తక్షణ కర్తవ్యం

ఇది దీక్షాసమయం. అనుభవానికి సామర్థ్యానికి పరీక్షా సమయం. భీకర బాంబుదాడులకు సర్వనాశనమైన జపాన్‌- అదే బూడిద రాశుల్లోంచి భూతలస్వర్గాన్ని తిరిగి నిర్మించుకున్న తీరు ఏపీ ప్రజలకిప్పుడు ఆదర్శప్రాయం.

Published : 07 Jun 2024 01:23 IST

ఇది దీక్షాసమయం. అనుభవానికి సామర్థ్యానికి పరీక్షా సమయం. భీకర బాంబుదాడులకు సర్వనాశనమైన జపాన్‌- అదే బూడిద రాశుల్లోంచి భూతలస్వర్గాన్ని తిరిగి నిర్మించుకున్న తీరు ఏపీ ప్రజలకిప్పుడు ఆదర్శప్రాయం. అంతులేని అవినీతితో కళంకితమైన ఆంధ్రప్రదేశ్‌కు అందరూ చేతులు కలిపి సాంత్వన చేకూర్చవలసిన సందర్భమిది. పూర్వ వైభవాన్ని సాధించి తీరాల్సిన సమయమిది.

రమ అసమర్థ పాలకుల నియంతృత్వ పోకడలతో, మూర్ఖపు చర్యలతో, దురహంకార ప్రదర్శనలతో గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ప్రగతి, పురోగతి అనే మాటలను మరిచేపోయింది. వాటి విషయంలో కనీసం ఇరవై ఏళ్లు వెనక్కిపోయింది. ఇంతకాలంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం, నాటుబాంబుల సంస్కృతి, హింస, రక్తపాతం, ఆటవిక ప్రవృత్తి, పగలు ప్రతీకారాలు- ఇప్పుడు ప్రతి ప్రాంతానికీ విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ప్రశాంతతకు ఆలవాలమైన పచ్చని సీమలు సైతం పగలు ప్రతీకారాలతో ఇప్పుడు భగ్గున మండుతున్నాయి. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైంది. నాగరికత మురికికాల్వల్లో కలిసిపోయింది. భాషే మారిపోయింది. తెలుగుతల్లి భాగ్యరేఖను సక్రమంగా దిద్దితీర్చాలని జనతాజనార్దనుడు సంకల్పించాడు. ఆ సంకల్పమే ప్రజాతీర్పుగా ప్రపంచం ఎదుట ఆవిష్కృతమైంది. రక్కసి మూకలను రాకాసి రాబందులను థగ్గులు పిండారీలను మించిన భయంకర దోపిడిదారులను రాష్ట్రం పొలిమేరలకు తరిమికొట్టింది. చట్టసభలో ప్రతిపక్ష నేతృత్వం సైతం దక్కని చరిత్రహీనులుగా మార్చింది. ప్రజాక్షేత్రంలో దుర్మార్గానికి దుష్ట సంస్కృతికి చోటు లేదని- ఇది ఎప్పటికీ ధర్మక్షేత్రమే అనే విస్పష్టమైన సందేశాన్ని ఎంతో నిశ్శబ్దంగా నిర్ద్వంద్వంగా అహింసామార్గంలో నిరూపించింది. దక్షతకు పట్టం కట్టింది. 

ప్రస్తుత రాష్ట్ర దుస్థితిని సమీక్షిస్తే ఆలోచనాపరులు ఎవరైనా దుఃఖం ముంచుకొస్తుంది. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టులోకి వెళ్ళిపోయాయి. ప్రజాభవనాలన్నీ పరాధీనమైపోయాయి. పార్కులు పాఠశాలలు బస్టాండులు ప్రకృతి వనరులు... ఒకటేమిటి పంచభూతాలు సైతం పరుల పంచన బందీలయ్యాయి. అన్నింటికన్నా ముఖ్యం- ప్రజల పది పదిహేనేళ్ల భవిష్యత్తు ఇప్పుడు తాకట్టులో ఉన్నమాట పచ్చినిజం. గతమంతా బాకీల్లో మునిగిపోయింది. వర్తమానం దివాలాతీసింది. రోజు గడవని ఆర్థిక పరిస్థితి ఏపీని అతలాకుతలం చేసింది. రాష్ట్రానికి రాజధాని మాత్రమే లేదనుకొంటున్నాం... కాదుకాదు ఇక మనకేం మిగల్లేదు. అయినాసరే, రేపనేది ఒకటుంది. కచ్చితంగా ఉంది. ఎన్నికల్లో ప్రజలు ప్రదర్శించిన పరమాద్భుత వివేకానికి చతురతకు పరిణతికి నిదర్శనంగా కారుచీకట్లో కాంతిరేఖ మెరిసింది. చంద్రోదయమైంది. దానికి శీతలపవనం తోడైంది. ఈ రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం అతి త్వరలో దక్కుతుందని చెప్పడానికి మరో బలమైన కారణం ఉంది. హస్తిన చాణక్యుడికి అమరావతి చంద్రగుప్తుడు ఆసరాగా నిలిచే అవకాశం దొరికింది. ఇది అనుకోని అదృష్టం! ప్రస్తుతం తెలుగు ప్రజలు- కృష్ణుడి అండను దక్కించుకొన్న పాండవులు. మాయాజూదంలో మోసపోయిన పాండవుల మాదిరే- అయిదేళ్ల క్రితం ఆంధ్రులు దారుణంగా మోసపోయారు. జూదం తరవాత కృష్ణుడు రంగంలోకి దిగి పాండవులను ఆదుకొన్నట్లే- ఇప్పుడు హస్తిన గోపాలుడు సైతం అభయహస్తం అందించడానికి సిద్ధపడ్డాడు. ఇక పని చక్కదిద్దడం పాండవుల వంతు. రాజసూయమే చేస్తారో... అశ్వమేధమే నిర్వహిస్తారో- ఎలాగైనా ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించాలి. భాషా సంస్కృతులు, జీవన విధానం, నాగరికత మళ్ళీ బాగుపడాలి. ప్రజలు ఈ బూతులోంచి, రోతలోంచి బయటపడి నీతిమంతమైన మనుగడ దిశగా నడక ఆరంభించాలి. బతుకు బండి తిరిగి పట్టాలెక్కాలి. ప్రజల పెదవులపై చిరునవ్వులు చివురించాలి. పాలకులు ప్రజల కళ్లలో ఆనందాన్ని చూడాలి. జనం మీకు అధికారాన్ని అందించింది, అందలం ఎక్కించింది- అందుకూ! జనచైతన్యాన్ని పోగేసి పోతపోస్తే- అదే జనతాజనార్దనుడి రూపం. అది దైవస్వరూపం. ఆ దైవం రాసిన రాతే- అసలుసిసలు దేవుడి స్క్రిప్టు. దాని ప్రతిరూపమే- ప్రజాతీర్పు!

పాండవులను ఆదుకోవడం- వాస్తవానికి కృష్ణుడి అవసరం. తన అవతార లక్ష్యం నెరవేరాలంటే వారిని ఆయుధాలుగా వాడుకోవాలి కనుక- ధార్మికులైన పాండవులకు తోడుగా నిలబడ్డాడు. కృష్ణుడి అవసరాన్ని సొమ్ముచేసుకొని పాండవులు బాగుపడ్డారు. రాజధాని, పోలవరం వంటివి సాధించుకొని ఆంధ్రులు బాగుపడతారు. పడాలి! ఈ ప్రజాభిమతానికి నూతన పాలకులు ఎలానూ బాధ్యత వహిస్తారు. ఆర్థిక పారిశ్రామిక సామాజిక ప్రగతికి కృషి చేస్తారు సరే- ఆ క్రమంలో కొన్ని జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది. 

అదేపనిగా ప్రజాధనాన్ని దోచుకుతిన్నవారు, అనునిత్యం అవినీతిలో మునిగి తేలినవారు, అక్రమ మార్గాల్లో దుర్మార్గంగా కోట్లు కొల్లగొట్టినవారు... వీరెవరినీ రాజకీయ ప్రత్యర్థులుగా కాదు- కరుడుగట్టిన నేరస్థులుగా పరిగణించాలి. కోర్టు బోనులో నిలబెట్టాలి. దక్షతతో నేర నిరూపణ చేసి చట్టబద్ధంగా శిక్షించాలి. ఒకరితో ఒకరు పోటీపడి ఇసుక మద్యం మట్టి కొండా కోనా... చివరకు శ్మశానాలను సైతం విడిచిపెట్టకుండా అడ్డగోలుగా దోచుకొన్న అక్రమార్జన మొత్తం కక్కించి బొక్కసానికి చేర్చాలి. ఎందుకంటే, అది ప్రజాధనం. దానికి ధర్మకర్తలుగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు దోపిడిదారులుగా మారిపోయిన వైనాలు మనం ఎన్నో చూశాం. అలాంటివారిని కటకటాల్లోకి, వారి అక్రమ సంపాదన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలోకి మళ్ళించగలిగితే- ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధి కార్యక్రమాలకు దివ్యంగా సరిపోతుంది. గట్టిగా మాట్లాడితే రాష్ట్ర బడ్జెట్‌ను దాటిపోతుంది. ఆ భారీ దోపిడి సొత్తుతో- ఏపీ మిగులు రాష్ట్రంగా మారుతుంది. ప్రజల తీర్పు విషయంలో న్యాయం జరుగుతుంది. అదే ప్రస్తుతం... తక్షణ కర్తవ్యం!

వై.శ్రీలక్ష్మి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.