ఊపిరి తీస్తున్న ఉదాసీనత

కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. కారులో వదిలేసి వెళ్ళడం, నాటువైద్యం చేయించడం, నిర్లక్ష్యంగా రోడ్లపైకి వదిలెయ్యడం వంటి ఘటనల్లో  చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. బాలల భవితను చిదిమేస్తున్న ఉదాసీన వైఖరిని విడనాడాల్సిన అవసరముంది.

Updated : 22 May 2024 05:18 IST

కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. కారులో వదిలేసి వెళ్ళడం, నాటువైద్యం చేయించడం, నిర్లక్ష్యంగా రోడ్లపైకి వదిలెయ్యడం వంటి ఘటనల్లో  చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. బాలల భవితను చిదిమేస్తున్న ఉదాసీన వైఖరిని విడనాడాల్సిన అవసరముంది.

నాన్న హాయిగా, ఆనందంగా షికార్లకు తిప్పిన ఆ కారే, తన కుటుంబంతో సంతోషాలకు వేదిక అయిన ఆ కారే... తనకు శవపేటికగా మారుతుందని ఆ చిన్నారి ఎంతమాత్రం ఊహించి ఉండదు. బతికుండగానే అందులో సజీవ సమాధి అవుతానని అస్సలే అనుకుని ఉండదు. ఇటీవల రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో పెళ్ళికి వెళ్ళే హడావుడిలో తల్లిదండ్రులు తమ పాపను కారులో వదిలి దిగిపోయిన ఘటనలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. తల్లిదండ్రుల చిన్నపాటి నిర్లక్ష్యానికి పాప నిండు నూరేళ్ల జీవితం అన్యాయంగా, అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అనారోగ్యం బారిన పడిన పసికందును సూర్యరశ్మి కింద ఉంచాలని వైద్యులు సూచించగా, ఎండలో పడుకోబెట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతం చోటుచేసుకుంది. కొద్దిపాటి నిర్లక్ష్యమైనా, పరిణామాలు ఎంతో తీవ్రంగా ఉంటాయనేందుకు ఇలాంటి ఉదంతాలే నిదర్శనం.

అందరి బాధ్యత

మనదేశంలో జీవించే హక్కు ద్వారా ప్రతి పౌరుడికీ ధైర్యంగా, గౌరవంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. కానీ, చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యమే వారికి మరణశాసనం రాస్తుండటం బాధాకరం. నవజాత శిశువులుగా ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి, అడుగులు వేసే వయసు వచ్చేదాకా సంరక్షకుల అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వ్యక్తిగత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే నార్వే, ఫిన్లాండ్‌ వంటి దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయి. తల్లిదండ్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాకుండా, నిర్లక్ష్యం నిరూపణ అయితే భారీశిక్షల్ని సైతం కోర్టులు విధిస్తుంటాయి. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవడం విచారకరం. పేదరికం, వెనకబాటుతనంతో అల్లాడుతూ పిల్లల పెంపకం, భద్రతాచర్యలపై సరైన అవగాహన లేక తప్పులు చేసే గ్రామీణ ప్రజలది ఒక విధమైన సమస్య. అన్నీ తెలిసి ఉండీ, అతి జాగ్రత్తతో, అంతా తమకే తెలుసనే ధిక్కారపు ధోరణితో, హడావుడి జీవనశైలి కారణంగా ఇటువంటి ఘటనలకు కారణమవుతున్న పట్టణ ప్రాంత ప్రజలది మరో విధమైన సమస్య. ఇటీవల రష్యాలో ‘సన్‌షైన్‌ డైట్‌’ పేరుతో ఏడాది బిడ్డకు ఎటువంటి ఆహారం ఇవ్వకుండా, కనీసం తల్లిపాలు సైతం తాగించకుండా, కేవలం ఎండలో ఉంచితే ఆకలి తీరుతుందనే వెర్రి ఆలోచనతో ఆ పసిబిడ్డ చావుకు కారకుడైన తండ్రికి అక్కడి కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. కళ్లముందు అంత తతంగం జరుగుతున్నా అడ్డుకోకుండా, ఆ బిడ్డ ఆకలితో దహించుకుపోతూ చనిపోవడానికి కారణమైన తల్లికీ శిక్ష తప్పలేదు. మన దేశంలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులకు సంబంధించిన వార్తలు తరచూ వెలుగు చూస్తున్నాయి. శునకాల గుంపు చిన్నారిపై ఎగబడి, ప్రాణం పోయేంత వరకు దాడి చేయడానికి తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి నిర్లక్ష్యమూ తోడవుతోంది. వీధికుక్కల బెడదను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికార యంత్రాంగానిదే. కాకపోతే, బాలల సంరక్షణకు సంబంధించిన బాధ్యత అందరిపైనా ఉంటుందని భావించాలి. 

అవగాహన కార్యక్రమాలు

అప్పుడే పుట్టిన పసికందును బాల్కనీ నుంచి విసిరేసిన ఘటనలో ఆ బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం, ఆడబిడ్డ పుట్టిందని బతికుండగానే పూడ్చిపెడితే, మట్టి కదలికను చూసి స్థానికులు వెలికితీసిన వైనం... ఇవి ఇటీవలికాలంలో మన దేశంలో చోటుచేసుకున్న సంఘటనలే! పుట్టగానే సొంతవారి చేతుల్లోనే ఘోరాలకు గురవుతున్న పసివారి హక్కులను కాపాడేదెవరు? ఈ దేశంలో పుట్టే ప్రతి శిశువూ జాతి సంపద, దేశ భవిష్యత్తు! ఊహ తెలియని చిన్నారుల పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకే కాదు- సమాజానికీ బాధ్యత ఉంది. జరగరానిది జరిగాక చింతించడం కంటే, ఎటువంటి ప్రమాదమూ జరగకముందే అప్రమత్తంగా ఉండటం మేలు. మంచి ఇల్లు, బాధ్యతాయుతమైన సమాజం, భద్రమైన దేశం... బాలల జన్మహక్కు. వారికి అందమైన బాల్యాన్ని అందించినప్పుడే, ఒక సమాజంగా మన బాధ్యత నెరవేర్చినట్లు. నోరులేని పసిపాపల గొంతుకోసే హక్కు ఎవరికీ లేదు. ఆధునిక సమాజం ఆటవిక మనస్తత్వంతో కాకుండా, మానవత్వంతో ముందడుగు వేయాలి. చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఆస్పత్రులు, అంగన్‌వాడీల ద్వారా పిల్లల భద్రతా చర్యలపై చైతన్యం పెంపొందించాలి. స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం సైతం ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే చిన్నారుల సంరక్షణ సులభతరమవుతుంది.

జయరాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.