డోపింగ్‌ ఊబిలో ఆటగాళ్లు

శక్తిని పెంచే ఉత్ప్రేరకాలను వాడి క్రీడల్లో ప్రత్యర్థి మీద పైచేయి సాధించడం ఏళ్ల తరబడి సాగుతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా, మరెన్ని నిబంధనలు పెట్టినా డోపింగ్‌ కనుమరుగు కావడంలేదు. క్రీడల్లో వేగంగా ఎదిగే దిశగా సాగుతున్న భారత్‌- ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (వాడా) తాజా జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విచారకరం. నిజానికి డోపింగ్‌ పేరు చెబితే గుర్తుకొచ్చే దేశం- రష్యా.

Published : 24 Apr 2024 00:54 IST

శక్తిని పెంచే ఉత్ప్రేరకాలను వాడి క్రీడల్లో ప్రత్యర్థి మీద పైచేయి సాధించడం ఏళ్ల తరబడి సాగుతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా, మరెన్ని నిబంధనలు పెట్టినా డోపింగ్‌ కనుమరుగు కావడంలేదు. క్రీడల్లో వేగంగా ఎదిగే దిశగా సాగుతున్న భారత్‌- ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (వాడా) తాజా జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విచారకరం.

నిజానికి డోపింగ్‌ పేరు చెబితే గుర్తుకొచ్చే దేశం- రష్యా. అన్ని క్రీడల్లో ఆ దేశ అథ్లెట్లు డోప్‌ పరీక్షల్లో తరచూ పట్టుబడుతుండటంతో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధాన్ని కూడా ఎదుర్కొంది. ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశాన్నీ కోల్పోయింది. అయినా, డోపింగ్‌లో ఆ దేశాన్ని కూడా వెనక్కి నెట్టి భారత్‌ ముందుకు వెళ్ళిపోవడం ఊహించని పరిణామమే. ఇప్పటిదాకా ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ భారత్‌లో 4064 నమూనాలు (మూత్రం, రక్తం) పరీక్షించగా, అందులో 127 మంది అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు నిర్ధారణ అయింది. వాడా నిర్వహించిన పదేళ్ల డోపింగ్‌ అధ్యయనంలో భారత్‌ది రెండో స్థానం. డోపింగ్‌కు పాల్పడినవారి శాతం 3.26గా ఉంది. రోజురోజుకు డోపింగ్‌ జాబితా పెరుగుతూనే ఉంది. వివిధ క్రీడల్లోని కోచ్‌లు, వైద్యులు, ఫిజియోలకు నిషేధిత ఉత్ప్రేరకాలపై అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువమంది అథ్లెట్లు తమకు తెలియకుండానే డోపింగ్‌లో దొరికిపోతున్నారు. సామర్థ్యం పెంచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ వాడేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి అథ్లెట్లు ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లలో పతకాలు గెలిచి ఒకటి రెండేళ్ల తరవాత పరీక్షల్లో పట్టుబడి అపకీర్తి పాలవుతున్నారు. సాధారణంగా పెద్ద టోర్నీలకు ముందు లేదా ఈవెంట్లు జరిగే సమయంలో వాడా శాంపిల్స్‌ తీసుకుంటుంది. దేశీయంగా జరిగే టోర్నీల్లో జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (నాడా) పరీక్షలు చేస్తుంది. నమూనాలను సేకరించిన కొన్ని నెలల తరవాత ఫలితాలు విడుదలవుతాయి. ఈ నమూనాలను ఎ, బి అనే పేర్లతో వర్గీకరణ చేస్తారు. ఏ శాంపిల్‌లో దొరికినా, బీ శాంపిల్‌లో నిర్దోషిగా బయటపడే వాళ్లు కూడా ఉంటారు. ఈ రెండు శాంపిళ్లలో పాజిటివ్‌ వస్తేనే ఆ క్రీడాకారులపై నిషేధం పడుతుంది. భారత్‌ తరవాత దక్షిణాఫ్రికా (4169 శాంపిళ్లు, 80 మంది) డోపింగ్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. థాయ్‌లాండ్‌ (3402 శాంపిళ్లు, 65 మంది), అమెరికా (3854 శాంపిళ్లు, 61 మంది), ఖతార్‌ (7209 శాంపిళ్లు, 80 మంది) ఈ జాబితాలో తరవాతి స్థానాల్లో ఉన్నాయి.
క్రీడల్లో డోపింగ్‌ వ్యవస్థాగతంగా వేళ్లూనుకుపోయింది. కొన్ని దేశాలు మెరుగైన ఫలితాల కోసం అన్యాపదేశంగా తమ అథ్లెట్లను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రష్యా ఈ వరసలో ముందంజలో ఉంది. భారత్‌ విషయానికొస్తే వెయిట్‌ లిఫ్టర్లలో ఎక్కువమంది డోపింగ్‌లో దొరికిపోతున్నారు. దీంతో మనదేశంలో ఈ క్రీడ మనుగడ ప్రమాదంలో పడింది. కొన్నేళ్లుగా అతి తక్కువమంది లిఫ్టర్లు మాత్రమే ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లాంటి పెద్ద ఈవెంట్లకు అర్హత సాధించారంటే- ఈ క్రీడపై డోపింగ్‌ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌’ అథ్లెట్లను కూడా డోపింగ్‌ మహమ్మారి వదలడం లేదు. రన్నర్లు ఎక్కువమందిలో పాజిటివ్‌ ఫలితం వస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడి మెరుగైన ప్రదర్శన చేసిన కమల్‌ప్రీత్‌ కౌర్‌ (డిస్కస్‌త్రో) లాంటి అథ్లెట్లు సైతం డోప్‌ పరీక్షల్లో దొరికి శిక్షలు ఎదుర్కొంటున్నారు. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో 9.79 సెకన్లలో స్వర్ణం గెలిచి అబ్బురపరచిన అమెరికా రన్నర్‌ బెన్‌ జాన్సన్‌ ఆ తరవాత డోపింగ్‌లో పట్టుబడటం పెద్ద సంచలనం రేపింది. టూర్‌ డి ఫ్రాన్స్‌లో ఏడుసార్లు విజేత లాన్స్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నానని ప్రకటించడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

డోపింగ్‌ మహమ్మారిని అరికట్టాలంటే క్రీడాకారులకు మొదటి నుంచే నిషేధిత ఉత్ప్రేరకాల పట్ల అవగాహన కలిగించాలి. డోపింగ్‌లో దొరికినప్పుడు ఎదురయ్యే పరిణామాల గురించి వివరించడం అవసరం. మరోవైపు డోప్‌ పరీక్షలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. డబ్బులకు ఆశపడి పరీక్షలు నిర్వహించడంలో అశ్రద్ధ చూపించే, ఫలితాలను దాచిపెట్టే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. కేవలం కొన్ని క్రీడలకే ఈ పరీక్షలు పరిమితం కావడం మరో లోపం. ఎలాగైనా గెలవాలని, పేరు తెచ్చుకుని డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎక్కువమంది డోపింగ్‌ ఊబిలో దిగుతున్నారు. కానీ, పర్యవసానాలకు ఊహించలేకపోతున్నారు. నిబంధనలను కఠినతరం చేసి, శిక్షలు పక్కాగా అమలు చేస్తేనే క్రీడాకారుల్లో మార్పు వస్తుంది.

డి.వెంకట వంశీకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.