నవరస వ్యూహాలు!

‘ఈ రోజు ప్రచార కార్యక్రమాలు ఏమిటి? ఎక్కడెక్కడ ఏమేం చేయాలి?’ ‘కొత్తగా చెప్పేదేముంది సార్‌, అవతలి పక్షాల నేతలను అడ్డగోలు బూతులు తిడుతూ, ఏసీ బస్సులో ఊరూరా తిరగడమే! మధ్యమధ్యలో కొసమెరుపుల్లా కొత్తకొత్త స్కిట్‌లు వదులుతుండాలి’ ‘మరి, అన్నింటికీ అంతా సిద్ధం చేశారా?’ ‘అంతా సిద్ధం, అవతలి పార్టీ వాళ్లను తిట్టాల్సిన తిట్లు, మధ్యలో మసాలా కోసం కలపాల్సిన బూతులూ... అన్నీ రాసిపెట్టాం.’

Published : 22 Apr 2024 01:05 IST

‘ఈ రోజు ప్రచార కార్యక్రమాలు ఏమిటి? ఎక్కడెక్కడ ఏమేం చేయాలి?’

‘కొత్తగా చెప్పేదేముంది సార్‌, అవతలి పక్షాల నేతలను అడ్డగోలు బూతులు తిడుతూ, ఏసీ బస్సులో ఊరూరా తిరగడమే! మధ్యమధ్యలో కొసమెరుపుల్లా కొత్తకొత్త స్కిట్‌లు వదులుతుండాలి’
‘మరి, అన్నింటికీ అంతా సిద్ధం చేశారా?’
‘అంతా సిద్ధం, అవతలి పార్టీ వాళ్లను తిట్టాల్సిన తిట్లు, మధ్యలో మసాలా కోసం కలపాల్సిన బూతులూ... అన్నీ రాసిపెట్టాం.’
‘ఇవన్నీ రాసుకొని నేర్చుకోవాలా, మనకన్నీ దంచిన పచ్చడే కదా!’
‘అందరూ వాడే అన్నిరకాల తిట్లు, బూతులు పేలడం లేదు. మనకంటూ ప్రత్యేకత ఉండాలని, కొత్త ఏర్పాట్లు చేశాం సార్‌.’
‘అయిడియా అదిరిందయ్యా, రోజూ పాత తిట్లతో నోరు బోరు కొడుతుందనుకో! కొత్త ఘాటు చేరితేనే ప్రచారంలో తిట్ల మసాలా నషాళానికి ఎక్కుతుంది.’
‘అందుకనే, ప్రత్యేక నిపుణులతో నవరస వ్యూహాలను, నైపుణ్యాలను సిద్ధం చేశాం. మధ్యలో దెబ్బలు తగిలితే బ్యాండేజీలూ పోగేశాం.’
‘దెబ్బలు ఎందుకు తగులుతాయి?’

‘మరీ, ఏమీ తెలియనట్లుగా అమాయకంగా అడక్కండి సార్‌! దెబ్బలు ఎలాగైనా తగలవచ్చు, తగిలీతగలకుండానూ తగలవచ్చు. జనం ఎగబడితే దుమ్ము గాలిలోకి లేచి అందులో ఇసుక రేణువులు మొహానికి కొట్టుకుని ముఖం పగలవచ్చు, ప్రజల కరచాలనాలతో ఎముకలు విరగవచ్చు. పూలబొకేలు తగిలి చేతులు తెగవచ్చు. పూల రేకలు నెత్తినపడి తలే పగలవచ్చు... చీకట్లో ఏమైనా జరగవచ్చు!’
‘ఇదంతా జరగాలంటే జనం దండిగా రావాలి కదా, వస్తారంటావా?’
‘మనకోసం ఎవరూ రారు సార్‌... తీసుకురావాలి. బస్సులు, లారీలు పెట్టాం. బీర్లు బిర్యానీలు మామూలే!’
‘అన్నింటికీ బాగానే ఖర్చయి ఉండాలే...’
‘బాగానే ఏమిటి, భారీగానే వాచిపోతోంది’
‘మరీ అంత ఖర్చేమిటయ్యా?’

‘తెగ బాధ పడిపోకండి, చెమటోడ్చిందేమీ కాదుకదా, అంతా జనం సొమ్మే కదా!’
‘ఎంత ఆశచూపినా ప్రజలు రావడం లేదు కదా, జనం లేకుండా వ్యూహాలు రక్తికట్టవేమో!’
‘అందుకే కదా, ఎక్కడెక్కడి ట్రాఫిక్‌నంతా మన ప్రచార మార్గంలోకే దారి మళ్లిస్తున్నాం. అవసరం లేకున్నా ట్రాఫిక్‌ను ఆపేసి లేనిరద్దీ సృష్టిస్తున్నాం. వాళ్లంతా మిమ్మల్ని తిట్టుకుంటూ వెళ్తున్నా, మీకేమీ పట్టనట్లుగా అందరికేసి చేతులు ఊపుతూ, ముద్దులు విసిరితే సరి!’

‘డబ్బులిస్తాం వచ్చి జేజేలు కొట్టమంటే నొప్పేమిటి? పైగా, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవంటూ గోలెందుకు?’
‘డబ్బులిస్తే వచ్చేవాళ్లు కూలీలు... ప్రచారానికి రావడమంటే మనపై అభిమానం ఉండాలి. ప్రచారాల కోసం మనమిచ్చే డబ్బులు ఎవ్వరినీ ఉద్ధరించేవి కావు. ఏ పూటకాపూట తాగి, తిని, ఖర్చు పెట్టేసి, మరుసటి రోజు ఖాళీ కడుపుతో రోడ్డున పడేందుకే పనికొస్తాయి. పని చేసుకొనే వాళ్లనూ చెడగొట్టి బేవార్సుగా మారుస్తున్నామంతే!’
‘రోజూ మూడు పూటలా తిండి పెడుతున్నాం, మందు పోస్తున్నాం... వాహనాల్లో తిప్పుతున్నాం... అంతమందిని ఉచితంగా సాకుతున్నాం... అంటే అందరికీ చేతి నిండా కష్టం లేని పని కల్పిస్తున్నామన్నట్లే కదా!’

‘ప్రచారం పేరిట జనాన్ని మనచుట్టూ తిప్పుకొంటుంటే, పనిచేసేవారు దొరక్క పనులు పాడవుతున్నాయి. పల్లెల్లో, పట్నాల్లో కూలీలు దొరక్క తంటాలు పడుతున్నారు.’
‘ఎన్నికల వేళ బ్రహ్మాండంగా భోజనాలు పెడుతున్నాం. మిగతా రోజుల్లోనూ ఏదో ఒక కార్యక్రమం పేరిట ఊరూరా భోజనాలు పెడుతుంటాం. నేతల పుట్టిన రోజులంటూ అన్నదానాలు చేస్తుంటాం. ఈ లెక్కన ఏవో కొద్ది రోజులు తప్ప మంచి రుచికరమైన భోజనం ఉచితంగా దొరుకుతున్నట్లే కదా, ఇంకెందుకు ఆకలి గోల?’
‘పుట్టినప్పటి నుంచీ మనమే జనాన్ని ఉద్ధరించేసినట్లు భ్రమల్లో బతక్కండి. మనం పడేసే నాలుగు ముద్దలతోనే బతికేస్తున్నారనుకోవద్దు. అస్సలు...మనమే ఆ జనం మీద పడి, అంతకన్నా ఎక్కువే మింగుతున్నామన్న సంగతి మరవద్దు.’

*     *      *

‘ఇంతకుముందు ప్రచారం చేసినప్పుడు ఇక్కడేదో హోటల్‌ ఉండాలి, మనం దోశలు కూడా వేసినట్లు గుర్తే...’
‘అప్పుడు మీరు వేసిన మాడిపోయిన దోశలు తిన్నాక, జనం రావడం మానేయడంతో ఓనర్‌ దివాలా తీసి, హోటలే ఎత్తేశాడట!’
‘ఒక్కసారి దోశలు వేస్తేనే ఇన్ని అనర్థాలు జరిగాయా! ఇంతకీ ఇప్పుడు మనం ఏమేం చేయాలి?
‘చాలా చేయాలి. కరెంటు పోతే చీకట్లోనే నవరస నైపుణ్యాల్ని ప్రదర్శించాలి. కరెంటు వచ్చేసరికి సరికొత్త అవతారంతో అవతరించాలి. సానుభూతి వరదలై పారించాలి. అందులో జనం మునిగి మునకలెయ్యాలి. తరవాత అక్కడ కూర్చున్న ముసలాళ్లకు స్నానం చేయించాలి. అవతల తలమాసి కూర్చున్నవాళ్లకి గడ్డం చేయాలి. అవ్వలకు ముద్దులు పెట్టాలి. చిన్నారులకు ముద్దలు తినిపించాలి.’
‘ఇలాంటి పనులేవీ నా ఇంట్లో కూడా చేయను కదయ్యా...’
‘ఏదో అలా ఓట్లేసేదాకా నటించండి సార్‌!’
‘లేకపోతే...’
‘జనం అవతలి బటన్‌ నొక్కేస్తారు... మన కుర్చీ గల్లంతై, చిరునామా చిరిగి, వద్దనుకున్న చోటెక్కడో తేలాల్సి వస్తుంది!’

శ్రీశైలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.