ఆహార శుద్ధి... అవకాశాల పెన్నిధి!

దేశంలో ఆహారశుద్ధి రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో మెగా ఫుడ్‌పార్కులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహిస్తే రానున్న సంవత్సరాల్లో వ్యవసాయ పురోగతికి ఆహార శుద్ధి పరిశ్రమ చోదకశక్తి కాగలదు.

Published : 22 May 2024 00:14 IST

దేశంలో ఆహారశుద్ధి రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో మెగా ఫుడ్‌పార్కులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహిస్తే రానున్న సంవత్సరాల్లో వ్యవసాయ పురోగతికి ఆహార శుద్ధి పరిశ్రమ చోదకశక్తి కాగలదు.

భారత వ్యవసాయాభివృద్ధిలో ఆహారశుద్ధి రంగం కీలకంగా మారుతోంది. సాగు రంగం వృద్ధిపథంలో సాగడానికి, దేశంలో పెరుగుతున్న జనాభా ఆహార డిమాండును తీర్చడానికి ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగం మెరుగైన వృద్ధిరేటుతో పురోగమించాలి. ప్రస్తుతం ప్రపంచ ఆహార వాణిజ్యంలో భారత్‌ వాటా అంతంత మాత్రమే. తగిన శుద్ధి సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయోత్పత్తుల్లో 35శాతం దాకా వృథాగా పోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు సంకల్పించింది. వీటిద్వారా వ్యవసాయ క్షేత్రం నుంచి విపణి వరకు ఆహార శుద్ధి కోసం అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న 5-7 సంవత్సరాల్లో వ్యవసాయ వాణిజ్యంపై మెగా ఫుడ్‌పార్కుల ప్రభావం గణనీయంగా ఉంటుందని అంచనా. ఈ పార్కుల్లో ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక మౌలిక సదుపాయాలు, శుద్ధిచేసిన ఆహార ఎగుమతులను మరింత పెంచుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే పలు మెగా ఫుడ్‌పార్కులు ఏర్పాటయ్యాయి. ఇవి సాగులో వైవిధ్యాన్ని పెంచడానికి, వ్యవసాయ పద్ధతుల్లో  ప్రయోగాలకు దారిచూపుతున్నాయి. మెగా ఫుడ్‌పార్కుల్లో ఏర్పాటుచేసిన శీతల, ఇతర గిడ్డంగులు పంటల వృథాను తగ్గించడానికి దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తున్నాయి. కొవిడ్‌ అనంతరం అంతర్జాతీయంగా ప్రజల ఆహార పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకు అనుగుణంగా ఆహార సరఫరా గొలుసులు పునర్‌వ్యవస్థీకరణకు గురవుతున్నాయి. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెగా ఫుడ్‌పార్కులు ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. మెగా ఫుడ్‌పార్కు పథకంలో భాగంగా ఆహార శుద్ధి కోసం క్లస్టర్‌ ఆధారిత విధానాన్ని అమలుచేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల జోన్లలో కంపెనీల కన్సార్షియంతో ఫుడ్‌పార్కులు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి స్థాపనకు ఆహారశుద్ధి మంత్రిత్వ శాఖ కంపెనీలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ విధానం రైతులు, ప్రాసెసర్లు, రిటైలర్లను ఒకేచోట చేర్చడం ద్వారా- వ్యవసాయ ఉత్పత్తిని మార్కెట్‌కు అనుసంధానం చేస్తుంది. మెగా ఫుడ్‌పార్కు అనేది ఒకదానికొకటి సమీపంలో ఉన్న ఆహారశుద్ధి యూనిట్ల సమూహం. ఈ సమూహం సాధారణ మౌలిక సదుపాయాలను పంచుకుంటుంది. ఈ సౌకర్యాలలో శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, రవాణా సౌకర్యాలు ఉంటాయి. ఈ పథకం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా 24 మెగా ఫుడ్‌పార్కులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భారీగా ఉద్యోగావకాశాలు వచ్చాయి. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభిస్తోంది.

ఆహారశుద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం మెగా ఫుడ్‌పార్కు పథకం ఉద్దేశం. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు పెరుగుతుంది. పంట అనంతరం నష్టాలు తగ్గుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం పెరిగేందుకు అవకాశం కలుగుతుంది. భారత్‌ అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తుల్లో మెరుగ్గానే ఉన్నా, వాటికి విలువ జోడించే ప్రక్రియ తక్కువగానే ఉంటోంది. ఈ సమస్యను మెగాఫుడ్‌ పార్కులు చాలా వరకు తీరుస్తాయి. ఈ పథకం దేశ ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. పథకం ద్వారా పంట అనంతర నష్టాలను 20శాతానికి తగ్గించాలనేది లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న మెగాఫుడ్‌ పార్కులకు రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించడం ద్వారా వారి ఆదాయం పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ఏటికేడు పెరుగుతున్నాయి. ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులు సైతం అధికమయ్యాయి. మెగా ఫుడ్‌పార్కులను ఆయా పంటల జోన్లలో ఏర్పాటుచేయడం వల్ల రైతులకు ఉత్పత్తుల విక్రయం సులభమవుతుంది. మెగా ఫుడ్‌పార్కుల్లో రైతులు విక్రయించే ఉత్పత్తులకూ గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలి. ఆహారశుద్ధి రంగం అభివృద్ధి రైతుల ఆదాయం పెరగడానికి దోహదపడాలి.

డి.సతీష్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.