వర్షాల్లో.. మొక్కలు దెబ్బతినకుండా..!

వర్షాకాలంలో ఎప్పుడు వాన పడుతుందో చెప్పలేం. అందుకే ఏ వస్తువూ ఆరుబయట లేకుండా జాగ్రత్తపడతాం. అది సరే కానీ.. మొక్కల సంగతేంటి?! వాటిని బాల్కనీలోనో, డాబా పైనో.. ఇలా గాలి, వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే అమర్చాల్సి ఉంటుంది.

Published : 12 Sep 2023 12:08 IST

వర్షాకాలంలో ఎప్పుడు వాన పడుతుందో చెప్పలేం. అందుకే ఏ వస్తువూ ఆరుబయట లేకుండా జాగ్రత్తపడతాం. అది సరే కానీ.. మొక్కల సంగతేంటి?! వాటిని బాల్కనీలోనో, డాబా పైనో.. ఇలా గాలి, వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే అమర్చాల్సి ఉంటుంది. అలాగని ఎక్కువ వర్షంలో తడిసినా, గాలి బాగా వీచినా అవి తట్టుకోలేవు. కాబట్టి వర్షాకాలంలో మొక్కల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు గార్డెనింగ్‌ నిపుణులు. ఇందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు.

అపార్ట్‌మెంట్లలో ఉన్న వారు బాల్కనీల్లో, సొంత ఇల్లు ఉన్న వాళ్లు వాకిట్లో లేదంటే డాబాపై చిన్న పాటి తోటను ఏర్పాటుచేసుకోవడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రదేశం విస్తీర్ణాన్ని బట్టి వివిధ రకాల పూల కుండీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఈ వర్షాలకు అందులో నాటిన మొక్కలు దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

కొన్ని మొక్కల కాండాలు, ఆకులు, పువ్వులు వాడిపోయి కుళ్లిపోవడం మనం చూస్తుంటాం. అయితే వాటిని గుర్తించి వెంటనే తొలగించాలి. లేదంటే ఈ తేమకు అక్కడి క్రిమి కీటకాలు మొక్కంతా వ్యాపించి అది పూర్తిగా దెబ్బతినేలా చేస్తాయి.

ఈ వర్షాకాలంలో వీచే బలమైన ఈదురు గాలులకు పొడవాటి మొక్కలు, చెట్లు వంగిపోయి నేలకొరగడం చూస్తుంటాం. దీనివల్ల కూడా మొక్క డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే.. మొక్కకు సపోర్ట్‌గా పొడవాటి చెక్క లేదంటే ఇనుప కడ్డీని ఉంచి తాడుతో కట్టేయాలి.

నిజానికి వర్షాకాలంలో మొక్కలకు తరచూ నీళ్లు పోయాల్సిన అవసరం రాదు. అలాంటప్పుడు వాటిపై పదే పదే వర్షం పడితే.. కుండీల్లో నీళ్లు నిలిచి మొక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండడానికే కుండీలకు అడుగుభాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అది మూసుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇక గార్డెన్‌ ఉన్న వాళ్లు.. నీళ్లు ఎక్కడా ఆగకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలు నాటే ప్రదేశం ఏటవాలుగా ఉండేలా.. గార్డెన్‌ చివర్లో నీళ్లు పోయేలా ఓ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేయడం మరీ మంచిది.

ఇంట్లో పెంచుకునే ఆకుకూరలు, పూల మొక్కలు వర్షపు చినుకులు, గాలికి త్వరగా డ్యామేజ్‌ అవుతాయి. ఇలాంటప్పుడు వాటిపై నుంచి రెయిన్‌ ప్రూఫ్‌ కవర్‌ ఏర్పాటుచేయడం మంచిది. ఇవి కూడా ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో దొరుకుతున్నాయి. ఈ కవర్‌ కింద నెట్‌ షీట్‌ ఒకటి ఉంటుంది. కాబట్టి వర్షం లేనప్పుడు కవర్‌ తొలగిస్తే.. ఈ నెట్‌ షీట్‌ ద్వారా వాటికి సూర్యరశ్మి అందుతుంది.

మొక్కలకు నీళ్లొక్కటే పెడితే సరిపోదు.. ఏ కాలమైనా వాటికి ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లో వృథాగా పడేసే కాయగూరల వ్యర్థాలు, కాఫీ పిప్పి.. వంటి వాటితో సహజసిద్ధమైన ఎరువులు తయారుచేయచ్చు.

తేమ, హ్యుమిడిటీ కారణంగా మొక్కలకు నత్తల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి బారి నుంచి మొక్కల్ని కాపాడుకోవాలంటే కుండీల చుట్టూ కంకర లేదా గరుకైన మట్టిని పోయాలి.

ఎక్కువ వర్షం పడడం వల్ల కుండీల్లోని మట్టి తొలగిపోయి.. ఒక్కోసారి వాటి వేర్లు బయటికి కనిపిస్తుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే మొక్క డ్యామేజ్‌ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి వాటిని తిరిగి మట్టితో కప్పి, ఎరువులు వేయడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్