ఆ నరక కూపాల్లో... బాల్యం!

తప్పుదారి పట్టిన బాలలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జువెనైల్‌ కేంద్రాల లక్ష్యం. అయితే, వాటిలో దారుణ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు మృగ్యమై అవి నరకానికి నకళ్లుగా తయారయ్యాయి.

Published : 07 Jun 2024 01:23 IST

తప్పుదారి పట్టిన బాలలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జువెనైల్‌ కేంద్రాల లక్ష్యం. అయితే, వాటిలో దారుణ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు మృగ్యమై అవి నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. ఈ క్రమంలో వాటి నుంచి పిల్లలు తప్పించుకొనిపోతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.

భారతదేశ జనాభాలో మూడింట ఒక వంతు 18 ఏళ్ల లోపు వారే. ఇండియా భవిష్యత్తు నిర్ణేతలైన ఈ బాలల్లో 40శాతం కష్టనష్టాలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, మురికి వాడలు, మాదక ద్రవ్యాలు, ఆధునిక సాంకేతికతలు, కుటుంబ పరిస్థితులు వంటివి బాలలను నేరాలవైపు పురిగొల్పుతున్నాయి. దాంతో బాలనేరస్తుల సంఖ్య పెరుగుతోంది. వీరి సంస్కరణ కోసం ఏర్పాటైన జువెనైల్‌ కేంద్రాలు భారతీయ బాల న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. గాడి తప్పిన పిల్లలకు మెరుగైన వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పించి, వారికి అవసరమైన నైపుణ్యాలను అందించి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం వీటి లక్ష్యం. ప్రస్తుతం దేశంలో అనేక జువెనైల్‌ కేంద్రాల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా అనేక బాలల సంస్కరణ కేంద్రాలు ఇప్పటికీ చట్టం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పాటించడం లేదు. 

దేశంలో మొత్తం 817 జువెనైల్‌ హోములు ఉన్నాయి. వీటిలో చాలా వరకు బాల ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం 2021లో దేశీయంగా ముప్ఫై ఒక్క వేల మంది బాల నేరస్థులు నమోదయ్యారు. ఏటా వీరి సంఖ్య అయిదు శాతం మేర వృద్ధి చెందుతోంది. కిక్కిరిసిన పరిస్థితుల్లో ప్రతి బిడ్డకు వాటిలో వ్యక్తిగతమైన సంరక్షణ, శిక్షణ, పోషణ సాధ్యం కావడం లేదు. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం 2015 ప్రకారం బాల నేరస్థులకు కనీస రక్షణ, భద్రతను అందించాల్సిన బాధ్యత  ప్రభుత్వానిది. ఈ చట్టం పేర్కొన్న రెండు రకాల పిల్లలకు వారి నేర స్వభావ స్థాయిని అనుసరించి తగిన సంరక్షణ అందించాల్సి ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల ఇది అమలు కావడం లేదు. 

చాలా జువెనైల్‌ హోముల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు, మానసిక ఉల్లాసం కోసం వినోదం, నాణ్యమైన విద్యా వనరులు కరవయ్యాయి. కొన్నిచోట్ల స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్‌ వంటివీ లేవు. ఇతర వ్యవస్థల మాదిరిగానే వీటిలోనూ గార్డులు, కౌన్సెలింగ్‌ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సగటున 500 మంది బాలలకు ఒక్క ప్రొబేషన్‌ అధికారి మాత్రమే ఉన్నారు. ఉన్నవారిలోనూ అధిక శాతానికి సరైన శిక్షణ లేదు. జువెనైల్‌ హోమ్‌లలో పిల్లల బాగోగులు చూసుకొని సంస్కరించాల్సిన సిబ్బందే వారిని శారీరకంగా, మానసికంగా వేధించిన సంఘటనలు అనేకం బయట పడుతున్నాయి. వెలుగుచూడనివి ఇంతకు ఎన్నో రెట్లు ఉంటాయి. చాలా జువెనైల్‌ హోమ్‌లలో బాలల పునరావాసానికి దారిచూపే విద్యా, వృత్తి, శిక్షణ కార్యక్రమాలు సరిగ్గా అమలుకావడం లేదు. మొక్కుబడి కార్యక్రమాలే గానీ నేటి కాలానికి, సమాజ అవసరాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ వారికి ఆమడ దూరంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో బాలల సంస్కరణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు వెంటనే గట్టి పూనిక వహించాలి. వాటిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తగిన నిధులు, వనరులను కేటాయించాలి. 

జువెనైల్‌ కేంద్రాల్లో పిల్లలకు విద్యా, సాంకేతిక శిక్షణతో పాటు శారీరక, మానసిక వినోద సంబంధిత సౌకర్యాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. శిక్షణ పొందిన సిబ్బందిని తగిన సంఖ్యలో నియమించాలి. సంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే కాకుండా ఆధునిక విధానాల్లో శిక్షణ కార్యక్రమాలు, తగిన కోర్సులు అందించాలి. చిన్నపిల్లల మనస్తత్వశాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో వారికి నిరంతర కౌన్సెలింగ్‌ అందించాల్సిన అవసరం ఉంది. ప్రతి జువెనైల్‌ హోమ్‌ చట్టం నిర్దేశించిన ప్రమాణాలు, మార్గదర్శకాలకు కట్టుబడి పనిచేసేలా స్వతంత్ర సంస్థలతో నిరంతరం తనిఖీలు చేయించాలి. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛంద, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో బాలల సంస్కరణ కేంద్రాలకు అవసరమైన వనరులను అందించాలి. వీటన్నింటిద్వారా వాటిలోని పిల్లలను ఉన్నత పౌరులుగా మలచడానికి అవకాశం ఉంటుంది.

చిన్నారావు చిటికెల 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు