Ragging: భవితను చిదిమేస్తున్న ర్యాగింగ్‌

ఇతరుల జీవితాలను అగాధంలోకి నెట్టే చర్యలు దీర్ఘకాలం కొనసాగితే అది విష సంస్కృతిగా స్థిరపడిపోతుంది. ర్యాగింగ్‌ అటువంటిదే. అనేక విద్యాలయాల్లో ఇది వేళ్లూనుకుపోయింది. వేధింపుల నిరోధానికి చర్యలు   తీసుకోవాల్సిందిగా యూజీసీ అన్ని విశ్వవిద్యాలయాలకూ తాజాగా మార్గనిర్దేశం చేసింది.

Published : 08 Jun 2024 02:04 IST

ఇతరుల జీవితాలను అగాధంలోకి నెట్టే చర్యలు దీర్ఘకాలం కొనసాగితే అది విష సంస్కృతిగా స్థిరపడిపోతుంది. ర్యాగింగ్‌ అటువంటిదే. అనేక విద్యాలయాల్లో ఇది వేళ్లూనుకుపోయింది. వేధింపుల నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిందిగా యూజీసీ అన్ని విశ్వవిద్యాలయాలకూ తాజాగా మార్గనిర్దేశం చేసింది.

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును ర్యాగింగ్‌ చిదిమేస్తోంది. దీన్ని నిరోధించడానికి చాలా రాష్ట్రాలు చట్టాలు చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) కఠిన మార్గదర్శకాలు రూపొందించింది. అయినప్పటికీ, ఆశించిన మార్పు రావడంలేదు. సీనియర్ల వేధింపులపై 2019-21 మధ్య కాలంలో యూజీసీకి అందిన ఫిర్యాదులు తగ్గినట్లుగా కనిపిస్తున్నా, అది కొవిడ్‌ ప్రభావం వల్లేనని గ్రహించాలి. 2022లో యూజీసీకి 1,094 ఫిర్యాదులు అందాయి. 2023లో ఆ సంఖ్య 1,240కి చేరింది.

వికృత రూపాలతో అంతకంతకు విస్తరిస్తున్న ర్యాగింగ్‌ నేడు విద్యాసంవత్సరం ప్రారంభ రోజులకే పరిమితం కావడంలేదు. దాని ప్రభావాలు ఏడాదంతా ఉంటున్నాయి. వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి ప్రీతి ఆత్మహత్య, కేరళలోని వయనాడ్‌లో వెటర్నరీ వైద్య విద్యార్థి సిద్ధార్థ్‌ బలవన్మరణం జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగినవే. విద్యాలయంలో ప్రవేశించింది మొదలు సీనియర్లు ఎత్తు, రంగు, భాష, ప్రాంతం, సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపుతూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. విపరీత మనస్తత్వంతో భౌతిక హింసకు తెగబడుతున్నారు. లైంగిక వేధింపులకూ పాల్పడుతున్నారు. హాస్టళ్లలో అసహజ క్రియలు చేయాలంటూ జూనియర్లను బలవంతపెడుతున్నారు. మద్యం, గంజాయి మత్తులో బృందాలుగా మాటువేసి ఆడపిల్లల్ని నానాయాగీ చేయడం పరిపాటిగా మారింది. ఆన్‌లైన్‌లోనూ వేధింపులు కొనసాగిస్తుండటం మరో ప్రమాదకర పరిణామం. ఇతర విద్యాలయాలతో పోలిస్తే కొన్నిచోట్ల ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో సీనియర్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి.

ర్యాగింగ్‌ కట్టడి విషయంలో విద్యాసంస్థల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో 40శాతం దాకా జూనియర్లు ఏదో రకమైన వేధింపులకు గురవుతున్నారు. పరువుపోతుందన్న భయం, పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వారిని ఫిర్యాదుల దాకా వెళ్ళనీయడం లేదు. వేధింపులు తాళలేక సున్నిత మనస్కులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆరేళ్ల వ్యవధిలో దేశంలో 25మంది విద్యార్థులు ఈ విష క్రీడకు బలయ్యారు. కొందరు ఏకంగా చదువులను, విద్యాలయాలను విడిచిపెడుతున్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌ నిరోధక కమిటీల ఏర్పాటు నామమాత్రమే అవుతోంది. వసతి గృహాల్లో తనిఖీ బృందాల పర్యవేక్షణ కరవవుతోంది. ఇప్పటికీ అధ్యాపకుల్లో కొందరు ర్యాగింగ్‌ సంస్కృతి పట్ల సానుకూల వైఖరిని కనబరుస్తుండటం విచిత్రం! ఫిర్యాదు చేసినా కొన్నిచోట్ల తక్షణ స్పందన ఉండటం లేదు. గత నెలలో గ్వాలియర్‌ ఆయుర్వేదిక్‌ విద్యాలయంలో ర్యాగింగ్‌ బారినపడ్డవారు పోలీసులను ఆశ్రయించారు. హింసతోపాటు భౌతిక, లైంగిక దాడులు చోటుచేసుకున్నా విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యులపై పోలీసులకు సమాచారం నివేదించడం లేదు. తమ విద్యాసంస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్న కారణంతో సమస్యను చిన్నదిగా చూపిస్తూ మీనమేషాలు లెక్కిస్తు న్నారు. చాలా సందర్భాల్లో స్వల్ప కాలిక శిక్షలతో సరిపుచ్చుతున్నారు. నిందితులు ఆ తరవాత కక్షలతో రగిలిపోతూ తీవ్ర నేరాలకు సైతం వెనకాడటం లేదు. 60ఏళ్ల చరిత్ర ఉన్న జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో గత ఆగస్టులో పద్దెనిమిదేళ్ల విద్యార్థి ఆత్మహత్య తరవాత ‘ర్యాగింగ్‌ క్రిమినల్‌ నేరం’ అంటూ అక్కడ పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు.

సున్నితత్వం, తీవ్ర మనస్తత్వం రెండూ ఇబ్బందికర లక్షణాలే. బాల్యంలోనే పిల్లలు  వీటిని అధిగమించేలా తల్లిదండ్రులు ఇంటి వాతావరణాన్ని చక్కదిద్దాలి. తోటి విద్యార్థులు ఇబ్బంది కలిగిస్తున్నారని పిల్లలు చెప్పినప్పుడు దృష్టి సారించాలి. సమస్యను పరిష్కరించడం ద్వారా వారిలో బెరుకును పోగొట్టాలి. పిల్లల్లో విపరీత మనస్తత్వం ఉంటే మానసిక నిపుణులను సంప్రతించాలి. భిన్న ఆర్థిక, సామాజిక నేపథ్యాలు కలిగిన విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత అధ్యాపకులదే. తరగతి, కళాశాల, క్యాంపస్‌ స్థాయుల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను బలోపేతం చేయాలి. వసతి గృహాల్లో ఉండేవారిపై అధ్యాపకుల పర్యవేక్షణ అవసరం. వేధింపులకు పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో విద్యార్థులందరికీ అవగాహన కల్పించాలి. ఆటలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వారి మధ్య పరిచయాలను పెంచాలి. ఫిర్యాదులను మూడో వ్యక్తితో విచారణ చేపట్టే విధానానికి యూజీసీ శ్రీకారం చుట్టాలి. అశ్లీల దృశ్యాలు, ఆధిపత్య భావజాలంతో కూడిన సినిమాల కట్టడికి ప్రభుత్వాలు పూనుకోవాలి. గంజాయి, మత్తు పదార్థాలను విద్యాలయాల దరిచేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాభ్యాసం సజావుగా ముందుకు సాగాలంటే, ర్యాగింగ్‌ సంస్కృతికి ముగింపు పలకాల్సిందే. ఆ బాధ్యత అందరిదీ!

సముద్రాల స్వామినాథ్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు