Ramoji Rao: శిరసా నమామి!

కీర్తిశేషులు కావడానికి కొన్నాళ్లముందు- ఆత్మబంధువులైన తెలుగు వారందరితో రామోజీరావు పంచుకోవాలనుకొన్న మనోభావాల మాలిక ఇది!

Updated : 09 Jun 2024 08:54 IST

కీర్తిశేషులు కావడానికి కొన్నాళ్లముందు- ఆత్మబంధువులైన తెలుగు వారందరితో రామోజీరావు పంచుకోవాలనుకొన్న మనోభావాల మాలిక ఇది!

సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న సూక్తి నిరంతరం కొత్త ఉత్సాహాన్ని నరనరాల్లో నింపుతుంటే- ఎప్పటికప్పుడు ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకొనే నిత్య కృషీవలుడికి గెలుపు బాటలో అలుపన్నదే తెలియదు. ఆరు దశాబ్దాలకు పైగా పనే ప్రపంచంగా, బృహత్‌ లక్ష్యాలను సంకల్పిస్తూ, వాటి సాకారానికి తపిస్తూ, కాలచక్ర భ్రమణాన్ని అసలే మాత్రం పట్టించుకోని నేను- తొమ్మిది పదుల వయసు మీదపడిందని గుర్తించనే లేదు.

నేను- మీ రామోజీరావును!

సమాజ శ్రేయం, సమష్టి హితం కోసం వృత్తిగతంగా తప్ప వ్యక్తిగతంగా ఏనాడూ మీతో ఇలా సంభాషించని నేను- జీవన సంధ్యాసమయంలో నా మనోభావాల్ని పంచుకోవాలనుకొంటున్నాను.

1936లో మధ్యతరగతి తెలుగు రైతు కుటుంబంలో పుట్టి, మరి పాతికేళ్లకు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో కాలిడినప్పుడు- నేను ఎవరన్నది నా వాళ్లకు మాత్రమే తెలుసు. అదే నేడు, మా వాడంటూ నన్ను సమాదరిస్తున్నాయి మూడు తరాల తెలుగు లోగిళ్లు! ఎల్లలెరుగని ఆప్యాయత అభిమానాలను దశాబ్దాల తరబడి పంచి, ఇంతై వటుడింతై... అన్నట్లుగా, నన్ను నా సంస్థలను పెంచిన మీ ప్రేమాదరాలకు కృతజ్ఞతాపూర్వకంగా శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను.

ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు అన్న సమష్టి తత్వంలో పదిమందికీ మేలు చేసే వ్యాపార సూత్రాన్ని గుర్తించి 1962లో చిట్‌ఫండ్స్‌ సంస్థను నెలకొల్పాను. నీతి నిజాయతీ వృత్తి నిబద్ధతలకు ఆర్థిక క్రమశిక్షణను జోడించి, ఆ విలువలే మూలస్తంభాలుగా మార్గదర్శిని నిర్మించాను. విఖ్యాత అమెరికన్‌ శాస్త్రవేత్త నార్మన్‌ బోర్లాగ్‌ సారథ్యంలో దేశంలో హరిత విప్లవానికి ప్రభుత్వాలు పాదుచేస్తున్న దశలో వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన ఫలాలు తెలుగు రైతులకు అందాలన్న తపనతో 1969లో అన్నదాత స్థాపించాను. రైతే రాజు కాగల రోజును స్వప్నిస్తూ ప్రచురణ రంగంలోకి అడుగుపెట్టిన నాడు- తరవాత అయిదేళ్లకు నా చేతుల మీదుగానే ‘ఈనాడు’ ఆవిష్కృతమవుతుందన్న సంగతి తెలియదు. ‘ఈనాడు’ ఆవిర్భావం నన్ను సమూలంగా  మార్చేసింది. ఆ మాటకొస్తే, అది తెలుగువారి చేతి పాశుపతమై దశాబ్దాల చరిత్ర గతినే తిరగరాసింది!

