Rahul Gandhi: పడిలేచిన కాంగ్రెస్‌ కెరటం

కేంద్రంలో అధికారం కోల్పోయి, అనేక రాష్ట్రాల్లోనూ చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ- తాజా ఎన్నికల ఫలితాలతో నూతనోత్తేజం నింపుకొంది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా, భవిష్యత్తు తమదేనన్న ధీమాను పార్టీ శ్రేణుల్లో నింపగలిగింది. పార్టీకి, ఇండియా కూటమికి జవసత్వాలు సంతరింపజేయడంలో రాహుల్‌ గాంధీ కీలకంగా మారారని కాంగ్రెస్‌ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.

Published : 10 Jun 2024 01:32 IST

కేంద్రంలో అధికారం కోల్పోయి, అనేక రాష్ట్రాల్లోనూ చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ- తాజా ఎన్నికల ఫలితాలతో నూతనోత్తేజం నింపుకొంది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా, భవిష్యత్తు తమదేనన్న ధీమాను పార్టీ శ్రేణుల్లో నింపగలిగింది. పార్టీకి, ఇండియా కూటమికి జవసత్వాలు సంతరింపజేయడంలో రాహుల్‌ గాంధీ కీలకంగా మారారని కాంగ్రెస్‌ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్‌కు, ఆ పార్టీ సారథ్యంలోని ఇండియా కూటమికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొత్త ఊపిరులూదాయి. అగ్రనేత రాహుల్‌గాంధీ తన ఎన్నికల ప్రచారంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, బలహీనవర్గాల హక్కులను కాపాడుకోవడం అవసరమని నొక్కి చెప్పారు. భిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఇండియా కూటమిని బలోపేతం చేయడం ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. దేశంలోని అనేక ప్రాంతాల గుండా రాహుల్‌ చేపట్టిన యాత్రలవల్లే కాంగ్రెస్‌ విజయావకాశాలు గణనీయంగా పెరిగాయన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. యూపీఏ కూటమి 2014లో అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్‌ బలం అత్యంత కనిష్ఠంగా 44 సీట్లకు దిగజారిపోయింది. 2019 ఎన్నికల్లోనూ పెద్దగా మెరుగుపడలేకపోయింది. నాడు 52 సీట్లు తెచ్చుకున్న హస్తం పార్టీ- ఇప్పుడు అంతకు దాదాపు రెట్టింపుగా     99 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌కు ఇది కొండంత బలమనే చెప్పాలి!

సార్వత్రిక ఎన్నికలకు ఎంతో ముందుగానే రాహుల్‌ రంగం సిద్ధం చేసుకొన్నారు. కాంగ్రెస్‌ పునరుజ్జీవమే లక్ష్యంగా భారత్‌ జోడో యాత్రను తలపెట్టారు. ఆయన్ను నిలువరించేందుకు ప్రయత్నాలెన్నో జరిగాయి. అయినప్పటికీ, రాహుల్‌ 2022, 2023లో రెండు పర్యాయాలు యాత్ర సాగించారు. ఆసేతు హిమాచలం సాగించిన యాత్రలో లక్షల మంది ఆయనకు మద్దతివ్వడం పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని కలిగించింది. నైతిక బలాన్ని ప్రసాదించింది. ఆ బలిమే- అనేక విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ‘ఇండియా’ ఆవిష్కరణకు బాటలు పరచిందన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. యాత్రలో సాధారణ ప్రజానీకం వెలిబుచ్చిన అభిప్రాయాలనే మేనిఫెస్టోకు ప్రాతిపదిక చేసుకున్నారు. రాహుల్‌ నాడు ప్రధానంగా నిరుద్యోగం, అధిక ధరలను ప్రస్తావించారు. దేశవ్యాప్త యాత్రలకు తోడు సమాజ్‌వాదీ పార్టీతో కలిసి చేసిన ‘సామాజిక కూర్పు (సోషల్‌ ఇంజినీరింగ్‌)’ వల్ల కీలకమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇండియా కూటమి విశేష ఫలితాలను సాధించింది. అక్కడ మొత్తం 80 లోక్‌సభ స్థానాలకుగాను 43చోట్ల పాగా వేసింది. కేరళలోని వయనాడ్‌తో పాటు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాయ్‌బరేలీ పార్లమెంటు స్థానంలోనూ ఆమె తనయుడు బరిలోకి దిగి రెండు చోట్లా ఘన విజయం సాధించారు. రాహుల్‌ను నిలువరించేందుకు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినాసరే ఆయన వెరవకుండా పోరాడుతూ వచ్చారని ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ వ్యవహారాలు చూస్తున్న తౌకిర్‌ ఆలమ్‌ వ్యాఖ్యానించారు.

యూపీలోని అమేఠీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట. అక్కడి నుంచి తొలిసారి 2004లో ఎంపీగా గెలుపొందడం ద్వారా రాహుల్‌ క్రియాశీల రాజకీయాలు ఆరంభమయ్యాయి. అనంతరం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ హయాము(2004-14)లో ఉపాధి హామీ, భూసేకరణ, ఆహార హక్కు చట్టాలను తీసుకురావడంలో కీలకంగా నిలిచారు. అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమిని చవిచూసింది. రాహుల్‌ 2017లో కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు అదే ఫలితం. పార్టీ పెద్దగా పుంజుకోలేకపోయింది! అందుకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రాహుల్‌ విడనాడినప్పటికీ- పార్టీ పునరుజ్జీవం కోసం ఆయన ప్రయత్నాలు కొనసాగాయి.
రాహుల్‌ పదేళ్లుగా ఎన్డీయే సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘లౌకికవాదం’ వినిపించారు. ఆ క్రమంలో- ‘రాహుల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు భాజపా యత్నించింది. అయితే తనపై సృష్టించిన ప్రతికూల ముద్రను యాత్రల ద్వారా రాహల్‌ గాంధీ పటాపంచలు చేశారు. ఇప్పుడు ఆయనలోని నాయకుడిని ప్రజలు చూస్తున్నారు. ఆయన పనితీరును ప్రశంసిస్తున్నారు’ అని గుజరాత్‌లో కాంగ్రెస్‌ వ్యవహారాలు చూస్తున్న సందీప్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా తాజా ఎన్నికల ఫలితాలు- జాతీయ నేతగా రాహుల్‌ను ఒక మెట్టు పైకి తీసుకెళ్ళాయనే చెప్పాలి!

అమిత్‌ అగ్నిహోత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.