గాలి మాటలకు లోటు లేదు!

‘సార్‌... ఇదిగో సారూ... ఏవండోయ్‌ మాజీ గారూ...’ ‘ఏమిటి... ఎవరు నన్ను మాజీ అని పిలుస్తున్నది?’ ‘నేనే సార్‌! మీ గదిలో ఫ్యానుని... మీ డ్యామేజీకి ఇక మిగిలింది మాజీ అనే పేరే కానీ... కాస్త ఆ ఏడుపు ఆపుతారా... మీ కన్నీళ్లకు ఇప్పటికే గది నిండిపోయి, వైర్లు తడిచిపోయి, కరెంటు పోయింది.

Published : 06 Jun 2024 00:33 IST

‘సార్‌... ఇదిగో సారూ... ఏవండోయ్‌ మాజీ గారూ...’
‘ఏమిటి... ఎవరు నన్ను మాజీ అని పిలుస్తున్నది?’
‘నేనే సార్‌! మీ గదిలో ఫ్యానుని... మీ డ్యామేజీకి ఇక మిగిలింది మాజీ అనే పేరే కానీ... కాస్త ఆ ఏడుపు ఆపుతారా... మీ కన్నీళ్లకు ఇప్పటికే గది నిండిపోయి, వైర్లు తడిచిపోయి, కరెంటు పోయింది. ఇంకా ఎక్కువైతే మనిద్దరమూ మునిగిపోతాం, ఆపండి’
‘ఎలా ఆపను? ఎలా ఆపగలను? ఎంత వెక్కివెక్కి ఏడ్చినా తనివితీరని శోకమిది... కలలోనూ ఊహించని ఫలితమిది... అసలేం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి, వ్వావ్వావ్వా...!!!’
‘ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు కదా... వారికి తెలుసు కాబట్టే మీలాగే వాళ్లూ బటన్‌ నొక్కారు, అదే మీకు ఎగ్జిట్‌ బటన్‌!’
‘అంటే?’
‘అబ్బ... పరీక్ష పాసవ్వని రెండోక్లాసు పిల్లాడిలా అమాయకంగా ఫేసు పెట్టి అలా అడిగితే ఎవ్వరూ జాలి పడిపోరు. మంచి చేశాను అని మీకు మీరు అనుకుంటే అయిపోతుందా?’
‘అవ్వదా?’
‘అవ్వకే కదా ఏడుస్తున్నారు!’  
‘అసలు నేనేం చేశాను ఫ్యాను...?’
‘ఏం చేయలేదనే అంటున్నా!’
‘పోనీ ఏం చేయలేదో చెప్పు?’
‘మద్యపాన నిషేధం అన్నారు... చేశారా?’
‘లేదు’
‘సీపీఎస్‌ రద్దు అన్నారు, చేశారా?’
‘లేదు’
‘పోలవరం పూర్తి అన్నారు, చేశారా?’
‘లేదు’
‘రోడ్లు వేశారా? కనీసం గుంతలైనా పూడ్చారా?’
‘లేదు’
‘మరి ఇంత ముఖ్యమైన హామీలను, పనులను పక్కనపెట్టి ఇంకా వందశాతం హామీలు అమలు చేశాం, వంకాయ పచ్చడి చేశాం అని అడ్డదిడ్డంగా చెప్పుకోవడానికి మీకు నోరెలా వస్తుంది?’
‘అంటే అది...’  
‘అయినా అదంతా పక్కన పెట్టండి, అసలు నా మానాన నేను సీలింగ్‌కి చల్లగా తిరుక్కుంటూ కాలక్షేపం చేస్తుంటే ఎవడండీ మిమ్మల్ని గుర్తుగా నన్ను తీసుకోమన్నాడు?’
‘ఏం... ఏమైంది?’
‘ఏమైంది అని నెమ్మదిగా అడుగుతారేంటి... ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచి ఏ బండికి చూసినా నేనే... తాడుకట్టి రోడ్డు మీద ఈడుస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. మీవల్ల, మీ పార్టీ నిర్వాకాల వల్ల నా పరువంతా పోయింది.. పైగా మీ తుగ్లక్‌ పాలనకు గుర్తులుగా రోడ్లన్నీ రాళ్లు తేలి ఉన్నాయి. వాటి మీద విసిరికొడుతుంటే రెక్కలు విరిగిపోయి ఒళ్లు హూనమైపోయింది... అంతా మీవల్లే’
