చదువు వెంటే కొలువు రావాలంటే...

నాణ్యమైన చదువులను అందిపుచ్చుకున్న వారికి దేశదేశాల్లో ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్‌ అనుసరిస్తున్న ప్రాజెక్టు ఆధారిత అభ్యసన (పీబీఎల్‌) భారత్‌ వంటి దేశాలకు ఎంతో అనుసరణీయం. దానివల్ల చదువు పూర్తి కాగానే కొలువు లభించే అవకాశం ఉంటుంది. వ్యక్తి వికాసానికి, ఆర్థిక, సామాజిక పురోగతికి విద్యే పునాది.

Updated : 15 May 2024 07:42 IST

నాణ్యమైన చదువులను అందిపుచ్చుకున్న వారికి దేశదేశాల్లో ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్‌ అనుసరిస్తున్న ప్రాజెక్టు ఆధారిత అభ్యసన (పీబీఎల్‌) భారత్‌ వంటి దేశాలకు ఎంతో అనుసరణీయం. దానివల్ల చదువు పూర్తి కాగానే కొలువు లభించే అవకాశం ఉంటుంది.

వ్యక్తి వికాసానికి, ఆర్థిక, సామాజిక పురోగతికి విద్యే పునాది. అందుకే బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌లు 1980వ దశకంలోనే విద్యారంగంలో ఆధునిక సంస్కరణలు చేపట్టాయి. ఆ ప్రగతి ఫలాలను నేడు అందుకొంటున్నాయి. విద్యార్థులను ఎటువంటి ఒత్తిళ్లకూ గురిచేయకుండా, చదువు పట్ల ఆసక్తి కలిగించే ‘యుతోరీ’ విద్యావిధానాన్ని చేపట్టిన జపాన్‌ అపూర్వ ఫలితాలను సాధిస్తోంది. ప్రపంచంలో అన్ని రంగాల్లో పోటీని అధిగమించి మేటి శక్తిగా నిలవాలంటే విద్యే కీలకమని 1983లో ‘అమెరికా జాతీయ విద్యా సామర్థ్య సాధన కమిషన్‌’ దేశాధ్యక్షుడికి నివేదించింది. ఐరోపా దేశాల్లో విద్యార్థి కేంద్రిత, అంతర్జాతీయ ప్రమాణాలతో తులతూగే విద్యావిధానాన్ని చేపట్టాలని 1999లో ‘బొలోనీ డిక్లరేషన్‌’ పేర్కొంది. ఏతావతా మొక్కుబడి చదువులను, సంప్రదాయ విద్యావిధానాన్ని అవతలపెట్టి జీవితంలో రాణించడానికి తోడ్పడే విద్యను యువతకు అందించాలనే గ్రహింపు విధానకర్తల్లో పెరిగింది.

జపాన్‌ విద్యావిధానంతో...

నాణ్యమైన విద్యాబోధనకు ప్రణాళికను రూపొందించి, దాన్ని ఆచరణలో పెట్టి, లోపాలను సరిదిద్దుకుంటూ ఆశించిన ఫలితాలను సాధించడాన్ని పీడీసీఏ (ప్లాన్‌-డూ-చెక్‌-యాక్ట్‌) విధానమంటారు. వివిధ సబ్జెక్టులలో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను, తార్కిక ఆలోచనా శక్తిని, సమస్యలను పరిష్కరించే సత్తాను సాధించడమే పీడీసీఏ విధాన లక్ష్యం. విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించాలంటే సబ్జెక్టులపై పట్టు సాధించడంతోపాటు బహుముఖ నైపుణ్యాలను అలవరచుకోవాలనే స్పృహ ఇండియాలోనూ పెరిగింది. ఇక్కడ జపాన్‌ విద్యావిధానాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ‘నేను విన్నది మరచిపోతాను... నేను చూసింది గుర్తుంచుకుంటాను... నేను చేసేదానిపై అవగాహన పెంచుకుంటాను’ అనే సూత్రం జపాన్‌ విద్యావిధానానికి వెన్నెముక. ఆచరణ ద్వారా అభ్యసనం అనే ఈ సూత్రం జపాన్‌లో ప్రాజెక్టు ఆధారిత అభ్యసనకు (పీబీఎల్‌) పునాది వేసింది. భారతీయ తరగతి గదుల్లోనూ పీబీఎల్‌ను అనుసరించాలి. భారత్‌లో ప్రస్తుతం విద్యాపరంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు ఉన్నాయి. ఆచరణ ద్వారా అభ్యాసానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. విద్యార్థుల బహుముఖ వికాసానికి తోడ్పడుతూ వారికి దేశవిదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొనే సత్తాను అలవరచాలి.

జపాన్‌లో 92శాతం పట్టభద్రులు చదువు పూర్తికాగానే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇది పీబీఎల్‌ పద్ధతి వల్లే సాధ్యపడుతోంది. కోర్సు మూడో సంవత్సరంలో బృంద అధ్యయనం, చర్చలను, నాలుగో ఏడాదిలో పీబీఎల్‌ ప్రాజెక్టులను తప్పనిసరి చేశారు. తద్వారా విద్యార్థుల్లో చాలామంది ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలవారికీ సమానంగా విద్యావకాశాలు కల్పిస్తోంది. అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్య... తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పిల్లలకు, సామాజిక భృతి పొందుతున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ దేశాల్లో పట్టా పుచ్చుకోగానే ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నవారి శాతాన్ని ఇక్కడ పరిశీలించాలి. బ్రిటన్‌లో నూతన పట్టభద్రుల్లో 15శాతం, అమెరికాలో 24.3శాతం, దక్షిణ కొరియాలో 48.2శాతం, చైనాలో 72శాతం కోర్సులు పూర్తికాగానే కొలువులు సంపాదిస్తున్నారు. జపాన్‌లో అలాంటివారు ఏకంగా 82శాతం! ప్రాజెక్టు ఆధారిత అభ్యసన (పీబీఎల్‌) విధానం ఎంత ముఖ్యమో పరిశ్రమలన్నీ గుర్తించాయి కాబట్టే పట్టభద్రులకు వెంటనే ఉద్యోగాలిస్తున్నాయి. రెండేళ్ల మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో పీబీఎల్‌ కార్యక్రమాలను విరివిగా చేపడతారు. దానివల్ల విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు 98.5శాతం ప్లేస్‌మెంట్లు సాధిస్తున్నాయి. కొన్నైతే పూర్తిస్థాయిలో విద్యార్థులందరికీ కొలువులు సాధించి పెడుతున్నాయి.

సమాన అవకాశాలే కీలకం

జపాన్‌లో అధ్యాపకులు విద్యార్థుల్లో కుతూహలాన్ని ప్రేరేపించడమే కాకుండా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త అంశాల అన్వేషణకు పురిగొల్పే పీబీఎల్‌ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థులు అధ్యాపకుడు చెప్పేది ఆలకిస్తే సరిపోదు. కాబట్టి, విద్యార్థులు తమంతట తాముగా చదువుల్లో ముందుకువెళ్ళేలా అధ్యాపకులు స్ఫూర్తినిస్తున్నారు. కొత్తతరం ఆలోచనాపరులను, కార్యసాధకులను తయారుచేయడమే లక్ష్యంగా బోధన సాగిస్తున్నారు. భారతదేశంలో విద్యలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కష్టంగానే ఉంది. అన్నివర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి జపాన్‌ చేపడుతున్న విధానాలను ఇండియా కూడా పరిశీలించాలి. పీబీఎల్‌ వంటి పద్ధతులను అనుసరించాలి. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉందని నెల్సన్‌ మండేలా చేసిన ప్రకటనను ఆచరణలోకి తీసుకురావాలి.

ప్రొఫెసర్‌ మురళీధర్‌ మిర్యాల
(జపాన్‌లోని షిబరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆచార్యులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.