Published : 04/01/2022 20:59 IST

ఒంటరిగా మంచు ఖండాన్ని చుట్టేసింది!

(Photo: Instagram)

ఈ మాత్రం చలికే తట్టుకోలేకపోతున్నాం.. అలాంటిది -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే శీతల పవనాలను తట్టుకుంటూ, మనిషే కానరాని చోట నడవడమంటే సాహసమనే చెప్పాలి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు బ్రిటిష్‌ ఆర్మీ ఆఫీసర్‌ హర్‌ప్రీత్‌ చాందీ. భారత సంతతికి చెందిన ఆమె.. 40 రోజుల పాటు ఒంటరిగా అంటార్కిటికా ఖండాన్ని చుట్టి.. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి నల్ల జాతీయురాలిగా నిలిచింది. గట్టిగా కోరుకోవాలే కానీ మహిళలకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటోన్న ఈ ఆర్మీ లేడీ సాహస యాత్ర గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

ఓవైపు వృత్తిని ప్రేమిస్తూ.. మరోవైపు తమ ప్రవృత్తులకు పదును పెడుతుంటారు కొంతమంది మహిళలు. హర్‌ప్రీత్‌ చాందీ కూడా ఆ కోవకే చెందుతారు. భారత సిక్కు కుటుంబానికి చెందిన ఆమె కుటుంబ సభ్యులు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. దాంతో చాందీ కూడా అక్కడే పుట్టారు. పెద్దయ్యే క్రమంలో సాహసాలపై మక్కువ పెంచుకున్న ఆమె.. 2007లో బ్రిటిష్‌ ఆర్మీలో చేరారు. ప్రస్తుతం అందులో ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

48 రోజులనుకొని.. 40 రోజుల్లోనే..!

మన మనసులో ఎన్నో ఆలోచనలుంటాయి.. సాహసాలు చేయాలన్న తపన కూడా ఉంటుంది. కానీ ‘అది నా వల్లేం అవుతుంది..’ అనుకుంటారు చాలామంది. ఇదే వాళ్లను గీత దాటకుండా చేస్తుందంటున్నారు చాందీ. ‘నేను వృత్తిని ఎంతగా ప్రేమిస్తానో.. సాహసాలనూ అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తాను. అంటార్కిటికాను చుట్టేయాలన్న ఆలోచన రెండున్నరేళ్ల కిందే వచ్చింది. అయితే ఆ సమయంలో ఇది నా వల్ల అవుతుందా అనిపించింది. కానీ అదే ఆలోచనతో మన చుట్టూ గిరిగీసుకోవడం కరక్ట్‌ కాదని ఆ తర్వాత తెలుసుకున్నా. ఏదైనా చేయగలిగే సత్తా మన సొంతం. అది సాధ్యం కావాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి. ఇదే స్వీయ నమ్మకంతో నవంబర్ 7న ఈ సాహసయాత్రకు శ్రీకారం చుట్టాను. ముందు 48 రోజుల్లో పూర్తిచేయాలని సంకల్పించుకున్నా.. కానీ 8 రోజుల ముందుగానే దక్షిణ ధృవాన్ని చుట్టడం మర్చిపోలేని అనుభూతి..’ అంటారు చాందీ.

ప్రతికూలతల్ని అనుకూలతలుగా!

కేవలం 40 రోజుల్లో దక్షిణ ధృవాన్ని చుట్టేసి.. ఈ ఘనత సాధించిన తొలి నల్ల జాతీయురాలిగా కీర్తి గడించిన చాందీ.. ఈ క్రమంలో తనకెదురైన ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగానంటున్నారు.

‘మూడేళ్ల క్రితం దక్షిణ ధృవం గురించి ఏమీ తెలియని నేను.. ఇప్పుడు ఇక్కడున్నానంటే నాకే నమ్మశక్యం కావట్లేదు. 40 రోజుల్లో 700 మైళ్లు ట్రెక్కింగ్‌ చేసే క్రమంలో ఎన్నో ప్రతికూలతలు నాకు అడ్డుగోడగా నిలిచాయి. నవంబర్‌ 7న అంటార్కిటికాలోని హెర్క్యులస్‌ ఇన్‌లెట్‌ వద్ద నా సాహస యాత్ర ప్రారంభమైంది. -50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు తోడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే శీతల పవనాలు నాకు అతిపెద్ద అవరోధాలుగా మారాయి. ఇక ఈ యాత్ర 48 రోజుల్లో పూర్తి చేయాలన్న సంకల్పంతో సరిపడా ఆహారం, ఇతర రక్షణ సామగ్రితో కలిపి సుమారు 90 కిలోల స్లెడ్జ్‌ని లాగుతూ ముందుకు సాగాను. ఇలా శారీరకంగానే కాదు.. ఒక్కో రోజు మానసికంగానూ అలసిపోయేదాన్ని.. అయినా లక్ష్యాన్ని చేరాలన్న దృఢ సంకల్పం ఈ అవరోధాలన్నీ అధిగమించేలా చేసింది..’ అంటూ తన జర్నీ గురించి చెప్పుకొచ్చారామె. అంతేకాదు.. తన 40 రోజుల జర్నీలో తనకెదురైన అనుభవాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు చాందీ.

కఠోర సాధనతోనే సాధ్యమైంది!

అంటార్కిటికా వంటి మంచు ఖండానికి ఎదురీదాలంటే.. అందుకు ముందు నుంచే కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. చాందీ కూడా నెలల పాటు శ్రమించి ఈ సాహస యాత్రకు సిద్ధపడింది. ఇందుకోసం ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ పర్వతాల్లో Crevasse Rescue నైపుణ్యాలు నేర్చుకుంది. ఐస్‌ల్యాండ్‌లోని Langjökul Glacier పై నడిచింది.. అంతేకాదు.. గ్రీన్‌ల్యాండ్‌ ఐస్‌ షీట్‌పై సుమారు 27 రోజుల పాటు గడిపింది. వీటికి తోడు స్లెడ్జింగ్‌ అలవాటు చేసుకోవడానికి అధిక బరువున్న టైర్‌ను నడుముకు కట్టుకొని లాగడం ప్రాక్టీస్‌ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇలాంటి కఠోర సాధనే తనను అనుకున్న సమయం కంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేలా చేసిందంటోంది చాందీ.

నెక్స్ట్‌ ఏంటి?

బేసిగ్గా సాహసాలంటే ఇష్టపడే ఈ ఆర్మీ లేడీ.. గతంలోనూ పలు అల్ట్రా మారథాన్స్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా సహారా ఎడారిని చుట్టేసింది. ఇక అంటార్కిటికా నుంచి తిరిగొచ్చాక.. మహిళలు ఇలాంటి ఒంటరి సాహసాలకు పూనుకునేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తూనే.. అందుకోసం నిధులు సమీకరించడమే తన లక్ష్యమంటోంది.

‘నా సాహస యాత్ర మరికొంతమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతుందనుకుంటున్నా. అది ఎలాంటి సాహసమైనా సరే.. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న బంధనాలు తెంచుకొని ధైర్యంగా ముందుకు రావాలి. అప్పుడే సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లగలం.. అసాధ్యాల్ని కూడా సుసాధ్యం చేయగలం. నేనూ ఇక్కడితో ఆగిపోను.. ఏటికేడు ఇలాంటి కొత్త సాహసాలు చేస్తూ.. ఔత్సాహిక మహిళల్ని ఈ దిశగా ప్రోత్సహించేందుకు నిధులు సమీకరించడమే నా తదుపరి ప్రణాళికగా పెట్టుకున్నా..’ అంటున్నారు చాందీ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని