కేంద్రానికి మిగులు సాయం

తన వద్ద ఏర్పడిన మిగులును భారత రిజర్వు బ్యాంకు డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. గడచిన ఆరేళ్లలో అత్యధిక మొత్తాన్ని ఈ ఏడాది  అందించనుంది. కొత్త ప్రభుత్వానికి ఇది ఎంతగానో అక్కరకొస్తుంది.

Published : 09 Jun 2024 01:47 IST

తన వద్ద ఏర్పడిన మిగులును భారత రిజర్వు బ్యాంకు డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. గడచిన ఆరేళ్లలో అత్యధిక మొత్తాన్ని ఈ ఏడాది  అందించనుంది. కొత్త ప్రభుత్వానికి ఇది ఎంతగానో అక్కరకొస్తుంది.

భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను సమర్పించనుంది. ప్రభుత్వ ఆదాయంకన్నా వ్యయం ఎక్కువైనప్పుడు ఏర్పడే ద్రవ్య లోటును చాలావరకు పూడ్చడానికి ఈ డివిడెండ్‌ ఉపయోగపడుతుంది. 2018-19 తరవాత ఆర్‌బీఐ పెద్ద మొత్తాన్ని డివిడెండ్‌గా ప్రభుత్వానికి అందించడం ఇదే ప్రథమం. 2018-19లో ఆర్‌బీఐ ఇచ్చిన డివిడెండ్‌ రూ.1.76 లక్షల కోట్లు. ఆర్‌బీఐకి వివిధ మార్గాల్లో ఆదాయం పెరిగినప్పుడు అధిక డివిడెండ్‌ చెల్లించడం వీలవుతుంది.

అంచనాకు మించి...

స్వదేశీ, విదేశీ సెక్యూరిటీల నుంచి ఆర్‌బీఐకి వడ్డీ రూపంలో అధిక ఆదాయం సమకూరడం వల్ల ఎక్కువ డివిడెండ్‌ను చెల్లించగలుగుతోందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక వెల్లడించింది. బ్యాంకుల వద్ద ఎక్కువ నగదు పేరుకుపోయినప్పుడు ఆ అదనపు నిధులను స్టాండర్డ్‌ డిపాజిట్‌ పథకం (ఎస్‌డీఎఫ్‌)లో జమ చేయాలని ఆర్‌బీఐ ఆదేశిస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడికి ఇది ఉపకరిస్తుంది. గడచిన 365 రోజుల్లో 259 రోజులపాటు ఆర్‌బీఐ ఇలా అదనపు నిధులను స్వీకరిస్తూనే ఉంది. బంగారం ధర పెరగడం వల్ల ఆర్‌బీఐ పుత్తడి నిల్వల విలువ పెరిగి అధిక డివిడెండ్‌ చెల్లింపునకు తోడ్పడింది. ఆర్‌బీఐతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్థిక సంస్థలు, ఆర్థికేతర ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి ఈ సంవత్సరం రూ.1.5 లక్షల కోట్ల డివిడెండ్‌ వస్తుందని కేంద్రం అంచనా వేసుకుంది. ఆశించినదానికన్నా 40శాతం ఎక్కువ డివిడెండ్‌ వచ్చింది. ఇది ఏయే మార్గాల్లో లభించిందో ప్రభుత్వం ఇంకా వివరించాల్సి ఉంది. విదేశీ ఆస్తులపై ఎక్కువ ఆదాయం వచ్చిందని స్పష్టమవుతోంది. 2025 మార్చితో అంతమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో 5.1శాతం లోటు ఏర్పడుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది. ఆదాయంకన్నా వ్యయం ఎక్కువైన ఫలితమిది. ఆర్‌బీఐ నుంచి లభించిన అధిక డివిడెండ్‌తో ఈ లోటును తగ్గించుకోవచ్చు. 2026కల్లా లోటును జీడీపీలో 4.5శాతానికి తగ్గించాలని కేంద్రం లక్షిస్తోంది. ఆర్‌బీఐ నిధులు ఇందుకు అక్కరకొస్తాయి. ఆర్‌బీఐ చెల్లిస్తున్న డివిడెండ్‌ భారత జీడీపీలో 0.6శాతానికి సమానం. 2025 బడ్జెట్లో ఈ డివిడెండ్‌ 0.3శాతంగా ఉంటుందని అంచనా వేసినా- చివరకు అంతకు రెట్టింపు నిధులు అందబోతున్నాయి. లోటును తగ్గించుకోవడంతో పాటు ఆదాయ వృద్ధికి తోడ్పడే ఆర్థిక సంస్కరణలను చేపడితే భారత్‌ రుణ రేటింగ్‌ పెరుగుతుంది.

ఎన్నికల తరవాత కొత్త ప్రభుత్వం సమర్పించబోయే బడ్జెట్లో ఆర్బీఐ డివిడెండ్‌ను రోడ్లు, రేవులు, విద్యుత్‌ కేంద్రాల వంటి మౌలిక వసతుల నిర్మాణ, విస్తరణలకు ఉపయోగించవచ్చు. దీనివల్ల ద్రవ్య లోటు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగినా దేశ ఆర్థిక ప్రగతికి మున్ముందు గట్టి పునాది పడుతుంది. లేదంటే ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ తదితర మార్గాల్లో ఆశించిన ఆదాయం లభించకపోయినా, అనుకోని ఖర్చులు మీదపడినా తట్టుకోవడానికి ఆర్‌బీఐ అదనపు నిధులు ఉపయోగపడతాయి. జీడీపీ లోటును 5.1శాతంకన్నా తక్కువగా ఉంచడానికీ ఇవి ఉపకరిస్తాయి. ఏతావతా ఆర్‌బీఐ నిధుల వినియోగానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అనేదాన్నిబట్టి కొత్త ప్రభుత్వ మధ్యకాలిక ఆర్థిక ప్రాధాన్యాలేమిటో తెలుసుకోవచ్చు. 

భవిష్యత్తులోనూ ఇలాగేనా?

ఆర్‌బీఐ నిధులతో ద్రవ్య లోటును తగ్గించుకుంటే భారత ప్రభుత్వ రుణ పరపతి మెరుగుపడుతుంది. దీనివల్ల ద్రవ్య లోటు జీడీపీలో 0.3శాతానికి పరిమితమవుతుందని సిటీ రీసెర్చ్‌కు చెందిన సమీరన్‌ చక్రవర్తి అంచనా వేశారు. అదే జరిగితే బాండ్‌ మార్కెట్లకు దన్ను లభిస్తుంది. లేదా మౌలిక వసతుల నిర్మాణ, విస్తరణలకు ఆర్‌బీఐ నిధులను ఉపయోగిస్తే జీడీపీ పెరుగుతుంది. ఆయా పథకాలపై అధిక నిధులను ఖర్చుచేస్తే దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు, దానితోపాటే అభివృద్ధికి ఊతం లభిస్తుంది. దీన్ని షేర్‌ మార్కెట్‌ స్వాగతిస్తుంది. భవిష్యత్తులోనూ ఆర్‌బీఐ అధిక డివిడెండ్‌ను అందిస్తుందా అన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భారతీయ కరెన్సీ విలువలో వచ్చే హెచ్చు తగ్గులు, రిజర్వు బ్యాంకు వద్దనున్న ఆస్తులపై వచ్చే లాభాలు డివిడెండ్‌ను నిర్ణయిస్తాయి. ఆర్‌బీఐ తన వద్ద ఎంతమేరకు బఫర్‌ నిధులను ఉంచుకొంటుందనే అంశమూ ప్రాధాన్యం వహిస్తుంది. ఏది ఏమైనా ఆర్‌బీఐ డివిడెండ్లు ఇకముందూ అధిక స్థాయిలో కొనసాగుతాయనే నమ్మకం లేదని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.  

సుతానుకా ఘోషాల్‌ 
(ఆర్థిక, సామాజిక విశ్లేషకులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.