వ్యర్థాల కట్టడితో స్వచ్ఛ శిఖరాలు!

ఆవరణ వ్యవస్థలో పర్వతాలది ప్రత్యేక స్థానం. అవి కలప, గడ్డి, తాగునీరు, పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. ఎన్నో సంస్కృతులలో ఆరాధనీయ స్థలాలకు నెలవులు. విభిన్న జీవవైవిధ్యం, భౌగోళిక ప్రత్యేకతలతో పర్యటకులను ఆకర్షిస్తున్న పర్వతాలు కాలుష్యం, వ్యర్థాల ముప్పును ఎదుర్కొంటున్నాయి.

Published : 18 Apr 2024 00:21 IST

ఆవరణ వ్యవస్థలో పర్వతాలది ప్రత్యేక స్థానం. అవి కలప, గడ్డి, తాగునీరు, పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. ఎన్నో సంస్కృతులలో ఆరాధనీయ స్థలాలకు నెలవులు. విభిన్న జీవవైవిధ్యం, భౌగోళిక ప్రత్యేకతలతో పర్యటకులను ఆకర్షిస్తున్న పర్వతాలు కాలుష్యం, వ్యర్థాల ముప్పును ఎదుర్కొంటున్నాయి.

అంతకంతకు పెరుగుతున్న పట్టణీకరణ, గనుల తవ్వకం, పశు పోషణ, విద్యుదుత్పత్తి, పర్యటకం తదితర మానవ కార్యకలాపాలు పర్వత ఆవరణ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. శీతోష్ణస్థితిలో మార్పులు, వ్యర్థాల వల్ల తలెత్తే కాలుష్య ప్రభావం పర్వత ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో కనిపిస్తున్నట్లు పర్వతారోహకులు చెబుతున్నారు. పర్వతాల వాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉండటం వంటి కారణాలతో పర్వత ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ చాలా సంక్లిష్టం. ఇటీవలి కాలంలో పర్యటకుల తాకిడి గణనీయంగా పెరిగిపోవడంతో పర్వత ప్రాంతాల్లో అనేక రకాల వ్యర్థాలు కుప్పలుగా పేరుకుంటున్నాయి. పర్వత ప్రాంతాల్లో ప్లాస్టిక్‌, కర్బన పదార్థాలు, కాగితాలు తదితర వ్యర్థాలను ముఖ్యంగా ప్రయాణ మార్గాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, పర్యటకుల విశ్రాంతి ప్రదేశాల వద్ద గుర్తించినట్లు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, గ్రిడ్‌-అరెండల్‌ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సంయుక్త సర్వేలో తేలింది. 74 దేశాలకు చెందిన 1,750 మంది పర్వతారోహణ ఔత్సాహికుల్లో 99.7శాతం వివిధ వ్యర్థాలను గుర్తించినట్లు వెల్లడించారు. పర్యటకులు ఘన వ్యర్థాలను ఉత్పన్నం చేస్తున్నారని, నీటి వృథాకు కారణమవుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఆయా వ్యర్థాలు భూగర్భ జలాలు, వాగులు, సరస్సులు, మృత్తికను కలుషితం చేస్తున్నట్లు గుర్తించారు. ఔషధాలు, బ్యాటరీలు, పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు తదితర ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన వ్యర్థాలు కూడా ఉన్నట్లు తేలింది. ఒక్కో పర్వతారోహకుడు సగటున ఎనిమిది కిలోల వ్యర్థాలను, గుడారాలు, ఆమ్లజని సిలిండర్లు, తాళ్లు, ఆహార పొట్లాలు, డబ్బాలు, మానవ వ్యర్థాలను పర్వత ప్రాంతాల్లో విడిచిపెడుతున్నట్లు అధ్యయనకర్తలు గుర్తించారు. ఇటువంటి వస్తువులన్నీ వ్యర్థాల రూపంలో కొండలకు భారంగా పరిణమిస్తున్నాయి.

ఎంతో ఉన్నతంగా, గంభీరంగా కనిపించే పర్వతాలు అతి సున్నితమైన ఆవరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. దుర్బలమైన పర్వత ప్రాంతాల్లో చిన్నపాటి మార్పులు సంభవించినా పెను సమస్యలకు దారితీస్తుంది. పర్వత శ్రేణులు హిమానీ నదాలు, మంచు, సరస్సులు, ప్రవాహాలను కలిగి జలశిఖరాలుగా పనిచేస్తాయి. కొండల్లో పోగుపడే వ్యర్థాలు అక్కడి వన్యప్రాణులకు సైతం తీవ్ర హాని కలిగిస్తాయి. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్‌ తదితర వ్యర్థాలు గాలులు, హిమానీ నదాలు, వర్షం కారణంగా కిందికి ప్రవహించి నదులు, సముద్రాలను చేరతాయి. జలవనరుల్నీ కాలుష్యంతో నింపేస్తాయి. నీటి కాలుష్యం పర్వత పాదాలు, మైదాన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. పర్యటకులు, ఔత్సాహికులు పర్వతారోహణం చేయడంవల్ల ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతోంది. అయితే, పర్వత పర్యటకాన్ని సరైన రీతిలో నిర్వహించడం ద్వారా పర్యావరణ సమతౌల్యం సాధించవచ్చని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ పర్యటక సంస్థ, మౌంటెయిన్‌ పార్టనర్‌షిప్‌ సంస్థల సంయుక్త అధ్యయన పత్రం సూచించింది.
పర్యటకులు పర్వతాల పైకి తీసుకెళ్ళే వస్తువులకు సంబంధించిన వ్యర్థాలను తిరిగి వెనక్కి తీసుకువచ్చే విధానాన్ని అవలంబించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పర్వతారోహణ సంఘాల సహాయంతో పర్వత వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అంశాలపై పర్వతారోహకులు, స్థానికులు, యాత్రికుల్లో అవగాహన పెంపొందించాలి. పర్వత ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమవుతున్న పర్యటక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వ్యర్థాల కట్టడికి కృషి చేసేలా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. వ్యర్థాల నిర్వహణకు అవి మెరుగైన పద్ధతులు అనుసరించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. స్థానిక పౌర సమాజాలు సైతం ఈ క్రతువులో పాలుపంచుకోవాలి. సున్నితమైన ఆవరణ వ్యవస్థలు కలిగి ఉండే పర్వత ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలి. ఇటువంటి సంరక్షణ చర్యల ద్వారా పర్వత ప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

ఎం.రామ్‌మోహన్‌
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.