సమాజంలో నువ్వు కోరుకొనే మార్పు నీతోనే మొదలు కావాలన్నారు పూజ్య బాపూజీ. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన ‘ఈనాడు’- పట్టుమని మూడేళ్లలోనే అత్యధిక సర్క్యులేషన్‌ గల దినపత్రికగా ఎదిగి, యాభయ్యేళ్లుగా ఆ యశస్సుతో శిరసెత్తుకు నిలిచిందంటే- అది మీ చలవే. చలనశీల పాత్రికేయాన్ని పరిశోధనాత్మక జ్వలనశీల జర్నలిజంగా కదం తొక్కించడంలో ‘ఈనాడు’ దమ్ము, ధైర్యం- మీరిచ్చినవే! నాకు తక్కినవన్నీ వ్యాపారాలే అయినా ‘ఈనాడు’ మాత్రం- విశిష్ట విశాల ప్రజాహిత సాధనం. కదిలేవీ కదిలించేవీ పెను నిద్దుర వదిలించేవిగా అక్షర అక్షౌహిణులను ఆమంత్రించి దిల్లీ స్థాయి అత్యున్నతాధికార దండధరుల కండకావరాన్నీ కుమ్మి కూలగొట్టేలా ఆయా సందర్భాల్లో ‘ఈనాడు’ పోషించిన చారిత్రక పాత్ర    జగద్విదితం. మద్యనిషేధ మహాధ్యాయం నుంచి జల సంరక్షణోద్యమం దాకా, స్వచ్ఛభారత్‌ మొదలు నిన్నటి తెలుగు జాతి  పునర్వికాస మహోద్యమం దాకా తెలుగువారి మేలుకోరి ప్రతి దశలో ‘ఈనాడు’ క్రియాశీలంగా స్పందిస్తూనే ఉంది. ‘ఈనాడు’కు   సైదోడుగా ఈటీవీ నెట్‌వర్క్‌ సైతం తెలుగుజాతి యశోదీప్తులు తేజరిల్లేలా అసిధారా వ్రతం చేస్తూనే ఉంది. 

ప్రజాప్రయోజనాలకు రక్షాకవచం ఈనాడు, ఈటీవీ 
మీ అచంచల విశ్వాసమే వాటికి తరగని పెన్నిధి!

ప్రజలతో ఇంతగా మమేకమైన సమాచార ప్రచురణ, ప్రసరణ యంత్రాంగం ప్రపంచ పాత్రికేయంలో వేరొకటి లేదు. ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకుగా అవి రాణించడంలో, జాతీయ స్థాయిలోనూ రాణకెక్కడంలో- మీ అందరి ఆశీస్సులు ప్రోద్బల ప్రోత్సాహకాలే కీలకమనడంలో మరోమాట లేదు!

రామోజీ గ్రూప్‌ సంస్థలన్నీ తెలుగువారి బహుముఖ వికాసంతో ముడివడినవే కావడం నాకు గర్వకారణం. అంతకుమించి, అచంచల విశ్వాసాన్ని నాపై ఉంచి, నా జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసిన మీ ఔదార్యం వెలకట్టలేనిదన్నది నిజం. ప్రజల పక్షాన పోరుసల్పుతున్న నాపై రాజకీయకక్ష సాధించేందుకు, ‘ఈనాడు’ ఆర్థికమూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా నిరంకుశ ప్రభుత్వాలు ఎన్ని కుయుక్తులు పన్నాయో అందరికీ తెలుసు. గాలివార్తల దుమారానికి జడిసి మదుపరులు డబ్బు వాపస్‌కోసం ఎగబడితే పెద్దపెద్ద బ్యాంకులే కుప్పకూలిపోయే వాతావరణంలో- మార్గదర్శి డిపాజిటర్లలో ప్రతి ఒక్కరూ సర్కారీ అసత్య ప్రచార ధూమాన్ని ఒక్కపెట్టున తిరస్కరించిన వైనం- నాపట్ల వారి అఖండ విశ్వాసానికి ప్రబల తార్కాణం. ప్రజలతో నేను ముడివేసుకొన్నది మాటలకందని రుణానుబంధం. తరాల అంతరాలను తోసిపుచ్చి ఓ వ్యక్తిపట్ల, అతని సంస్థల పట్ల ఇంతటి నమ్మకాన్ని కుల మత వర్గ ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఓ జాతి యావత్తూ దశాబ్దాలుగా కనబరచడం- నా విషయంలోనే నిజమైన, రుజువైన అదృష్టం. నా తదనంతరం కూడా తెలుగు జాతి ప్రయోజనాల్ని కంటికి రెప్పలా కాచుకొనేలా రామోజీ గ్రూప్‌ వ్యవస్థల్ని తీర్చిదిద్దడం- నేను పాటించనున్న కృతజ్ఞతా ధర్మం!

సమాచార విజ్ఞాన వికాస వినోద రంగాల్లో రామోజీగ్రూప్‌ సంస్థలన్నీ మీ ఆదరాభిమానాలతో అప్రతిహతంగా పురోగమిస్తున్నాయి. ఉదయభానుని ఉషాకిరణాల సుప్రభాత గమకాల్ని అనునిత్యం ఆస్వాదించే నేను- తెలుగుజాతి తేజో విభవాన్ని ఎల్లలు దాటించే ఏడు సుదృఢ వ్యవస్థల్ని నిర్మించాను. వాటిలో మొదటి జవనాశ్వం ప్రజల ఆర్థిక వికాసానికి దోహదపడే మార్గదర్శి. మీ నట్టింటి బిడ్డలుగా ఎదిగిన ఈనాడు ఈటీవీలకు సైదోడు డిజిటల్‌ మీడియాగా ఈటీవీ భారత్‌ ఆవిర్భవించింది. తెలుగింటి రుచుల ఘుమఘుమల్ని ‘ప్రియ’ దేశ సరిహద్దుల్ని దాటించేయగా, గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకొన్న ఫిల్మ్‌సిటీ పర్యాటకుల్ని సూదంటురాయిలా ఆకట్టుకొంటోంది. ప్రకృతి విపత్తుల వేళ బాధిత జనావళికి ఆపన్నహస్తం అందించే రామోజీ ఫౌండేషన్‌ నిబద్ధ సేవలకు చిరునామాగా నిలువనుంది. తెలుగు ప్రజలిచ్చిన కలిమిని, బలిమిని తిరిగి వారి సమగ్రాభ్యున్నతికి సోపానాలుగా మార్చాలన్న సదాలోచనలో పురుడు పోసుకొన్న ప్రాజెక్టులే ఇవన్నీ!

మందులకే కాదు, సమస్త ప్రాణులకూ ‘ఎక్స్‌పైరీ డేట్‌’ ఉంటుంది. ‘మరణం వెలుగును ఆర్పదు; ప్రాతఃసంధ్య వచ్చిందంటూ ప్రాణదీపాన్ని బయటపెడుతుంది’ అంటారు విశ్వకవి. ఆ మాట నిజం. దేశం నీకేం చేస్తుందని కాదు, నీ దేశానికి నువ్వేం చెయ్యగలవని ప్రశ్నించుకొమ్మన్నారు అమెరికా అధ్యక్షుడిగా జాన్‌ ఎఫ్‌ కెనడీ. ఉపాధి అవకాశాల వృద్ధి, సంపద సమృద్ధికి కారణమయ్యే విజయవంతమైన వ్యవస్థల్ని నిర్మించగలిగానంటే- నా తెలుగు ప్రజలు నిండుమనసుతో అడుగడుగునా వెన్నంటి నిలవబట్టేనన్న కృతజ్ఞతాభావం గుండెల్లో పెల్లుబుకుతోంది.
నేను లేకున్నా రామోజీ సంస్థలన్నీ తెలుగుజాతి తలలో నాల్కలా కొనసాగాలన్నది నా ఆశ, ఆకాంక్ష. మీరు నా పట్ల చూపిన అవ్యాజ అభిమానమే నా ఆశకు శ్వాస!

ఇక సెలవు... 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.