నానో ఎరువులతో లాభాలెన్నో!

వ్యవసాయాన్ని సులభతరంగా, లాభసాటిగా మార్చడానికి నూతన ఆవిష్కరణలు ఊతమిస్తున్నాయి. ఈ కోవలో రూపుదిద్దుకొన్న నానో సాంకేతికత ఎరువుల తయారీలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. యూరియా, డీఏపీలు ‘నానో ఎరువులు’గా ద్రవరూపంలో అందుబాటులోకి వచ్చాయి. పంటలు పండటానికి భూమిలో పోషకాలు అవసరం. ఆదిమ కాలంలో సహజ సిద్ధమైన కర్బన...

Updated : 24 Apr 2024 06:43 IST

వ్యవసాయాన్ని సులభతరంగా, లాభసాటిగా మార్చడానికి నూతన ఆవిష్కరణలు ఊతమిస్తున్నాయి. ఈ కోవలో రూపుదిద్దుకొన్న నానో సాంకేతికత ఎరువుల తయారీలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. యూరియా, డీఏపీలు ‘నానో ఎరువులు’గా ద్రవరూపంలో అందుబాటులోకి వచ్చాయి.

పంటలు పండటానికి భూమిలో పోషకాలు అవసరం. ఆదిమ కాలంలో సహజ సిద్ధమైన కర్బన పదార్థాలు, ఒండ్రుమట్టి, వ్యర్థాలు, మొక్కల నుంచి లభ్యమయ్యే పదార్థాలను ఎరువులుగా వాడేవారు. జీవవ్యర్థాల లభ్యత కష్టతరంగా మారడంతో రైతులు యూరియా, డీఏపీ, మిశ్రమ (కాంప్లెక్స్‌) వంటి రసాయన ఎరువులవైపు మొగ్గు చూపారు. వ్యవసాయ రంగంలోకి 1958లో ప్రవేశించిన యూరియా- సాగులో అత్యంత కీలకంగా మారింది. దాంతో పాటు మిగిలిన ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్‌, అమోనియా వంటి పోషకాలు లభ్యమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 92శాతం రసాయన ఎరువుల వాడకంతోనే వ్యవసాయం సాగుతోంది. ఎరువుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో వినియోగించే 70శాతం యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తంలో సరఫరా చేసినా మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు యూరియాను విక్రయించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయంగా యూరియా ధరలు భారీగా పెరగడంతో ఒక్కో యూరియా బస్తాపై ప్రభుత్వం రూ.3700 మేర సబ్సిడీ అందిస్తోంది. భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీకి 2014-15లో రూ.73,067 కోట్ల వ్యయం చేయగా, 2022-23లో రూ.2,54,799 కోట్లు ఖర్చు చేసింది.

మితిమీరిన వాడకం

మితిమీరిన రసాయన ఎరువుల వాడకం అనర్థాలకు హేతువవుతోంది. ఈ క్రమంలో అమెరికాలో స్థిరపడిన భారతీయ శాస్త్రవేత్త రమేశ్‌ రాలియా ఎరువులపై విస్తృత పరిశోధనలు చేసి నానో యూరియాను కనుగొన్నారు. గుళికల స్థానంలో ద్రవరూప యూరియాను తీసుకొచ్చారు. రైతుల పొలాల్లో ప్రయోగించి ఫలితాలు పరిశీలించాకే విపణిలోకి విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా సంచలనంగా మారగా, రైతుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇఫ్కో ద్వారా 2021లో అందుబాటులోకి తెచ్చారు. అరలీటర్‌ సీసాలో లభించే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానం. సబ్సిడీలు పోను యూరియా బస్తా ధర రూ.268 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే లభ్యమవుతోంది. సాధారణంగా ఒక ఎకరాకు అర లీటర్‌ నానో యూరియా సరిపోతుంది. ఎరువుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు నానో యూరియా, డీఏపీలు ఆశాజనకంగా మారాయి. ఇది పంటల ఉత్పాదకతను పెంచుతుంది. ఆహారం, పర్యావరణానికి సురక్షితమైనది. గాలి, నేల, నీటి కాలుష్యం ఉండదు. తద్వారా వాతావరణ కాలుష్యం, ఇతర ప్రతికూల మార్పులను తగ్గించడానికి సాయపడుతుంది. సాధారణ యూరియాకు బదులు దీన్ని వాడటం వల్ల రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల దాకా ఆదా అవుతుందని కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 94 రకాల పంటలపై 11వేల మంది రైతుల పొలాల్లో 43 ప్రాంతాల్లో ఐసీఏఆర్‌ ప్రయోగాలు నిర్వహించింది. అందులో నానో యూరియా వాడకం వల్ల ఎనిమిది శాతం వరకు పంట ఉత్పాదకత పెరిగినట్లు తేలింది. యూరియా అనంతరం నానో డీఏపీని ఇఫ్కో అందుబాటులోకి తెచ్చింది. ఒక బస్తా డీఏపీకి 500 మిల్లీలీటర్ల నానో డీఏపీ సీసా సమానం. బస్తా డీఏపీ ఎరువు ధర రూ.1350 ఉండగా, నానో డీఏపీ రూ.600కే లభిస్తోంది.

విస్తృత ప్రచారం  

ఇఫ్కో సంస్థ 2021 ఆగస్టు నుంచి గత నెలాఖరు వరకు 3.90 కోట్ల నానో యూరియా సీసాలను  గ్రామాలకు పంపించగా రైతులు 2.87 కోట్ల సీసాలు కొని పంటలపై చల్లినట్లు తాజాగా వెల్లడైంది. ఇది 13 లక్షల టన్నుల సాధారణ గుళికల యూరియాతో సమానమని గుర్తించారు. సాధారణ యూరియా బస్తాల రవాణాకు ఏటా భారీస్థాయిలో వెచ్చిస్తున్నారు. సీసాల రవాణాతో ఆ వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. నానో యూరియా, డీఏపీలపై విస్తృతస్థాయి అవగాహన లేకపోవడం వల్ల వినియోగం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీని ఫలితాలపై సందేహాల కారణంగా, స్ప్రేల వినియోగం కష్టసాధ్యమవుతుందనే ఉద్దేశంతో రైతులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. దీంతో ఎరువుల వ్యాపారులు ఘనరూపంలోని ఎరువులతో పాటు వీటిని జత చేసి బలవంతంగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నానో ఎరువుల వినియోగంతో వచ్చే లాభాలను శాస్త్రీయంగా నిరూపించేందుకు చొరవ చూపాలి. వ్యవసాయ శాఖతో పాటు దాని అనుబంధ విభాగాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ ఎరువులపై విస్తృత ప్రచారం సాగించాలి.

ఆకారపు మల్లేశం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.