‘నీకూ నాకూ పెద్ద తేడా ఏమీ లేదు ఫ్యాను... నీకు తగిలిన దెబ్బలు పైకి కనిపిస్తున్నాయి అంతే. నాకు తగిలిన దెబ్బ మాత్రం మామూలుది కాదు, ప్రజలు చాలా తెలివిగా, ఎక్కడ కొట్టాలో అక్కడ ఓ పద్ధతి ప్రకారం కొట్టారు!’
‘మరి కొట్టరా? ఏం పీకలేరు, గీకలేేరు అన్నారు కదా... అందుకే మిమ్మల్నే పీకి పక్కనపెట్టారు. ఇక తాడేపల్లి ప్యాలెస్‌ తలుపులు మూసేసి, బెంగళూరు ప్యాలెస్‌కి పోయి బజ్జోండి’
‘నువ్వు మరీ అంత హార్ష్‌గా మాట్లాడకే ఫ్యాను, హర్టవుతాను!’
‘మాట్లాడకే నా? మర్యాద, మర్యాద ముఖ్యం మాజీ గారూ! నిన్నటివరకు వాడూ వీడూ అన్న కూటమి నేతలను గారూ అంటూ పిలిచారుగా! నాకు కూడా అలాగే మర్యాద ఇవ్వండి. లేదంటే నేనూ ప్రజల్లాగే విప్లవాత్మకంగా, విచక్షణతో ఆలోచించి మీ నెత్తిమీద దబ్బున పడిపోగలను, జాగ్రత్త!’
‘ఛ... ఓటమిపాలయ్యే సరికి ఆఖరికి నీకు కూడా చులకన అయిపోయానా నేను?’
‘ఓటమి అని మామూలుగా అంటారేంటి, అదేమైనా సాదాసీదా ఓటమా? చరిత్రలో ఏ నాయకుడూ చూడని, ఎన్నడూ కనీవినీ ఎరుగని, ఘోరాతిఘోరమైన...’
‘ఇక చాలు ఆపు, నీ వర్ణనకే ఏడుపు ఇంకా తన్నుకొచ్చేస్తోంది’
‘హ్హహ్హ... అయినా చేసినదంతా చేసి మళ్ళీ నాదేం తప్పో తెలియడం లేదు అంటూ ఎందుకండీ ఆ దొంగ ఏడుపులు?’
‘నేనేం చేశాను ఫ్యాను?’
‘అదిగో మళ్ళీ... రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేశారా?’
‘అదీ...’
‘శాంతిభద్రతలను గాలికొదిలేశారా?’
‘మరీ...’
‘కాస్త గట్టిగా మాట్లాడినవాళ్లను లాఠీలతో కుళ్ళబొడిపించారా?’
‘అదీ... అదీ...’
‘ఇసుకను మేసేశారా... మట్టిని బుక్కేశారా’
‘అదీ... మరీ...’
‘పన్నుల భారంతో ప్రజల్ని వేధించారా?’
‘అంటే...’
‘సంపద సృష్టించకుండా, అప్పుల కుంపటి పెట్టారా...’
‘మరేమో...’
‘మాట్లాడకండి. ఇన్ని చేసి మళ్ళీ నేనేం చేశాను అంటే నమ్మడానికి ప్రజలేమీ నోట్లో వేలేసుకునే పాపాయిలు కాదు, ఓటుతో వేటేసే నిర్ణయాధికారులు. అందుకే మీ అధికారానికి చిల్లిపడి, అహంకారానికి గండి పడింది’
‘మరి ఇకపై ఏం జరుగుతుంది?’
‘ఏముంది... విధ్వంసం నుంచి విముక్తి దిశగా, విద్వేషం నుంచి విప్లవాత్మక మార్పుల దిశగా రాష్ట్రం పయనిస్తుంది. ఇక మీ పార్టీ సంగతంటారా... దాని గతేమిటో, మీ భవిష్యత్తేమిటో మీ ఊహకే వదిలేస్తున్నా’
‘అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్‌?’
‘చేయడానికి ఏముంది... తూర్పునకు తిరిగి దండం పెట్టండి.. బోరుకొడితే గోళ్లు గిల్లుకోండి’
‘అంతేనా...’
‘చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని... అంతే ఇక!’

చంద్రమౌళిక సాపిరెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.