బరితెగిస్తున్న సైబరాసురులు

మనదేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఈ విభాగంలో భారత్‌ ప్రపంచంలో ‘టాప్‌ టెన్‌’లో చేరింది. 100 దేశాలతో అంతర్జాతీయ సైబర్‌ నిపుణులు రూపొందించిన ప్రపంచ సైబర్‌ నేరాల సూచీలో మన దేశం పదో స్థానంలో నిలవడం ఆందోళనకర పరిణామం.

Published : 25 Apr 2024 01:06 IST

మనదేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఈ విభాగంలో భారత్‌ ప్రపంచంలో ‘టాప్‌ టెన్‌’లో చేరింది. 100 దేశాలతో అంతర్జాతీయ సైబర్‌ నిపుణులు రూపొందించిన ప్రపంచ సైబర్‌ నేరాల సూచీలో మన దేశం పదో స్థానంలో నిలవడం ఆందోళనకర పరిణామం.

ఎలాంటి తరహా సైబర్‌ నేరాలు ఏయే దేశాల్లో ఎక్కువగా జరుగుతున్నాయనే కోణంలో ఆక్స్‌ఫర్డ్‌, న్యూసౌత్‌వేల్స్‌ విశ్వవిద్యాలయాలు దాదాపు మూడేళ్లపాటు సమగ్ర పరిశీలన నిర్వహించి ఈ సూచీని రూపొందించాయి. ఇందులో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్‌, బ్రెజిల్‌ రెండు నుంచి తొమ్మిది స్థానాలు ఆక్రమించాయి. మాల్‌వేర్‌ (వైరస్‌)ను చొప్పించి కంప్యూటర్లను స్తంభింపజేయడం, ఆన్‌లైన్‌ వ్యవస్థలపై దాడులు చేసి పని చేయకుండా అడ్డుకోవడం, వైరస్‌ను తొలగించడానికి భారీగా డబ్బులు డిమాండ్‌ చేయడం, సమాచార తస్కరణ, వ్యక్తిగత వివరాల చోరీ, ఖాతాలు పనిచేయకుండా మొరాయించేలా చేయడం, ధ్రువపత్రాల జారీ, ఉద్యోగ కల్పన, ఇంటి నుంచి పని చేసే అవకాశాలు ఇప్పిస్తామని రకరకాల ఆశలతో ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి మోసగించడం, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల మోసాలు, క్రిప్టో వంటి వర్చువల్‌ కరెన్సీల పేరిట వంచించడం ఇవన్నీ సైబర్‌ నేరాల కిందే పరిగణిస్తారు. వీటిలో ఒక్కో దేశం ఒక్కో తరహా సైబర్‌ నేరాలకు ప్రసిద్ధి చెందిందని నివేదిక వెల్లడించింది. మనదేశానికి సంబంధించి ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుగానే ఆన్‌లైన్‌లో డబ్బులు తీసుకుని మోసగించే నేరాలే ఎక్కువని పేర్కొంది.

నేరాల తీవ్రత

ఆర్థిక సంబంధిత సైబర్‌ నేరాలు 2023లో 11.30 లక్షలదాకా జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రకటించింది. వీటి విలువ రూ.7,488 కోట్లు. ఇందులో సగానికి పైగా ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణాల్లోనే నమోదయ్యాయి. భారత కంప్యూటర్‌ అత్యవసర ప్రతిస్పందన బృందం గణాంకాల ప్రకారం 2022లో దేశంలో సైబర్‌ భద్రతను దెబ్బతీసే ఘటనలు 13.91 లక్షలు చోటు చేసుకున్నాయి. 2018లో వీటి సంఖ్య 2.08 లక్షలు మాత్రమే. నాలుగేళ్లలోనే ఆరు రెట్లు కావడం సైబర్‌ నేరాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇవన్నీ రికార్డుల్లో నమోదవుతున్న కేసులకు సంబంధించిన గణాంకాలు. సైబర్‌ దాడుల బాధితుల్లో చాలామంది వాటి గురించి ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదు చేసే విధానం తెలియనివారు, తెలిసినా మౌనంగా ఉండిపోయే వారి శాతం ఎక్కువే. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌ల ద్వారా చెల్లింపుల్లో మోసాలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అయితే ఆన్‌లైన్‌ మాయగాళ్లు ప్రధానంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలే వేదికగా జనాలపై వల విసురుతున్నారు. స్వల్పకాలంలోనే లక్షల్లో సంపాదించే మార్గాలు చూపిస్తాం, ఇంట్లో కూర్చునే రోజూ వేలల్లో సంపాదించే వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగాలిప్పిస్తాం, ప్రముఖ కంపెనీల్లో లక్షల వేతనంతో కొలువులు ఇప్పిస్తాం వంటి ప్రకటనలతో ఉచ్చులోకి లాగుతున్నారు. ఆన్‌లైన్‌ లాటరీల్లో కోట్ల రూపాయల బహుమతులు వచ్చాయని, రుసుముల కోసం నామమాత్రంగా కొన్ని వేల రూపాయలు చెల్లించాలంటూ ముగ్గులోకి దింపి లక్షల రూపాయలు దోచేసిన ఘటనల్లో బాధితులు చాలామంది ఉన్నత విద్యార్హతలు కలిగినవారే ఉంటున్నారు. హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుండటం గమనార్హం. కార్డు క్లోనింగ్‌, స్కిమ్మింగ్‌ వంటి గిమ్మిక్కులతో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు వివరాలు తస్కరించి జేబులు గుల్ల చేసే ముఠాలు ఝార్ఖండ్‌, యూపీ వంటి రాష్ట్రాల్లో వ్యవస్థీకృతంగా పాతుకుపోయాయి. ఇలాంటి సైబరాసురులు పోలీసులకే సవాలు విసురుతున్నారు. మాల్‌వేర్‌, ర్యాన్సమ్‌వేర్‌ మోసాలు కూడా మన దేశంలో ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని సైబర్‌ భద్రతా నిపుణులు చెబుతున్నారు. క్లౌడ్‌ సేవల కార్యకలాపాలను స్తంభింపజేసి, ఎంతో కొంత మొత్తం డిమాండ్‌ చేసే మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. జూమ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివాటిలో మోసాలకు పాల్పడేవారి సంఖ్య కూడా అధికమవుతోంది.

విస్తృత అవగాహన

స్మార్ట్‌ఫోన్లతో ఆన్‌లైన్‌లో పనులు చక్కబెట్టుకోవడం ఇప్పుడు చిటికెలో పని. టికెట్‌ రిజర్వేషన్‌ నుంచి టీ కొట్టులో డబ్బుల చెల్లింపుదాకా అన్నింటికీ ఆన్‌లైన్‌ చెల్లింపులతో పనిపూర్తవుతోంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం శ్రమను, సమయాన్ని ఆదా చేస్తుందని ఆనందించేలోపే సైబర్‌ నేరాలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ డిజిటల్‌ అక్షరాస్యత అత్యవసరంగా మారింది. దీనిపై ప్రభుత్వం విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. డిజిటల్‌ ఇండియా లక్ష్యసాధనలో వడివడిగా ముందుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ భద్రతపైనా, సైబర్‌ నేరాల కట్టడిపైనా మరింత నిశితంగా దృష్టి సారించాల్సిందే!

ముఖర్జీ కొండవీటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు