Gold: మన దేశ బంగారం భద్రం

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కోశాగారంలో దాచిన బంగారంలో 100 టన్నులను రిజర్వు బ్యాంక్‌ ఇటీవల తిరిగి భారత్‌కు తీసుకువచ్చింది. అసలు మన బంగారాన్ని విదేశీ కోశాగారాల్లో ఎందుకు దాస్తారన్నది చాలామందికి తెలియదు. 2023-24లో బ్రిటన్‌ నుంచి తెచ్చిన వంద టన్నులే కాదు, ఇంకా మరెంతో భారతీయ బంగారం విదేశీ కోశాగారాల్లో ఉంది.

Published : 06 Jun 2024 00:33 IST

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కోశాగారంలో దాచిన బంగారంలో 100 టన్నులను రిజర్వు బ్యాంక్‌ ఇటీవల తిరిగి భారత్‌కు తీసుకువచ్చింది. అసలు మన బంగారాన్ని విదేశీ కోశాగారాల్లో ఎందుకు దాస్తారన్నది చాలామందికి తెలియదు. 2023-24లో బ్రిటన్‌ నుంచి తెచ్చిన వంద టన్నులే కాదు, ఇంకా మరెంతో భారతీయ బంగారం విదేశీ కోశాగారాల్లో ఉంది.

భారత్‌లో జారీచేసిన కరెన్సీ నోట్లకు పూచీకత్తుగా స్వదేశంలోనే 308 టన్నుల బంగారాన్ని అట్టిపెట్టామని 2024 సంవత్సరానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విడుదలచేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్‌ విభాగానికి దన్నుగా మరో 100.28 టన్నుల పసిడిని ప్రత్యేకించారు. భారతదేశ మొత్తం పసిడి నిల్వల్లో 413.79 టన్నులను విదేశీ కోశాగారాల్లో నిక్షిప్తం చేశామని ఆర్బీఐ నివేదిక వివరించింది. స్వదేశీ బంగారాన్ని ముంబయి, నాగ్‌పుర్‌లోని కోశాగారాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ నిల్వచేశారు.

ఎందుకు నిల్వ చేస్తారంటే...

ఒకప్పుడు ప్రభుత్వాలు బంగారు నిల్వల ఆధారంగా కరెన్సీని జారీచేసేవి. బ్యాంకులలో డిపాజిట్‌ చేసిన నగదు, చేతిలో తిరిగే కాగిత కరెన్సీల విలువను చెల్లించే స్తోమత ప్రభుత్వానికి ఉందని చాటడానికి కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను నిర్వహిస్తున్నాయి. ఇతర దేశాల వారికి చెల్లింపులు జరిపే సత్తా తమకు ఉందని ఈ నిల్వలు భరోసా ఇస్తాయి. జాతీయ కరెన్సీకి బంగారం విలువను సమకూరుస్తుంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కాగిత కరెన్సీకి బంగారం పూర్తిస్థాయి ప్రాతిపదికగా నిలవడంలేదు. కానీ, భారీ స్వర్ణ నిల్వలకు మాత్రం ఎప్పటికీ విలువ ఉంటుంది.

ప్రపంచంలో నేడు పెద్దయెత్తున బంగారం కొంటున్న అయిదు కేంద్ర బ్యాంకుల్లో రిజర్వు బ్యాంకు ఒకటని డబ్ల్యూజీసీ వెల్లడించింది. డాలర్‌ విలువలో హెచ్చుతగ్గులు, వడ్డీరేట్లలో మార్పులవల్ల విదేశీ కరెన్సీ నిల్వలతోపాటు బంగారం నిల్వలనూ సమకూర్చుకోవాలని భావించారు. తదనుగుణంగా చైనా, సింగపూర్, తుర్కియే దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను పెంచాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ తాజా గణాంకాల ప్రకారం, అత్యధిక బంగారం నిల్వలు ఉన్న 10 దేశాల జాబితాలో అమెరికాది అగ్రస్థానం. భారత్‌ది తొమ్మిదో స్థానం. అమెరికా వద్ద 8,133.5 టన్నుల బంగారం ఉంది. ఇది ఆ దేశం వద్దనున్న విదేశ మారక ద్రవ్య నిల్వల్లో 71.3శాతానికి దన్నుగా నిలుస్తోంది. ఇండియా వద్ద 827.69 టన్నుల బంగారం ఉంది. అది మన విదేశీ ద్రవ్య నిల్వల్లో కేవలం 8.9 శాతానికే పూచీకత్తుగా నిలుస్తోంది. భారత్‌ కన్నా ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశాలు- జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్‌.

అనేక ఇతర దేశాల మాదిరిగానే ఇండియా కూడా విదేశీ కోశాగారాల్లో బంగారాన్ని నిల్వ చేస్తోంది. అందుకు భద్రత, ఆర్థిక, వ్యూహపరమైన కారణాలున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, సంఘర్షణలవల్ల వాటిల్లే ముప్పును దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా ఇలా నిల్వచేస్తోంది. లండన్‌ (బ్రిటన్‌), న్యూయార్క్‌ (అమెరికా), జూరిక్‌ (స్విట్జర్లాండ్‌)లు పసిడి వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రాలు. కాబట్టి, అక్కడ దాచిన బంగారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు. లేదంటే ఇతర ఆర్థిక లావాదేవీలకూ సులువుగా ఉపయోగించవచ్చు. భారత్‌ తన బంగారంలో గణనీయ భాగాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌లో, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌)లో దాచింది. బ్రిటిష్‌ వలస ప్రభుత్వంగా ఉన్నప్పటి నుంచే భారత్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌తో లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఈ బ్రిటిష్‌ కేంద్ర బ్యాంకు పసిడి నిల్వలకు నమ్మకమైన సంరక్షకురాలిగా పేరుతెచ్చుకుంది. ఈ బ్యాంకులోని బంగారం కోశాగారాలకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉంది. వాటికి బలీయమైన తలుపులు అమర్చారు. కోశాగారంలోకి ప్రవేశాలపై గట్టి నియంత్రణ ఉంటుంది. ఇక బీఐఎస్‌ అనేది ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల యాజమాన్యంలోని సంస్థ. అది కేంద్ర బ్యాంకులకే కేంద్ర బ్యాంకు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు బీఐఎస్‌ ఇరుసు వంటిది. మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న పలుదేశాల నుంచి నష్టపరిహారం వసూలు చేయడానికని బీఐఎస్‌ను 1929లో నెలకొల్పారు. దాని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఉంది. హాంకాంగ్, మెక్సికో నగరాల్లో శాఖా కార్యాలయాలున్నాయి. బీఐఎస్‌ కేవలం కేంద్ర బ్యాంకులకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు మాత్రమే బ్యాంకింగ్‌ సేవలు అందిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భరోసా ఇస్తుంది.

ప్రసిద్ధ కోశాగారాలు...

ప్రపంచంలో అత్యధిక పసిడి నిల్వలు ఉన్న అమెరికా వాటిని కెంటకీ రాష్ట్రంలోని ఫోర్ట్‌ నాక్స్‌ కోశాగారంలో భద్రపరుస్తోంది. అక్కడ గ్రానైట్‌ రక్షణ వలయం, నిఘా కెమెరాలు, సాయుధ సిబ్బందితో పకడ్బందీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అమెరికా సైన్యం, టంకశాల పోలీసులు ఫోర్ట్‌ నాక్స్‌ కోశాగారానికి పహరా కాస్తారు. న్యూయార్క్‌లో అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ కార్యాలయం కింద వీధి మట్టానికి 80 అడుగుల లోతులో, సముద్ర మట్టానికి 50 అడుగుల లోతులో 90 టన్నుల ఉక్కు సిలిండర్‌ రూపంలో మరో కోశాగారం ఉంది. దానికి సైతం అత్యాధునిక రక్షణ ఏర్పాట్లు చేశారు. జర్మనీ కేంద్ర బ్యాంకు డాయ్చ్‌ బూండెస్‌ బ్యాంక్, పారిస్‌లోని బ్యాంక్‌ డి ఫ్రాన్స్, స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌లకూ స్వర్ణ కోశాగారాలున్నాయి. భారత్‌ తన ముంబయి, నాగ్‌పుర్‌లలోని కోశాగారాలతోపాటు విదేశీ కోశాగారాల్లోనూ బంగారాన్ని భద్రపరుస్తోంది. వాటిని సంరక్షించుకోవడం ద్వారా తనది బలమైన ఆర్థిక వ్యవస్థ అని ప్రపంచ దేశాలకు విశ్వాసం కలిగించగలుగుతోంది.


ఇప్పటి వరకు ఎంత వెలికితీశారంటే...

చరిత్రలో ఇంతవరకు గనుల నుంచి వెలికితీసిన మొత్తం బంగారం 1,90,040 టన్నులని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా. ఇతరుల అంచనాలు దీనికన్నా 20శాతం ఎక్కువగానే ఉంటాయి. ఒక ట్రాయ్‌ ఔన్సు (31.1035 గ్రాముల) బంగారం ధర 2017 ఆగస్టు 16వ తేదీన సుమారు లక్ష రూపాయలు (1,250 డాలర్లు) పలికింది. ఈ లెక్కన ఒక టన్ను బంగారం ధర రూ.335 కోట్లు (4.02కోట్ల డాలర్లు) అన్నమాట. దాని ప్రకారం ఇంతవరకు ప్రపంచంలో తవ్వితీసిన మొత్తం బంగారం విలువ సుమారు 626 లక్షల కోట్ల రూపాయలు (7.5 లక్షల కోట్ల డాలర్లు) అవుతుంది.


అరూణిమ్‌ భూయాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.