Animal Abuse: ఆకలితో అలమటించి.. 1000 కుక్కలు మృత్యువాత..!

ఆకలితో అలమటించి వెయ్యి కుక్కలు (Dogs) మృత్యువాత పడిన ఘటన దక్షిణ కొరియాలో (South Korea) వెలుగు చూసింది. వాటి సంరక్షణ చూడాల్సిన ఓ వ్యక్తి.. వాటికి సరైన తిండిపెట్టకపోవడం వల్లే అవి మరణించినట్లు (Starve to death) భావిస్తున్నారు.

Published : 09 Mar 2023 01:33 IST

సియోల్‌: దక్షిణ కొరియాలో (South Korea) దారుణం వెలుగులోకి వచ్చింది. కుక్కలను (Dogs) చేరదీసిన ఓ వృద్ధుడు.. వాటికి సరైన తిండి పెట్టకపోవడంతో ఆకలితో అలమటించి చివరకు మృత్యువాత పడినట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దక్షిణకొరియా జెయోంగి ప్రావిన్సులోని యాంగ్‌పెయాంగ్‌లో ఈ భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.

యాంగ్‌పెయాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు శునకం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరక్కపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఓ వృద్ధుడి ఇంట్లో వందల సంఖ్యలో కుళ్లిపోయిన కుక్కల దేహాలను గుర్తించారు. కళేబరాలు పొరలు పొరలుగా పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. వాటిని బోనులు, బస్తాలు, రబ్బరు పెట్టెల్లో ఉంచారు. మొత్తం సుమారు వెయ్యి కుక్కలు ఉంటాయని స్థానిక పోలీసులు వెల్లడించారు. వెంటనే జంతుసంరక్షణ విభాగానికి సమాచారం అందించి.. అందులో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న కొన్ని శునకాలను గుర్తించి కాపాడారు.

సంతానోత్పత్తి వయసు అయిపోవడం లేదా తమ వ్యాపారానికి అనువుగా లేని శునకాలను కొందరు పెంపకందారులు వదిలించుకునే ప్రయత్నం చేసినట్లు జంతు సంరక్షణ కార్యకర్తలు వెల్లడించారు. ఇందులో భాగంగా వీటి పెంపకం బాధ్యతను ఓ వ్యక్తికి అప్పజెప్పారని.. ఇందుకోసం వారు కొంత మొత్తాన్ని కూడా ఆ వృద్ధుడికి చెల్లించినట్లు భావిస్తున్నారు. అయితే, వాటి పరిరక్షణ చూడాల్సిన ఆ వృద్ధుడు మాత్రం.. వాటికి ఆహారం పెట్టకుండా వదిలేశాడని తెలుస్తోంది. దీంతో ఆకలితో అలమటించి చివరకు అవి ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలాఉంటే, దక్షిణకొరియాలో జంతు సంరక్షణ చట్టాలు కఠినంగా ఉంటాయి. పెంపుడు జంతువులకు ఆహారం, నీరు అందించకుండా చంపితే గరిష్ఠంగా మూడేళ్లవరకు జైలు శిక్షతో పాటు 30లక్షల వోన్‌ (సుమారు రూ.18లక్షలకుపైగా) జరిమానా విధిస్తారు. ఇటీవల అక్కడ జంతుహింసకు సంబంధించిన కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని