క్రికెట్‌ పందెం... ప్రాణసంకటం!

మన దేశంలో క్రికెట్‌ జూదం ఎంతోమందిని రోడ్డున పడేస్తోంది. యువతకు ప్రాణసంకటంగా మారుతోంది. క్రికెట్ పోటీలు మొదలవ్వగానే కుర్రాళ్లను బెట్టింగ్‌ భూతం ఆవహిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌తో మొదలైన పందేలు రాబోయే టీ20 ప్రపంచకప్‌ నాటికి పతాక స్థాయికి చేరుకోనున్నాయి. అప్పులు తీర్చే దారిలేక ఇటీవల బెంగళూరులో ఓ కుటుంబం బలైంది.

Updated : 20 May 2024 07:12 IST

మన దేశంలో క్రికెట్‌ జూదం ఎంతోమందిని రోడ్డున పడేస్తోంది. యువతకు ప్రాణసంకటంగా మారుతోంది. క్రికెట్ పోటీలు మొదలవ్వగానే కుర్రాళ్లను బెట్టింగ్‌ భూతం ఆవహిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌తో మొదలైన పందేలు రాబోయే టీ20 ప్రపంచకప్‌ నాటికి పతాక స్థాయికి చేరుకోనున్నాయి.

అప్పులు తీర్చే దారిలేక ఇటీవల బెంగళూరులో ఓ కుటుంబం బలైంది. అమ్మానాన్నలకు తెలియకుండా బంగారం అమ్మేసిన ఓ కుర్రాడికి బలవన్మరణమే పరిష్కారంగా తోచింది. ఈ ఉదంతాలకు కారణం- క్రికెట్‌ జూదమే! సరదాగా మొదలుపెట్టి, పూర్తిగా కూరుకుపోయి, అప్పులు తీర్చలేక ప్రాణాలే పణంగా పెడుతున్నారు. ఎక్కడెక్కడో జరిగే ఆటలపోటీలు  మొదలుకొని ప్రపంచకప్‌దాకా బెట్టింగ్‌కు ఏదీ అనర్హం కాదన్నట్లుగా సాగుతోంది. ఒకప్పుడు నగరాల్లో మాత్రమే క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా జూదాలు నడిచేవి. ఇప్పుడీ మహమ్మారి గ్రామాలకూ పాకింది. బంతి, వికెట్, సిక్స్, ఫోర్, మ్యాచ్‌ల చొప్పున విభజించి బెట్టింగ్‌ కాస్తున్నారు. పేరున్న క్రికెటర్లు, సినీ తారలు బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారకర్తలుగా పనిచేస్తుండటంతో అభిమానుల్లో కూడా జూదం ఆడటం తప్పు కాదనే భావన నెలకొందనే విమర్శలున్నాయి. ఏదోఒక మార్గంలో డబ్బులు సంపాదించాలనే కోరిక పెరగడమే వారిని ఈ దిశగా ఉసిగొల్పుతోంది.

లొసుగులను ఆసరాగా చేసుకుని...

ముందు సరదాగా మొదలుపెట్టి, కాస్త డబ్బులు రాగానే ఆశ పెరిగి, ఉన్నదంతా ధారపోసి చివరికి డబ్బులు పోగొట్టుకోవడం జూదగాళ్లకు పరిపాటిగా మారింది. కొంతమంది అప్పులు చేసి మరీ డబ్బులు తెచ్చి పందెంకాసి నష్టపోతున్నారు. రుణదాతల ఒత్తిడి భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు సైతం పందెం కాయడానికి వెనకంజ వేయడం లేదు. బెంగళూరులో ఒక మహిళ కోటి రూపాయలదాకా పోగొట్టుకుని చనిపోవడమే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వం 174 బెట్టింగ్‌ యాప్‌లను నిషేధించింది. అయినప్పటికీ వేర్వేరు మార్గాల్లో పందేలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రికెట్‌ పందేలు అంతకంతకూ విస్తరించడానికి సామాజిక మాధ్యమాలు సైతం ఊతమిస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ వంటి వేదికలను ఉపయోగించుకొని బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా జూదరులను ఆకర్షిస్తున్నారు. ఐపీఎల్, ప్రపంచకప్‌ లాంటి ప్రధాన క్రీడోత్సవాలు జరుగుతున్నప్పుడు సుమారు 34 కోట్లమందికిపైగా జూదంలో పాల్గొంటున్నట్లు విదితమవుతోంది. 2027 నాటికి జూద విపణి 8.59 శాతం పెరిగే అవకాశాలున్నట్లు నిపుణుల అంచనా. 1867 చట్టం ప్రకారం బెట్టింగ్‌ నేరం. కానీ సిక్కిం, గోవా లాంటి పలు రాష్ట్రాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ను అధికారికంగానే కొనసాగిస్తున్నారు. నైపుణ్యం ఆధారంగా సాగే జూదం బెట్టింగ్‌ చట్టం పరిధిలోకి రాదనేది కొంతమంది వాదన. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని యువత పందేలకు పాల్పడుతున్నారు.

అవగాహన పెంపే కీలకం

క్రికెట్‌ బెట్టింగ్‌కు ఉద్దేశించిన ఒక యాప్‌లో కోట్ల మంది వినియోగదారులు ఉండటం జూదం ఏ స్థాయిలో నడుస్తోందనేందుకు ఉదాహరణ. క్రికెట్‌ పోటీలు నడిచే సమయంలో వచ్చే టీవీ ప్రకటనల్లో 18 శాతం వాటా ఈ ఫాంటసీ గేమింగ్‌ యాప్‌లదే. కోట్ల రూపాయలు గెలుచుకుంటున్నట్లు ఈ యాప్‌లు ప్రచారం చేస్తున్నాయి. కానీ, నిజానికి లక్షలమంది పాల్గొనే జూదంలో ఎక్కువమంది గెలుచుకునేది చాలా చిన్న మొత్తాలే. ఇలాంటి వాస్తవాల్ని పట్టించుకోకుండా, ఎప్పటికైనా అదృష్టం వరించకుండా ఉంటుందా అన్న ఆశతో మధ్య తరగతి యువత పందేలు కాస్తూ డబ్బులు నష్టపోతున్నారు. యాప్‌ల ద్వారా జరిగే జూదం ఒక ఎత్తయితే, పబ్‌లు, క్లబ్‌లలో పెద్ద తెరలను ఏర్పాటుచేసి బెట్టింగ్‌ చేయడం మరో ఎత్తు. ఇలాంటి చోట్ల ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారో ఎంత నష్టపోతున్నారో అసలు లెక్కే ఉండటంలేదు. భారీ క్రికెట్‌ పోటీలు జరుగుతున్నప్పుడు చిన్న ఊళ్ల నుంచి పట్టణాలకు వచ్చి మరీ పబ్‌లలో జూదం ఆడేవాళ్లు పెరిగిపోతున్నారు. బెట్టింగ్‌ ధ్యాసలో పడి చదువుల్నీ అటకెక్కిస్తున్నారు. చివరికి జూదానికి బానిసలుగా మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలను మరింత కఠినతరం చేయడం ద్వారా ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేయాలి. బెట్టింగ్‌లతో తలెత్తే నష్టాల గురించి యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సినీ, క్రీడా ప్రముఖులు తమ వంతు బాధ్యతగా అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తే పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశాలున్నాయి. విద్యాసంస్థల్లో నిరంతరం ఈ దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంవల్ల విద్యార్థులకు జూదంపై మోజు తగ్గుతుంది. పందేల వల్ల కలిగే ప్రమాదాల్ని గుర్తించే అవకాశం పెరుగుతుంది.

దాస్యం వెంకట వంశీకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.