సత్వర పరిష్కారమే వినియోగదారులకు రక్ష

దేశార్థిక వ్యవస్థలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల సేవా లోపాలు, తప్పుల వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వాటికి పరిష్కారంగా రిజర్వు బ్యాంకు పలు నిబంధనలు విధించింది. ప్రస్తుతం భారత్‌లో 137 షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు లక్షన్నరకు పైగా శాఖల ద్వారా సేవలందిస్తున్నాయి.

Published : 25 Apr 2024 01:04 IST

దేశార్థిక వ్యవస్థలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల సేవా లోపాలు, తప్పుల వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వాటికి పరిష్కారంగా రిజర్వు బ్యాంకు పలు నిబంధనలు విధించింది.

ప్రస్తుతం భారత్‌లో 137 షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు లక్షన్నరకు పైగా శాఖల ద్వారా సేవలందిస్తున్నాయి. వీటిలో జాతీయం చేసినవి, గ్రామీణ, ప్రైవేట్‌ రంగ, విదేశీ బ్యాంకులున్నాయి. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం-1949 ప్రకారం బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి డిపాజిట్లు సేకరించాలి. అకౌంటింగ్‌ సిద్ధాంతం ప్రకారం డిపాజిట్లు ఇచ్చిన వారికి బ్యాంకులు అప్పు పడినట్లు లెక్క. అదేవిధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారు నిర్ణీత సమయంలోగా అప్పు తీర్చాలి. అందువల్ల, బ్యాంకులు ఒకే సమయంలో రుణగ్రహీతలు, దాతలుగా వ్యవహరిస్తాయి. వీటితో పాటు లాకర్‌ సదుపాయం, చెక్కుల జారీ వంటి ఎన్నో సేవలను బ్యాంకులు అందిస్తాయి. ఈ క్రమంలో బ్యాంకుల సేవా లోపాలపై ఎన్నో ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారానికి రిజర్వు బ్యాంకు 1995లోనే అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతకుముందు బ్యాంకుల సేవా లోపాలపై సివిల్‌ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అవి తెమలడానికి చాలా సమయం పట్టేది. ధనమూ వ్యయమయ్యేది.

అంబుడ్స్‌మన్‌ వ్యవస్థలో ఫిర్యాదు నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 2021లో దీన్ని మరింత పటిష్ఠం చేస్తూ కేంద్రం సమీకృత అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను తెచ్చింది. అంతే కాకుండా 2018లో అన్ని బాంకుల్లో అంతర్గత అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రిజర్వ్‌ బ్యాంకు ఆదేశించింది. రిజర్వ్‌ బ్యాంకు నిబంధనల ప్రకారం ఏ ఫిర్యాదును అయినా 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఒక ఫిర్యాదుకు సంబంధించి బ్యాంకు నిర్ణయం వినియోగదారుకు వ్యతిరేకంగా ఉంటే, అలాంటి వాటిని అంతర్గత అంబుడ్స్‌మన్‌ పరిశీలనకు పంపించాలి. దీని నిర్ణయమే అంతిమంగా చెల్లుబాటు అవుతుంది. బ్యాంకుల సేవలపై కేంద్రానికీ పలు ఫిర్యాదులు అందుతాయి. వాటిని రిజర్వ్‌బ్యాంకులో వినియోగదారుల సంరక్షణ విభాగానికి పంపిస్తారు. అక్కడా ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత బ్యాంకులకు నోటీసులు ఇచ్చి, సమస్యను పరిష్కరించేలా చూస్తారు. వినియోగదారుల కమిషన్ల ద్వారానూ బ్యాంకు వినియోగదారుల ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుంది. అయితే, అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ కంటే ఇది కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది.

లాకర్ల సంరక్షణకు రిజర్వ్‌ బ్యాంకు సరైన మార్గదర్శకాలను రూపొందించలేదని అమితాభ దాస్‌ గుప్తా వర్సెస్‌ యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తమ అసంతృప్తిని వ్యక్తీకరించింది. ఆరు నెలల్లోగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని రిజర్వ్‌ బ్యాంకును ఆదేశించింది. దానికి అనుగుణంగా 2021 ఆగస్టులో లాకర్లను సంరక్షించే పూర్తి బాధ్యతను బ్యాంకులు ఏ విధంగా చేపట్టాలో రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల లాకర్లో దాచుకున్న వస్తువులు పోయినా లేదా పాడైనా బ్యాంకులు ఆ వినియోగదారులకు వంద రెట్ల లాకర్‌ అద్దె పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం పొందాలంటే ఆస్తి పత్రాలను బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించిన తరవాత ఆ పత్రాలను బ్యాంకు తిరిగి ఖాతాదారుకు అందిస్తుంది. కొన్ని సమయాల్లో మొత్తం రుణం చెల్లించిన తరవాతా కొన్ని బ్యాంకులు ఆస్తి పత్రాలను ఇవ్వడంలో చాలా జాప్యం చేస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రుణం చెల్లించిన తరవాత ముప్ఫై రోజుల్లోగా ఖాతాదారులు ఆస్తిపత్రాలు తిరిగి ఇవ్వాలని వాణిజ్య బ్యాంకులను ఆదేశించింది. నెల తరవాత జాప్యం జరిగితే ప్రతి రోజుకు అయిదు వేల రూపాయలను వినియోగదారుకు చెల్లించాలని నిబంధన విధించింది. బ్యాంకులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి కేంద్రం, రిజర్వ్‌ బ్యాంకు ఎన్నో విధానాలను రూపొందించాయి. వినియోగదారులు తమకు అనువైన మార్గాన్ని ఎంచుకొని వివాదాలను పరిష్కరించుకోవచ్చు.

- హరీశ్‌ కొలిచాల
(న్యాయ నిపుణులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.