Land Acquisition Act: భూసేకరణ ఇష్టారాజ్యమా?

ప్రజోపయోగం కోసం ఇండియాలో ప్రైవేటు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది. ఇది ఏకపక్షంగా ఉంటే భూ యజమానులకు తీవ్ర నష్టం తప్పదు. దీన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఇండియాలో ప్రజాప్రయోజనాల కోసమని ప్రైవేటు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి 1894నాటి భూసేకరణ చట్టం వీలు కల్పిస్తోంది.

Published : 10 Jun 2024 01:33 IST

ప్రజోపయోగం కోసం ఇండియాలో ప్రైవేటు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది. ఇది ఏకపక్షంగా ఉంటే భూ యజమానులకు తీవ్ర నష్టం తప్పదు. దీన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.

ఇండియాలో ప్రజాప్రయోజనాల కోసమని ప్రైవేటు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి 1894నాటి భూసేకరణ చట్టం వీలు కల్పిస్తోంది. దేశీయంగా భూ సేకరణలో పారదర్శకత, పరిహారం చెల్లింపు, పునరావాసాల కోసం 2013లో చట్టం చేశారు. ఇది 1894నాటి చట్టం స్థానే 2014లో అమలులోకి వచ్చింది. రైల్వే, ప్రత్యేక ఆర్థిక మండలాలు, జాతీయ రహదారులు తదితరాల కోసం భూసేకరణ నిమిత్తం 16 వేర్వేరు చట్టాల్లోని నిబంధనలు ఉపకరిస్తున్నాయి. ఇండియాలో 1978 వరకు ఆస్తి హక్కు సైతం ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండేది. ఆ సంవత్సరం తెచ్చిన 44వ రాజ్యాంగ సవరణ దాన్ని తొలగించింది. నిజానికి, ఆస్తి హక్కుకు సంబంధించి రాజ్యాంగానికి పలుమార్లు ఎన్నో సవరణలు చేయడంతో సుప్రీంకోర్టు వాటిని కూలంకషంగా పరిశీలించి కొన్ని పరిమితులు విధించింది.

సరైన పరిహారం...

ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడాన్ని నివారించడానికి కోర్టులు పలు విధానపరమైన రక్షణలు కల్పిస్తున్నాయి. ఇవి ఏడు దాకా ఉన్నాయి. ప్రజాప్రయోజనాల కోసం భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా- సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల్లో కొన్ని పరిమితులు విధించింది. వజ్రవేలు ముదలియార్‌ వెర్సస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తదితరుల కేసులో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి చెల్లించిన పరిహారం అరకొరగా ఉంటే అది అధికార దుర్వినియోగం, మోసం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ భూ సేకరణ న్యాయబద్ధంగా, ప్రజలకు నిజంగా మేలుచేసేదిగా ఉండాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు 2022లో స్పష్టం చేసింది. చట్టపరమైన విధివిధానాలను పాటించకుండా ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని విద్యాదేవి వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినా అది మానవ హక్కు అని విమలాబెన్‌ అజిత్‌భాయ్‌ పటేల్‌ వెర్సస్‌ వత్సలాబెన్‌ అశోక్‌భాయ్‌ పటేల్‌ కేసులో సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. చట్టపరంగా సరైన ప్రక్రియ పాటించకుండా ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోవడం మానవహక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని కోర్టులు వివిధ కేసుల్లో స్పష్టీకరించాయి.

ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో 300ఏ రాజ్యాంగ అధికరణకు అనుగుణంగా ఏడు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. వీటిలో ఏ ఒక్క దాన్ని పాటించకపోయినా కోర్టులో సవాలు చేయవచ్చునని స్పష్టం చేసింది. ఆ సూత్రాల ప్రకారం ఏదైనా భూమిని స్వాధీనం చేసుకునే ముందు దాని యజమానికి ముందస్తు నోటీసు ఇవ్వాలి. భూ యజమాని లేవనెత్తే అభ్యంతరాలను వినాలి. ఆ తరవాతా భూమిని స్వాధీనం చేసుకోదలిస్తే, ఆ సంగతి యజమానికి తెలియజేయాలి. భూ సేకరణ ఏకపక్షం కాదని, నిజంగా ప్రజాప్రయోజనాల కోసమే న్యాయబద్ధంగా జరుగుతోందని ప్రభుత్వం నిరూపించాలి. స్వాధీనం చేసుకున్న తరవాత ఆ భూ యజమానికి సముచిత పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలి. తరవాత భూ సేకరణను నిర్ణీత కాల వ్యవధిలో సమర్థంగా నిర్వహించాలి. యజమానులకు సైతం సంతృప్తికరంగా భూ సేకరణను పూర్తిచేయాలి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూసేకరణ జరపకూడదని, ఆస్తి హక్కు కేవలం నామమాత్రం కాదని సుప్రీంకోర్టు చాటిచెప్పింది. ఒకప్పుడు ప్రాథమిక హక్కులకు భంగకరమైన చర్యలు, చట్టాలను మాత్రమే కోర్టులు కొట్టివేసేవని, ఆస్తి హక్కు ఉల్లంఘనను పట్టించుకొనేవి కావనే అభిప్రాయం దీనితో పటాపంచలైంది.

పటిష్ఠ చట్టాలు అవసరం

మన రాజ్యాంగ నిర్మాతలు అసాధారణ మేధావులు. సిద్ధాంతాన్ని ఆచరణను సమర్థంగా మేళవించి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ దేశ విశిష్ట స్థితిగతులను, ప్రజల అవసరాలు, ఆకాంక్షలను గుర్తెరిగి తమ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. ప్రతి పౌరుడికి ఎంతో కొంత ఆస్తి ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. అది వారికి జీవనాధారంగానే కాకుండా ప్రభుత్వ నిరంకుశత్వం నుంచి రక్షణగానూ ఉపకరిస్తుందని భావించారు. కాలక్రమంలో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకుండా పోయినా దానికి చట్టపరమైన రక్షణ కల్పించారు. ఇందులో కోర్టులు క్రియాశీల పాత్ర పోషించాయి. పార్లమెంటు, శాసన సభలు వెనకా ముందు ఆలోచించి ఎంతో జాగ్రత్తగా చట్టాలు చేసినా భవిష్యత్తులో అనుకోని పరిస్థితులు, అవాంతరాలు తలెత్తవచ్చు. సందిగ్ధ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇలాంటివాటికి తావు లేకుండా చట్టాలను రూపొందించాలి. అన్ని అంశాల్లో న్యాయంగా వ్యవహరించడం ప్రభుత్వ విధి. న్యాయసాధన దాని కర్తవ్యం. న్యాయవ్యవస్థ సైతం చట్టాలకు సక్రమంగా భాష్యం చెప్పాలి. పౌరులకు సత్వర న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.