Benazir Bhutto: 16ఏళ్లయినా.. మిస్టరీగానే ‘భుట్టో’ మరణం!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో మరణించి 16ఏళ్లు అయినప్పటికీ ఆమెను ఎవరు హత్య చేశారనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది.

Published : 28 Dec 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో ఆత్మాహుతి దాడిలో మరణించి నేటితో (డిసెంబర్‌ 27) 16ఏళ్లు గడిచాయి. అయినప్పటికీ బెనజీర్ హత్యకు సంబంధించిన విషయం మిస్టరీగానే మిగిలిపోయింది. పాకిస్థాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఘనత సాధించిన బెనజీర్‌ భుట్టో.. రెండుసార్లు పాకిస్థాన్‌కు ప్రధానిగా పనిచేశారు. 2007 డిసెంబరు 27న రావల్పిండిలో ఎన్నికల సభలో పాల్గొని బయలుదేరే సమయంలో లియాఖత్‌ బాగ్‌ బయట ఆమెపై ఆత్మాహుతి దాడి జరిగింది. అప్పుడు ఆమె వయసు 54 ఏళ్లు. ఆ సమయంలో సైనిక నియంత పర్వేజ్‌ ముషారఫ్‌ పాలనలో పాకిస్థాన్ ఉంది.

అయితే, భుట్టో నేతృత్వం వహించిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) 2008 నుంచి 2013 వరకూ అధికారంలో ఉన్నప్పటికీ ఆమె హత్య వెనక ఉన్న శక్తులను గుర్తించడంలో విఫలమైంది. రోజులు గడుస్తున్నా కొద్ది ఆమె హత్యపై అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ర్యాలీ ముగిసిన తర్వాత ఆమె ప్రయాణించే మార్గాన్ని మార్చడం, సంఘటన జరిగిన ప్రదేశాన్ని అధికారులు హడావిడిగా కడిగేయడం.. తద్వారా కీలక ఆధారాలు కొట్టుకుపోయేలా చేయడం, స్థానిక అధికారులు భయపడటం వంటి అంశాలను స్థానిక మీడియా తాజాగా ప్రస్తావించింది.

భుట్టో హత్య ఘటనను ఉగ్రచర్యగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల టెలిఫోన్‌ సంభాషణలతోపాటు తెహ్రీక్‌-హె-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కి చెందిన వారిగా భావిస్తోన్న ఇద్దరి వ్యక్తుల స్కెచ్‌లను విడుదల చేసింది. అనంతరం పర్వేజ్‌ ముషారఫ్‌ ఈ ఘటనపై బ్రిటన్‌కు చెందిన స్కాంట్లాండ్‌ యార్డ్‌ బృందంతో దర్యాప్తు చేయించారు. జనవరి 8, 2008లో ఆ బృందం నివేదిక సమర్పించినప్పటికీ పీపీపీతోపాటు బెనజీర్‌ భుట్టో భర్త, మాజీ అధ్యక్షుడు అసీఫ్‌ అలీ జర్దారీ దాన్ని తోసిపుచ్చారు. ఆ నివేదిక తప్పని.. ఆ హత్యను ముషారఫ్‌ చేయించారని ఆరోపించారు.

చివరకు దీనిపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్లు సైతం వచ్చాయి. దాంతో ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఉన్నతస్థాయి బృందాన్ని పంపించనున్నట్లు 2009లో ఐరాస ప్రకటించింది. అదే ఏడాది జులైలో ఇస్లామాబాద్‌ చేరుకున్న ఐరాస నిజనిర్ధారణ బృందం.. ఓ నివేదిక విడుదల చేసింది. కానీ, ఆ ఘటనకు కారకులు ఎవరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నివేదికనూ పీపీపీతోపాటు జర్దారీ తోసిపుచ్చారు. ఇలా ఇప్పటివరకు 16ఏళ్లు గడిచినప్పటికీ బెనజీర్‌ భుట్టో మరణంపై మిస్టరీ మాత్రం వీడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని