తాలిబన్లను దువ్వుతున్న మాస్కో

రష్యా రాజధాని మాస్కోలో గత నెలలో ఒక సంగీత కార్యక్రమంపై ఇస్లామిక్‌ స్టేట్‌- ఖొరసాన్‌ (ఐసిస్‌-కె) ఉగ్రవాదుల దాడి ప్రకంపనలు సృష్టించింది. దాని వెనక అమెరికా, పాశ్చాత్య గూఢచర్య సంస్థల హస్తం ఉందనేది రష్యా అనుమానం. ఈ నేపథ్యంలో ఐసిస్‌-కె బద్ధశత్రువైన తాలిబన్లను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రష్యా ప్రకటించడం ఆసక్తికరం.

Published : 22 Apr 2024 01:04 IST

రష్యా రాజధాని మాస్కోలో గత నెలలో ఒక సంగీత కార్యక్రమంపై ఇస్లామిక్‌ స్టేట్‌- ఖొరసాన్‌ (ఐసిస్‌-కె) ఉగ్రవాదుల దాడి ప్రకంపనలు సృష్టించింది. దాని వెనక అమెరికా, పాశ్చాత్య గూఢచర్య సంస్థల హస్తం ఉందనేది రష్యా అనుమానం. ఈ నేపథ్యంలో ఐసిస్‌-కె బద్ధశత్రువైన తాలిబన్లను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రష్యా ప్రకటించడం ఆసక్తికరం.

మానవ హక్కుల ఉల్లంఘనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబన్‌ పట్ల రష్యా వైఖరి మార్చుకోవడం సమంజసమేనా అని పాశ్చాత్య దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినాసరే రష్యా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మాస్కో దాడి క్రమంలో రష్యా అరెస్టు చేసిన నలుగురు ఐసిస్‌-కె ఉగ్రవాదులు తజికిస్థాన్‌కు చెందినవారు. అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్‌-ఖొరసాన్‌ విభాగం తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ వంటి మధ్యాసియా దేశాలవాసులనూ చేర్చుకుంది. ఇరాన్‌, అఫ్గాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, తజిక్‌, ఉజ్బెకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను కలిపి మధ్యయుగాల్లో ఖొరసాన్‌గా వ్యవహరించేవారు. ఇరాక్‌, సిరియా యుద్ధాల్లో ఉద్భవించిన ఐసిస్‌-కె నేడు పలు దేశాల్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అఫ్గాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వెంబడి క్రియాశీలంగా పనిచేస్తోంది.

అఫ్గానిస్థాన్‌ ఉత్తర, ఈశాన్య, తూర్పు రాష్ట్రాలలో ఐసిస్‌-కె స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మూడేళ్ల క్రితం అమెరికా, నాటోలు అఫ్గానిస్థాన్‌ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన తరవాత అధికారం చేపట్టిన తాలిబన్లపై ఐసిస్‌-కె వరస దాడులు చేసింది. మాస్కో దాడికి కొన్ని రోజుల ముందు కాందహార్‌లో ఒక బ్యాంకు ముందు జీతాల కోసం బారులు తీరిన తాలిబన్‌ ప్రభుత్వ ఉద్యోగులపై ఐసిస్‌-కె దాడి చేసింది. అంతకుముందు అఫ్గాన్‌లోని షియా వర్గీయులపైనా ఐసిస్‌-కె దాడులకు పాల్పడింది. అయితే తాలిబన్‌ కఠిన చర్యలవల్ల 2023లో ఐసిక్‌-కె దాడులు నిలిచిపోయాయి. దీంతో మాస్కోపై ఐసిస్‌-కె దుష్టనేత్రం సారించింది. ఈ పరిస్థితిలో శత్రువుకు శత్రువు తన మిత్రుడన్న భావనతో తాలిబన్లను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించాలని రష్యా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌ మళ్ళీ ఇస్లామిక్‌ ఉగ్రవాదుల అడ్డాగా మారుతోందని అమెరికా, నాటోలు ఆరోపిస్తున్నా- రష్యా మాత్రం తన పంథా మార్చుకుంటోంది.

ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశమూ తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా ఆ సర్కారు పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని చూస్తోంది. జనవరి చివర్లో కాబూల్‌లో నిర్వహించిన అఫ్గానిస్థాన్‌ ప్రాంతీయ సహకార సభలో రష్యా, భారత్‌, చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌లతో పాటు 11 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం నిర్దిష్ట ఫలితాలను సాధించలేకపోయినా ఇరుగు పొరుగులతో సంబంధాలు మెరుగుపరచుకోవాలన్న తాలిబన్‌ ఆకాంక్షను అది ప్రతిఫలించింది. జనవరి చివరిలో బీజింగ్‌లో అఫ్గాన్‌ రాయబారిగా నియమితుడైన బిలాల్‌ అహ్మద్‌ కరీమీకి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్వాగతం పలికారు. అయితే ఇది తాలిబన్‌ సర్కారును తాము గుర్తిస్తున్నట్లు కాదని, కేవలం దౌత్యపరమైన లాంఛనమేనని చైనా పేర్కొంది. వీగర్‌ ముస్లిం వేర్పాటువాదులతో చైనాకు తలనొప్పులు ఉన్నాయి. వీగర్లు అఫ్గాన్‌ను అడ్డాగా మార్చుకోకుండా చూడటానికి తాలిబన్లతో బీజింగ్‌ సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తోంది. నిరుడు పలు చైనా కంపెనీలు తాలిబన్‌ సర్కారుతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటిలో చమురు ఉత్పత్తి ఒప్పందం ముఖ్యమైనది. దీనికింద చైనా పెట్టుబడులు అఫ్గాన్‌లోకి ప్రవహిస్తాయి. ఇరాన్‌ కూడా తాలిబన్‌ సర్కారును గుర్తించకపోయినా ప్రాంతీయ సుస్థిరతకు తాలిబన్లతో సంబంధాలు ఉపకరిస్తాయని భావిస్తోంది. తాలిబన్లపై పాశ్చాత్య దేశాల దృక్పథం మారేదాకా నిరీక్షించడానికి పొరుగు దేశాలు సిద్ధంగా లేవని కాబుల్‌ సమావేశం సూచించింది. మానవ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న అఫ్గానిస్థాన్‌తో మాటామంతీ సైతం జరపకూడదని అమెరికా, నాటోలు భావిస్తున్నా- చైనా, రష్యా, ఇరాన్‌, పాకిస్థాన్‌ల దృక్పథం వేరుగా ఉంది. ఈ దేశాల్లో కూడా మానవ హక్కులకు రక్షణ అంతంత మాత్రమే. ఏతావతా ఐసిస్‌-కెపై పోరులో అమెరికా-నాటో కూటమికన్నా తాలిబన్లే నమ్మదగిన మిత్రులని రష్యా భావిస్తోంది. ఈ పరిణామాల పర్యవసానాలపై మిగతా ప్రపంచం మాత్రం ఆందోళన చెందుతోంది.

ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.