిని యునెస్కో జాబితా నుంచి తొలగించే నిర్ణయాలు సైతం ఉంటాయి. ఈ ఏడాది సమావేశం నిర్వహించే అవకాశం భారత్‌కు దక్కినందువల్ల యునెస్కో జాబితాలో మన కట్టడాల సంఖ్యను పెంచేందుకు కృషి జరగాలి.

శిథిలమైపోతున్నా...

దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రాచీన కట్టడాలు, సహజ వింతలకు కొదవే లేదు. కానీ వాటిని పరిరక్షించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వైశాల్యంలో మనకన్నా చిన్నదేశమైన ఇటలీలో 59 ప్రాంతాలకు వారసత్వ హోదా దక్కింది. చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ సైతం మనకన్నా ఎక్కువ కట్టడాలకు గుర్తింపు దక్కించుకున్నాయి. అందుకు అక్కడి ప్రభుత్వాల ప్రత్యేక చొరవే కారణం. మన దేశంలో ప్రాచీన కట్టడాల్లో కొన్నింటిని కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) పరిరక్షిస్తోంది. మరికొన్నింటిని రాష్ట్ర పురావస్తు విభాగాలు కాపాడుతున్నాయి. ఏఎస్‌ఐ పరిధిలోని నిర్మాణాల వద్ద పర్యవేక్షణ, పరిరక్షణ చర్యలు కొంతలోకొంత నయం. రాష్ట్రాల పరిధిలోని వేలాది కట్టడాలు శిథిలమైపోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. యునెస్కో గుర్తింపు దక్కాలంటే ముందుగా ఆ కట్టడానికి మరే ప్రాంతానికి లేని విశిష్టమైన ప్రత్యేకత ఉండాలి. కట్టడాలకు సంబంధించిన ప్రత్యేకతలను ముందుగానే సవివరమైన సాంకేతిక కొలతలు, పటాలతో తాత్కాలిక జాబితాలో పొందుపరచాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలి. తగిన నిధులు వెచ్చిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం రామప్ప ఆలయం మాత్రమే. శాండ్‌బాక్స్‌ పరిజ్ఞానంతోపాటు నీటిలో తేలియాడే ఇటుకలు ఇక్కడి ప్రత్యేకతలు. దేశంలో మరుగున పడిన అనేక ప్రాచీన కట్టడాలు, సహజ వింతలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ సరైన గుర్తింపు సాధించలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా కట్టడానికి వారసత్వ హోదా దక్కితే ఆ ప్రాంతానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ప్రపంచ వారసత్వ కమిటీ ఆయా కట్టడాలకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తుంది. తద్వారా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

తెలుగు రాష్ట్రాల్లో...

మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక నిర్మాణాలకు వారసత్వ భాగ్యం దక్కడం లేదు. యునెస్కో తాత్కాలిక జాబితాలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 57 కట్టడాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2022లో ఒక్క లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి మాత్రమే అవకాశం దక్కింది. చాలా సుదీర్ఘ ప్రక్రియ అనంతరం పూర్తిస్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని, కట్టడానికి సంబంధించి సమగ్ర నివేదికను తయారు చేయాలి. ఇప్పటివరకు ఏపీ సర్కారు ఆ ప్రక్రియనే మొదలుపెట్టలేదు. జాబితాలో రెండేళ్ల క్రితం చేరినప్పటి నుంచే ప్రత్యేక దృష్టిసారించి తగినన్ని నిధులు వెచ్చించి నివేదిక సమర్పిస్తే, యునెస్కో ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యేది. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తయితే ఈసారి దిల్లీలో జరిగే వారసత్వ కమిటీ సమావేశాల్లో లేపాక్షి ఆలయానికి కూడా గుర్తింపు దక్కే అవకాశం మెరుగయ్యేది. తెలంగాణ నుంచి తాత్కాలిక జాబితాలోకి నారాయణపేట జిల్లా కృష్ణా నదీతీరంలోని ముడుమాల్‌ నిలువు రాళ్లను చేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో ఆరు, మహారాష్ట్రలో అయిదు యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలు, వింతలు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు ఒక్కటే ఉండటం వారసత్వ కట్టడాల పరిరక్షణలో ఉదాసీనతకు నిదర్శనం. ఈ పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అధికార యంత్రాగాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

జి.పాండురంగశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.