ఆంక్షల గుప్పిట అంతర్జాలం

ఆధునిక కాలంలో వ్యక్తుల జీవితాలు అంతర్జాలం చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నో ఉపాధులు సైతం దీనితో ముడివడి ఉన్నాయి. ఇంతటి కీలకమైన ఇంటర్నెట్‌ను తరచూ స్తంభింపజేసే విషయంలో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది! 

Updated : 23 May 2024 05:21 IST

ఆధునిక కాలంలో వ్యక్తుల జీవితాలు అంతర్జాలం చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నో ఉపాధులు సైతం దీనితో ముడివడి ఉన్నాయి. ఇంతటి కీలకమైన ఇంటర్నెట్‌ను తరచూ స్తంభింపజేసే విషయంలో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది!

అంతర్జాలం లేనిదే చాలామందికి ప్రస్తుతం పొద్దుగడవని పరిస్థితి నెలకొంది. వ్యాపారాలు, చాలా ఉద్యోగాలు ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యాయి. అల్లర్లు, హింసాకాండ చెలరేగినప్పుడు, ఇతర కారణాలతో ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో అధికార యంత్రాంగం తరచూ అంతర్జాలాన్ని నిలిపివేస్తోంది. నిరుడు దేశీయంగా ఆయా ప్రాంతాల్లో ఏకంగా 116 సార్లు ఇంటర్నెట్‌ను స్తంభింపజేశారు. ఇలా అకస్మాత్తుగా అంతర్జాలాన్ని నిలిపివేసే విషయంలో వరసగా ఆరో ఏడాదీ భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తరవాతి స్థానాల్లో నిలుస్తున్న మయన్మార్‌(37), ఇరాన్‌(34), పాలస్తీనా(16), ఉక్రెయిన్‌(8)లలో ఇండియా స్థాయిలో అంతర్జాలంపై ఆకస్మిక వేట్లు లేవు. 2016 నుంచి చూస్తే ప్రపంచవ్యాప్తంగా 1,458 సార్లు అంతర్జాలాన్ని నిలిపివేశారు. వీటిలో 773 ఉదంతాలు భారత్‌లోనే చోటుచేసుకున్నాయంటే, ఇంటర్నెట్‌పై ఎంతగా ఆంక్షలు రాజ్యమేలుతున్నాయో అర్థమవుతుంది. పైగా, ఏదో ఒక చిన్న ప్రాంతంలో కాకుండా పెద్ద విస్తీర్ణంలోని ప్రదేశంలో అంతర్జాలాన్ని తరచూ కొన్ని రోజుల పాటు నిలిపివేస్తుండటం దేశంలో పరిపాటిగా మారింది. దీనిపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డిజిటల్‌ హక్కుల కోసం పాటుపడే ‘ది కీప్‌ఇట్‌ ఆన్‌ కోఎలిషన్‌’ బృంద తాజా నివేదిక ప్రకారం నిరుడు ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 283 సార్లు అంతర్జాలాన్ని స్తంభింపజేశారు. 2016 నుంచి ఇదే అత్యధికం. 2022తో పోలిస్తే ఇవి 41శాతం ఎక్కువ. కెన్యా, మొజాంబిక్, నేపాల్, సురినామ్‌లలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే నిరుడు రెట్టింపు సార్లు అంతర్జాలాన్ని నిలిపేశారు. పాలస్తీనా మొదలు మయన్మార్, సూడాన్, ఉక్రెయిన్‌లలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాలంపై ఆంక్షలు విధించడం ద్వారా దమనకాండకు పాల్పడుతున్నవారు వాస్తవ పరిస్థితులు బయటకు తెలియకుండా నిలువరిస్తున్నారు. తద్వారా తమ వికృత క్రీడకు బోనులో నిలవాల్సిన అవసరం లేకుండా వారు తప్పించుకుంటున్నారని తాజా నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది.  
ఇండియాలో అయిదు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఇంటర్నెట్‌ను స్తంభింపజేసిన ఘటనలు 2022లో 15శాతం ఉంటే, నిరుడు అవి ఎకాయెకి 41శాతానికి ఎగబాకాయి. మణిపుర్‌లో అల్లర్లను సాకుగా చూపి సుదీర్ఘకాలం అంతర్జాలాన్ని స్తంభింపజేశారు. 32 లక్షల మంది దానివల్ల ప్రభావితమయ్యారు. పంజాబ్‌లోనూ రోజుల తరబడి ఇంటర్నెట్‌ లేక 27 లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. 2022తో పోలిస్తే గత సంవత్సరం జమ్మూ కశ్మీర్‌లో అంతర్జాలాన్ని నిలిపివేసిన ఘటనలు 49 నుంచి 17కు దిగిరావడం కాస్త ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం ఉపాధులు, ఉద్యోగాలు అంతర్జాలంతో అనుసంధానమై ఉన్నాయి. ఉన్నట్టుండి ఇంటర్నెట్‌ను ఆపేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి. దేశార్థికానికీ తీవ్ర నష్టం తప్పదు. ఒక్కరోజు అంతర్జాలాన్ని స్తంభింపజేయడం వల్ల భారత్‌లో 379 మంది నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని తాజా నివేదిక తెలియజెప్పింది. ఇంటర్నెట్‌పై ఆంక్షల వల్ల గతేడాది తొలి అర్ధభాగంలోనే ఇండియా దాదాపు రూ.16 వేల కోట్ల మేర నష్టపోయిందని, సుమారు వెయ్యి కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించింది. నిరుడు ఇండియాలో ఒక జిల్లా కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూభాగంలో ఏకంగా 64 సార్లు అంతర్జాలాన్ని నిలిపివేశారు.

నిబంధనల ప్రకారం భారతదేశంలో ఆత్యయిక పరిస్థితి తలెత్తినప్పుడు ఒక ప్రాంతంలో 15 రోజుల వరకు అంతర్జాలాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. అయితే, ఇంటర్నెట్‌పై వేటుకు సంబంధించిన కారణాలను సరిగ్గా నిర్వచించలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం గతంలో ఆక్షేపించింది. అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల పేరుచెప్పి అంతర్జాలాన్ని ఆపివేయడం వల్ల స్థానికంగా ఏమి జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండటంలేదని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపుర్‌లో అంతర్జాలంపై సుదీర్ఘ ఆంక్షల వల్ల అక్కడ మహిళలపై జరిగిన దారుణ అకృత్యాలు వెంటనే వెలుగులోకి రాలేదు. అల్లర్లు తలెత్తిన ప్రాంతాల్లో పాలకులు పోలీసులను, సాయుధ దళాలను మోహరించడం ద్వారా సాధారణ పరిస్థితులు సత్వరమే నెలకొనేలా చూడాలి. ఉన్నపళంగా అంతర్జాలాన్ని నిలిపివేయడాన్ని పరిహరించాలి.

ఎం.వేణు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.